బినామీ ఉద్యమానికి దళితుల రంగు

Nandigam Suresh Fires On Chandrababu Naidu - Sakshi

చంద్రబాబుది ఉద్యమం కాదు.. ఉన్మాదం 

ఉద్యమం చేస్తోంది బాబు ఆత్మబంధువులే  

‘పసుపు మహిళలు’ దళితులు కాదు 

బాబు మనసంతా అమరావతి భూముల మీదే  

వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగం సురేష్‌ 

సాక్షి, అమరావతి: అమరావతి పేరుతో చంద్రబాబు చేస్తున్నది ఉద్యమం కాదని, ఉన్మాదమని వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగం సురేష్‌ తీవ్రంగా విమర్శించారు. అమరావతి ఉద్యమం ఎందుకు? ఎవరికోసం చేశారో బాబుతో సహా అందరికీ తెలుసన్నారు. అమరావతి అనే బినామీ ఉద్యమానికి ఇప్పుడు చంద్రబాబు సరికొత్తగా దళితుల రంగు వేయాలని ప్రయత్నిస్తున్నాడని ధ్వజమెత్తారు. అమరావతి ఉద్యమం అంటూ వచ్చిన పసుపు మహిళల సామాజికవర్గం ఏమిటో అందరికీ తెలుసని, పట్టుమని పదిమంది కూడా లేని ఆ గ్రూపులో ప్రతి ఒక్కరు మిలియనీర్లు లేదంటే బాబు బినామీలు లేదంటే బాబు ఆత్మబంధువులే అని వ్యాఖ్యానించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

టీడీపీ పాలనలో అమరావతి ఎక్కడ అభివృద్ధి చెందిందో చెప్పాలని నిలదీశారు. దళితుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని మండిపడ్డారు. దళితులకు సీఎం జగన్‌ ఇళ్ల పట్టాలు ఇస్తుంటే చంద్రబాబు అడ్డుకున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు మనసంతా అమరావతి భూముల మీదే ఉందన్నారు. దమనకాండ అంటే.. బషీర్‌బాగ్‌లో మాదిరి రైతుల గుండెలపై తుపాకులు పేల్చి చంపేయడం, గుర్రాలతో తొక్కించడం అని చెప్పారు. బషీర్‌బాగ్‌లో రైతులపై కాల్పులు జరిపిన చరిత్ర చంద్రబాబుదని గుర్తుచేశారు. అమరావతిలో జరిగేది ఆస్తుల ధరలు కాపాడుకోవటం కోసం ఉన్మాదుల్లా తయారైన బాబు బినామీలు చేసే రియల్‌ ఎస్టేట్‌ ఉద్యమం అని పేర్కొన్నారు. 

మామూలు రోజుల్లో ఒక్కరూ కనిపించరు 
మామూలు రోజుల్లో అమరావతి దీక్షల్లో ఒక్కరూ కనిపించరని, ధర్నాలు, 600వ రోజుల పండుగలకు మాత్రం జనాలు పోగవుతారని, ఇదంతా లేని ఉద్యమానికి హైప్‌ క్రియేట్‌ చేయడం కోసమేనని విమర్శించారు. రాష్ట్రంలో దళితుల ప్రయోజనాల్ని అణగదొక్కినవారే రోడ్లెక్కి మాట్లాడుతుంటే దళిత సమాజం నవ్వుకుంటోందని చెప్పారు. రాష్ట్రంలో దళితులను అణగదొక్కడంలో చంద్రబాబుది ప్రత్యక్షపాత్ర అయితే, పరోక్షపాత్ర ఈనాడు, ఏబీఎన్, టీవీ5లదన్నారు. అమరావతి పేరుతో 600వ రోజు ఉద్యమం సందర్భంగా మాట్లాడిన భాష జుగుప్సాకరమని, రాష్ట్ర ప్రజలంతా చూశారని చెప్పారు.  చంద్రబాబుకు ఎప్పుడు కష్టాలు వచ్చినా దళితులను తెరపైకి తెస్తాడని, వారిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తాడని విమర్శించారు.  

దళితులను వంచించి అసైన్డ్‌ భూముల కొనుగోలు 
దళితులను వంచించి అసైన్డ్‌ భూములు కొనుగోలు చేయడం, ల్యాండ్‌ పూలింగ్‌ డ్రామా జరుగుతున్న రోజుల్లో గొంతెత్తిన దళితులను అధికార వ్యవస్థతో బెదిరించడం.. వీటిని అన్యాయం అంటారని, ఇవి చేసింది టీడీపీ నేతలేనని చెప్పారు. చంద్రబాబు అసలు అమరావతిలో ఎక్కడ అభివృద్ధి చేస్తే, అది ఎక్కడ ధ్వంసం అయిందో నిరూపిస్తే బాగుండేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కష్టపడి పనిచేస్తున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి ఇప్పటికైనా అమరావతి వాసులు మద్దతివ్వాలని కోరారు. అంతేగానీ కులపిచ్చి, డబ్బుపిచ్చి, అధికారం పిచ్చితో మాట్లాడే చంద్రబాబుకు కొమ్ముకాయవద్దని హితువు పలికారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top