రసవత్తరం: వ్యతిరేకతపై విపక్షాల ఆశలు

Opposition Parties Eyes On Dubbaka By Poll - Sakshi

అనుకూల ఓట్లపై  పార్టీల లెక్కలు

సంక్షేమం, సానుభూతి టీఆర్‌ఎస్‌ బలం

ముంపు గ్రామాల ఓట్లు,  ప్రభుత్వ వ్యతిరేకతపై విపక్షాల ఆశలు

కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర నాయకత్వమంతా దుబ్బాకలో తిష్టవేసి ప్రచారం చేస్తోంది. ఓ వైపు ప్రచారం చేస్తూనే.. ఏ ఏ వర్గాలు తమకు అనుకూలంగా ఉన్నాయని లెక్కలు వేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి మాత్రం అన్నీ తానై మంత్రి హరీశ్‌రావు తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. సంక్షేమ పథకాలతోపాటు, రామలింగారెడ్డి మృతితో వచ్చే సానుభూతి అనుకూలించి అత్యధికంగా ఓట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు మల్లన్న సాగర్‌ ముంపు గ్రామాల్లోని ఓట్లు, ప్రభుత్వ వ్యతిరేకత తమకు అనుకూలిస్తుందని ఆశలు పెట్టుకున్నారు.

సాక్షి, సిద్దిపేట : సంక్షేమ పథకాల్లో దుబ్బాక నియోకవర్గంలో దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, రాయపోలు, దౌల్తాబాద్, నార్సింగ్, చేగుంట మండలాల పరిధిలో ఇప్పటి వరకు 78,187 మంది రైతులకు రైతుబంధు, 52,823 మంది వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, నేత, గీత, బీడీ కార్మికులకు ఆసరా పెన్షన్లు, 5,599 మందికి కల్యాణ లక్ష్మి, 322 మందికి షాదీ ముబారక్‌ చెక్కులతోపాటు, 30,732 మందికి కేసీఆర్‌ కిట్స్‌ అందజేశారు. ఇలా నియోజకవర్గంలో 1,67,663 మందికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా అందాయి. వీరందరూ ప్రభుత్వంపై విధేయతతో ఉండటంతో వారి ఓట్లు తమకే పడుతాయని టీఆర్‌ఎస్‌ నాయకులు లెక్కలు వేస్తున్నారు. మృతి చెందిన రామలింగారెడ్డి భార్య సుజాతను పోటీలో దింపడంతో సానుభూతి కూడా తోడవుతందని చర్చిస్తున్నారు. నియోజకవర్గంలో 1,97,468 మంది ఓటర్లు ఉండగా గత ఎన్నికల్లో 89,299 టీఆర్‌ఎస్‌ పార్టీకి రాగా సమీప అభ్యర్థి మద్దుల నాగేశ్వర్‌రెడ్డికి 26,779 ఓట్లు మాత్రమే వచ్చి 62,520 ఓట్ల మెజార్టీతో రామలింగారెడ్డి గెలుపొందారు. అయితే ఈ సారి మెజార్టీ లక్ష దాటుతుందని టీఆర్‌ఎస్‌ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. (ఫేక్‌ వీడియో: బీజేపీ నేతపై కేసు)
 
వ్యతిరేక పవనాలపై విపక్షాల ఆశలు 
ఉప ఎన్నికలో విపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లతోపాటు, మల్లన్న సాగర్‌ రిజర్వాయర్‌లో ముంపునకు గురైన గ్రామాల ఓటర్లపై ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. 50 టీఎంసీల సామర్థ్యంలో 26 కిలోమీటర్ల చుట్టుకొలతో నిర్మించిన మల్లన్న సాగర్‌ రిజర్వాయర్‌లో తొగుట మండలంలోని వేముఘాట్, తురుక బంజరుపల్లి, పల్లెపాడు, దస్తగిరి నగర్, పల్లెపాడు తండ, ఏటిగడ్డ కిష్టాపూర్, తిరుమలగిరి, తండ, లక్ష్మాపూర్,రాంపూర్, వడ్డెర కాలనీ, బి–బంజరు పల్లి మొత్తం ఆరు గ్రామ పంచాయతీలు, ఆరు మధిర గ్రామాలతోపాటు తుక్కాపూర్, తోగుట గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురయ్యాయి. ఈ గ్రామాల్లో 10వేల ఓటర్లు ఉంటారు. వీరికి  కాంగ్రెస్, బీజేపీ నాయకులు మద్దతుగా నిలిచారు. వారందరూ తమకే ఓటు వేస్తారు అంటే తమకే వేస్తారని బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. (రాములమ్మ రాజకీయం ముగిసినట్లేనా..?)

ఇలా రైతులకు రావల్సిన నష్టపరిహారం, ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీ సంబంధిత వివరాలను అక్కడి ప్రజలకు వివరిస్తూ  మొత్తం ఓటర్లను తమ వైపు తప్పుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.  అదే విధంగా ఎల్‌ఆర్‌ఎస్‌పై వ్యతిరేకత, 57 సంవత్సరాలకే పెన్షన్‌ పథకం అమలు చేయకపోవడం, డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం, ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం, రైతు రుణమాఫీ చేయలేదు, నిరుద్యోగులకు భృతి లాంటి అంశాలు తమకు అనుకూలిస్తాయని విపక్ష పార్టీలు ఆశలు పెంచుకుంటున్నాయి. ఇలా దుబ్బాక ఎన్నికలో రాజకీయ పార్టీలు ఏ చిన్న అవకాశాన్ని కూడా జారవిడువకుండా ఓటు బ్యాంకుగా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నారు.  

పోటీలో 23 మంది 
దుబ్బాకటౌన్‌ : దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల బరిలో 23 మంది అభ్యర్థులు నిలిచారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు మొత్తం 46 మంది అభ్యర్థులు 103 సెట్ల నామినేషన్లు వేసిన విషయం తెలిసిందే. శనివారం అధికారులు నిర్వహించిన స్క్రూట్నీలో 12 మంది అభ్యర్థుల నామినేషన్లు పలు కారణాలతో తిరస్కరించారు. దీంతో 34 మంది అభ్యర్థులు మిగలగా సోమవారం సాయంత్రం నామినేషన్ల ఉపసంహరణ గడువు వరకు 11 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో చివరకు పోటీలో 23 మంది అభ్యర్థులు నిలిచారని రిటర్నింగ్‌ అధికారి చెన్నయ్య తెలిపారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top