
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ పార్టీగా అవతరించి లక్ష్యాన్ని చేరుకోవడంతో పాటు సుమారు తొమ్మిదిన్నరేళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పేరును మునుపటి మాదిరే తెలంగాణ రాష్ట్రసమితి (టీఆర్‌ఎస్)గా మార్చాలనే ఒత్తిడి పెరుగుతోంది. తొమ్మిది రోజులుగా జరుగుతున్న బీఆర్‌ఎస్ లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో ఈ మేరకు పార్టీ నాయకులు ముక్తకంఠంతో కోరుతున్నారు.
కిందిస్థాయి నేతల నుంచి వస్తున్న డిమాండ్‌కు పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు కూడా మద్దతు పలుకుతున్నారు. ఈ నెల 3 నుంచి పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్ వేదికగా ఈ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 22 వరకు ఇవి కొనసాగనున్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రులు హరీశ్‌రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి ఇతర ముఖ్య నేతలు ఈ భేటీల్లో పాల్గొంటున్నారు.
ఈ సందర్భంగా పార్టీ కేడర్ తమ అభిప్రాయాలు వెల్లడించేందుకు అవకాశం ఇస్తున్నా రు. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల సన్నద్ధత కంటే ఇటీ వలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలు, పార్టీ పనితీరు, సంస్థాగత నిర్మాణం లేకపోవడం వంటి అంశాలపైనే పెద్ద సంఖ్యలో సలహాలు, సూచనలు అందుతున్నాయి.
తెలంగాణ సెంటిమెంటుతో పెనవేసుకుపోయాం
ముఖ్యంగా రాష్ట్ర సాధన లక్ష్యంగా ఏర్పడిన టీఆర్‌ఎస్ పేరును బీఆర్‌ఎస్‌గా మార్చడాన్ని పార్టీ నేతలు ప్రస్తావిస్తున్నారు. ప్రజల్లో నేటికీ టీఆర్‌ఎస్‌గానే పా ర్టీకి గుర్తింపు ఉందని, పార్టీ పేరులో ‘తెలంగాణ’లేకపోవడంతో ఆత్మ లోపించినట్టుగా ఉందని చెప్తున్నారు. తెలంగాణఆత్మగౌరవంతో ముడిపడిన పార్టీ పేరులో ఆ పదం లేకపోవడం లోపంగా మారిందని, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ఇది కూడా ఓ అంశంగా పనిచేసిందని అంటున్నారు.
తెలంగాణ అనే సెంటిమెంటుతో సుమారు రెండు దశాబ్దాలకు పైగా తాము పెనవేసుకు పోయామని, పార్టీ పేరు మార్చడాన్ని తమతో పాటు కేసీఆర్ అభిమానులు, తెలంగాణ వాదులు జీర్ణించుకోలేక పో తున్నామని స్పష్టం చేస్తున్నారు. విపక్ష పార్టీలు, వారి కనుసన్నల్లో నడిచే మీడియా, డిజిటల్ వేదికలు, యూట్యూబ్ చానెళ్లు ఇదే అంశాన్ని ఎజెండాగా చేసుకుని తెలంగాణ రాష్ట్ర సాధనలో పార్టీ పోషించిన పాత్రను తక్కువగా చేసి చూపించే ప్రయత్నం చేశాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు టీఆర్‌ఎస్ పేరిట చివరగా పోటీ చేసిన మునుగోడులో గెలుపొందామని, బీఆర్‌ఎస్ పేరు పార్టీకి అచ్చిరాలేదనే సెంటిమెంటును కూడా కొందరు నేతలు లేవనెత్తుతున్నారు. పార్టీ పేరును మళ్లీ టీఆర్‌ఎస్‌గా మార్చాలనే తమ విన్నపాన్ని పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నారు. పార్టీ నేతల నుంచి వస్తున్న ఈ ప్రతిపాదనను సన్నాహక సమావేశాల్లో పాల్గొంటున్న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు సహా ఇతర కీలక నేతలు బలపరుస్తుండటం గమనార్హం.
జాతీయ స్థాయిలో కూటమికి ఓకే
జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకు అ వసరమైన భావసారూప్య పార్టీలతో కూటమి ఏర్పాటు చేసే కార్యక్రమానికి కేసీఆర్ నాయకత్వం వహిస్తే తమకు అభ్యంతరం లేదని పార్టీ నాయకులు నొక్కి చెప్తున్నారు. తెలంగాణ సాధించిన నేతగా జాతీయ స్థాయిలో కేసీఆర్‌కు మంచి పేరుందని అంటున్నారు. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా.. జాతీయ అంశాలకు సంబంధించి ఒత్తిడి పెంచేందుకు భావసారూప్య శక్తులతో కలిసి నడవాలనే సూచనలు కూడా ఈ భేటీల్లో వస్తున్నాయి.
కాగా ఈ నెల 22న భేటీలు పూర్తయిన తర్వాత పూర్తి స్థాయి నివేదిక రూపొందించి కేసీఆర్‌కు ఇవ్వాలని ముఖ్య నేతలు నిర్ణయించారు. కేసీఆర్ ఆమోదం తెలిపిన పక్షంలో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే లోపు పార్టీ పేరు మార్పు ప్రక్రియను పూర్తి చేస్తామని బీఆర్‌ఎస్ కీలక నేత ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.