అలా చేయొద్దు.. లేని పక్షంలో పర్యవసానాలకు సిద్ధంకండి | Panchayat Elections: Ysrcp Issues Legal Notices To Sec And Dgp | Sakshi
Sakshi News home page

అలా చేయొద్దు.. లేని పక్షంలో పర్యవసానాలకు సిద్ధంకండి

Nov 24 2026 8:43 AM | Updated on Nov 24 2026 9:07 AM

Panchayat Elections: Ysrcp Issues Legal Notices To Sec And Dgp

సాక్షి, అమరావతి: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సుప్రీంకోర్టు ఆదేశాల అమలులో ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్, డీజీపీ, జిల్లా ఎస్పీ, రిటర్నింగ్‌ అధికారులకు వైఎస్సార్‌సీపీ లీగల్‌ నోటీసులు జారీ చేసింది. కోర్టు ధిక్కార చర్యలకు పాల్పడవద్దని అభ్యర్థించింది. లేని పక్షంలో పర్యవసానాలకు సిద్ధంగా ఉండాలని స్పష్టీకరించింది.

స్థానిక సంస్థల ఎన్నికలలో కాబోయే అభ్యర్థులందరూ నామినేషన్లను సజావుగా, ఎటువంటి ఆటంకం లేకుండా దాఖలు చేసేందుకు నామినేషన్‌ కేంద్రాల వద్ద తగిన పోలీసు బందోబస్తు కల్పించాలి. ఎన్నికల ప్రక్రియ అంతటా శాంతిభద్రతలను నిర్వహించాలి. నామినేషన్లు స్వీకరించే కేంద్రాలు, రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాలు, పోలింగ్‌ కేంద్రాలు, స్ట్రాంగ్‌ రూమ్‌లు, కౌంటింగ్‌ కేంద్రాల వద్ద వీడియోగ్రఫీ/సీసీటీవీ కెమెరా కవరేజీ ఏర్పాటు చేయాలి. ఎన్నికల పిటిషన్‌ దాఖలు చేయడానికి గడువు ముగిసే వరకు మరియు ఒకవేళ దాఖలు చేసినట్లయితే అది పూర్తిగా పరిష్కారమయ్యే వరకు ఆ ఫుటేజీని భద్రపరచాలి’’ అని వైఎస్సార్‌సీపీ పేర్కొంది.

‘‘పల్నాడు, వైఎస్సార్‌ కడప, తిరుపతి, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాలతో సహా జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో, మా పార్టీ అభ్యర్థులపై దాడులు జరిగాయి. వారిని అక్రమంగా నిర్బంధించారు. నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకున్నారు. నామినేషన్లను ఉపసంహరించుకునేలా బలవంతపెట్టారు. దీనిపై ఇప్పటిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు కూడా చేశాం.

..గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోలింగ్‌ ముగిసిన వెంటనే పోలింగ్‌ కేంద్రం వద్దే ఓట్లు లెక్కించబడతాయి కాబట్టి, ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద వీడియోగ్రఫీ/సీసీటీవీ కవరేజీ పోలింగ్‌ ప్రారంభమైనప్పటి నుండి ఓట్ల లెక్కింపు పూర్తి కావడం, ఫలితాల ప్రకటన, బ్యాలెట్‌ పేపర్లు, ఎన్నికల రికార్డులకు సీలు వేసే వరకు నిరంతరాయంగా ఉండాలి.

..ప్రతీ నామినేషన్‌ కేంద్రం వద్ద వీడియోగ్రఫీ/సీసీటీవీ కెమెరా కవరేజీ ఉండాలి. అనంతరం ఆ ఫుటేజీని భద్రపరచాలి. 27.10.2026న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు ఎన్నికల కమిషనర్‌తో సహా అందరూ కట్టుబడి ఉండాలి. సుప్రీంకోర్టు ఆదేశించిన విధంగా మొత్తం ఎన్నికల ప్రక్రియకు సీసీటీవీలను ఉపయోగించాలి. నామినేషన్‌ ప్రక్రియ మొదలు, కౌంటింగ్‌ పూర్తయ్యే వరకు ప్రతీ దశను సీసీటీవీ రికార్డింగ్‌ చేయాలి.

సీసీటీవీలను ఏర్పాటు చేయడంలో ఏదైనా వైఫల్యం జరిగినా, ఫుటేజీ ధ్వంసం చేయడం, తొలగించడం లేదా భద్రపరచకపోవడం జరిగినా, లేదా సదరు ఆదేశాలను మరే విధంగానైనా పాటించకపోయినా, అది సుప్రీంకోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించినట్లే. ఇలా చేయడం కోర్టు ధిక్కారంగా పరిగణించబడుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 129 ప్రకారం శిక్షార్హమవుతుంది.

ఇందుకు బాధ్యులైన అధికారులపై వ్యక్తిగత హోదాలో కోర్టు ధిక్కార చర్యలు ప్రారంభించాల్సి ఉంటుంది. తదుపరి ఎలాంటి నోటీసు లేకుండా సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది. ఇందుకు పూర్తి పర్యవసానాలను మీరే ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని లీగల్‌ నోటీసుల్లో వైఎస్సార్‌సీపీ హెచ్చరించింది.

ఇదీ చదవండి: బాబు ‘చీకటి గెలుపు’ బట్టబయలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement