Parliament Winter Sessions 2021: ఉభయ సభలు బుధవారానికి వాయిదా

Parliament Winter Sessions 2021 Live Updates Telugu Day 2 - Sakshi

Live Updates:
పార్లమెంట్‌ సమావేశాల్లో భాగంగా లోక్‌సభ  బుధవారానికి వాయిదా పడింది. 
పార్లమెంట్‌ సమావేశాల్లో భాగంగా రాజ్యసభ బుధవారానికి వాయిదా పడింది. 
► అంతకు ముందు త్వరలో డెంగ్యూ, టీబీ వ్యాక్సిన్లు అందుబాటులోకి తీసుకువస్తామని కేంద్రం ప్రకటించింది. రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది.

Time 12:04 PM
► సభలో 93% ఎంపీలు సక్రమంగా నడపాలని కోరుకుంటుండగా, కేవలం కొంతమంది ఎంపీలు మాత్రమే అంతరాయాన్ని కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు అసహనం వ్యక్తం చేశారు.

Time 12:02 PM..  ఆంధ్రప్రదేశ్‌కి తక్షణ సాయం విడుదల చేయండి
►ఆంధ్రప్రదేశ్‌లో సంభవించిన వరదల అంశాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి మంగళవారం రాజ్యసభ జీరో అవర్‌లో లేవనెత్తారు. నవంబర్‌ 16 నుంచి 18 తేదీల మధ్య దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కురిసిన అసాధారణ వర్షాల కారణంగా నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలను కనీవినీ ఎరుగని రీతిలో వరదలు ముంచెత్తాయని తెలిపారు. తక్షణ సాయం కింద 1000 కోట్ల రూపాయలు విడుదల చేసి రాష్ట్రాన్ని ఆదుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Time 11:56AM.. విపక్ష పార్టీల సమావేశానికి దూరంగా టీఎంసీ
►పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా రెండో రోజు జరిగిన ప్రతిపక్ష నేతల సమావేశానికి తృణమూల్ కాంగ్రెస్ దూరంగా ఉంది. ఈ సమావేశానికి కాంగ్రెస్, శివసేన, ఆమ్ ఆద్మీ సహా 16 పార్టీల నేతలు హాజరయ్యారు. ఇందులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు.

Time 11:41AM
► ఓ పక్క విపక్షాల ఆందోళనలు, మరో పక్క కొంతమంది ఎంపీలు రాజ్యసభను నుంచి వాకౌట్‌ చేయడంతో సభ సజావుగా సాగే పరిస్థితి కనిపించడం లేదు

Time 11:31AM.. సస్పెన్షన్‌పై  ఛైర్మన్ వెంకయ్య నాయుడు వివరణ
►12మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్‌పై రాజ్యసభలో వాడీవేడి చర్చ జరిగింది. సస్పెషన్‌ తొలగించాలని విపక్ష నేత మల్లికార్జున ఖర్గే కోరగా.. ఛైర్మన్ వెంకయ్యనాయుడు తిరస్కరించారు. గత సమావేశాల్లో  సభ్యులు విధ్వంసం సృష్టించారని .. వారిని సస్పెండ్‌ చేయడం న్యాయమే అన్నారు. చెయిర్‌కు క్షమాపణలు చెబితేనే.. సస్పెన్షన్‌ వేటును వెనక్కి తీసుకుంటామని స్పష్టంచేశారు. అయితే క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదన్న కాంగ్రెస్ సహా పలు విపక్షాలు.. రాజ్యసభ నుంచి వాకౌట్ చేశాయి. 

