ఆలపాటి ఔట్‌.. అధికారికంగా చెప్పేసిన లోకేష్‌

No ticket for Alapati Rajendra Prasad - Sakshi

సీటు లేదని తేల్చిన లోకేశ్‌

తెనాలి: తెనాలి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీకి ప్రయత్నాలు చేస్తున్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ ఆశల అడియాసలయ్యాయి. ఆయనకు పార్టీ టికెట్‌ లేదని సాక్షాత్తూ నారా లోకేశ్‌ మంగళ వారం తేల్చి చెప్పేశారు. 2024 ఎన్నికలకు జనసేన, టీడీపీ పొత్తుల నేపథ్యంలో తెనాలి నుంచి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ రంగం సిద్ధం చేసుకుంటున్న విషయం తెలిసిందే.

తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్‌ పోటీచేస్తారని, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ రెండు నెలల క్రితమే మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో తెనాలి జనసేన నేతలకు స్పష్టంచేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ పార్టీ వర్గాలను మభ్యపెడుతూ తానూ పోటీలో ఉన్నట్టుగా ప్రచారం చేసుకుంటూ వచ్చారు ఆలపాటి. పైగా ప్రజా చైతన్యయాత్ర పేరుతో నియోజకవర్గంలో పాదయాత్ర కూడా చేపట్టారు. వార్డులవారీ సమావేశాల్లో పాల్గొంటున్నారు.

నాదెండ్ల మనోహర్‌తో పోలిస్తే పార్టీ సర్వేలో తనకే ఎక్కువ స్కోరు ఉన్నట్టుగా  కార్యకర్తలు, నాయకులకు చెప్పారు. చివరి నిముషంలో తనకే టికెట్‌ వస్తుందని నమ్మబలుకుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మంగళ­వారం దీనిపై స్పష్టత ఇచ్చినట్టు తెలిసింది. గుంటూరు ఎంపీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తే చెయ్‌... లేదంటే నీదారి నువ్వు చూసుకొమ్మని లోకేశ్‌ చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం.

బుర్రిపాలెంకు చెందిన ప్రవాస భారతీ­యుడు పెమ్మసాని చంద్రశేఖర్‌ ఇప్పటికే గుంటూరు ఎంపీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసేందుకు సన్నాహాల్లో ఉన్నారు. దీనితో ఆలపాటికి ఏం చేయాలో పాలుపోవటం లేదంటున్నారు.

whatsapp channel

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top