Time 11:24AM.. విపక్ష ఎంపీలు సస్పెన్షన్‌పై చర్చ.. క్షమాపణలు చెప్పం
► సస్పెన్షన్‌ అంశం రాజ్యసభను వేడెక్కిస్తోంది. రాజ్యసభ నుంచి 12మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్ నేపథ్యంలో.. పార్లమెంట్ ప్రాంగణంలో విపక్షాలు భేటీ అయ్యాయి. రాహుల్ గాంధీ నేతృత్వంలో సమావేశమైన విపక్ష ఎంపీలు సస్పెన్షన్‌పై చర్చించారు. టీఆర్‌ఎస్‌ ఎంపీలు నామా నాగేశ్వరరావు, కే.కేశవరావు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. సస్పెన్షన్ ఎత్తివేయకపోతే, రాజ్యసభ సెషన్‌ను బాయ్‌కాట్ చేయాలని విపక్షాలు యోచిస్తున్నాయి. 

Time 11:20AM
► పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వరుసగా రెండోరోజూ లోక్‌సభలో గందరగోళం నెలకొంది. రాజ్యసభలో 12మంది ఎంపీల సస్పెన్షన్‌పై కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై చర్చించాలంటూ టీఆర్‌ఎస్‌ ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఫ్లకార్డులు ప్రదర్శించారు. సభా వ్యవహారాలకు సహకరించాలని స్పీకర్​ ఓంబిర్లా పలుమార్లు విజ్ఞప్తిచేసినా.. విపక్ష సభ్యులు వెనక్కి తగ్గలేదు. కాంగ్రెస్​, డీఎంకే, టీఆర్‌ఎస్‌, నేషనర్​ కాన్ఫరెన్స్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. గందరగోళం నేపథ్యంలో లోక్‌సభను మధ్యాహ్నం 2గంటల వరకు స్పీకర్ ఓం బిర్లా వాయిదా వేశారు.

Time 11:12AM
► రాజ్యసభలో 12 మంది ఎంపీల సస్పెన్షన్‌ అంశాన్ని మల్లిఖార్జున ఖర్గే లేవనెత్తారు. సస్పెన్షన్‌ వెనక్కి తీసుకోవాలని విజప్తి చేశారు. 
► సస్పెన్షన్‌ ఎత్తివేసే ఆలోచనే లేదని స్పష్టం చేసిన చైర్మన్‌ వెంకయ్య నాయుడు

Time 11:00AM
► గందర​గోళం నుడుమ పార్లమెంట్‌ రెండో రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. 12 మంది సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని కాంగ్రెస్‌ లోక్‌సభలో డిమాండ్‌ చేస్తోంది. 

న్యూఢిల్లీ: శీతాకాల సమావేశాల్లో భాగంగా పార్లమెంటు రెండో రోజు సమావేశమవుతోంది. మంగళవారం లోక్​సభ ముందుకు రీప్రొడక్టివ్​ టెక్నాలజీ(రెగ్యులేషన్​) బిల్లు, 2020ని కేంద్ర ఆరోగ్యమంత్రి మన్​సుఖ్​ మాండవీయ తీసుకురానున్నట్లు తెలుస్తోంది. న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు కూడా హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీలు(శాలరీస్​ అండ్​ కండీషన్స్ ఆఫ్​ సర్వీస్) బిల్లు 2021ని సభ ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం. 

రాజ్యసభ నుంచి 12మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్ నేపథ్యంలో.. పార్లమెంట్ ప్రాంగణంలో విపక్షాలు భేటీ అయ్యాయి. రాహుల్ గాంధీ నేతృత్వంలో సమావేశమైన విపక్ష ఎంపీలు సస్పెన్షన్‌పై చర్చించారు. టీఆర్‌ఎస్‌ ఎంపీలు నామా నాగేశ్వరరావు, కే. కేశవరావు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. సస్పెన్షన్ ఎత్తివేయకపోతే, రాజ్యసభ సెషన్‌ను బాయ్‌కాట్ చేయాలని విపక్షాలు యోచిస్తున్నాయి. అయితే క్షమాపణలు చెబితేనే సస్పెన్షన్ తొలగిస్తామని కేంద్రం అంటోంది.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top