ఎన్టీఆర్ హంతకులకు ఆయనపై ప్రేమ ఉందా!  | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్ హంతకులకు ఆయనపై ప్రేమ ఉందా! 

Published Tue, Sep 27 2022 3:58 AM

Nandamuri Lakshmi Parvathi comments on Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: ఎన్టీఆర్ హంతకులకు ఆయనపై ప్రేమ ఉందా అని ఏపీ తెలుగు అకాడమీ చైర్‌పర్సన్, వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. ఎన్టీఆర్ హంతకులే హెల్త్‌ యూనివర్సిటీకి ఆయన పేరు ఉంచాలంటూ కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఎన్టీఆర్‌పై చంద్రబాబులా ద్వేషం గానీ, శత్రుత్వం గానీ లేవని, పైగా గౌరవం, అభిమానం ఉన్నాయని తెలిపారు. అందువల్లే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టారని తెలిపారు.

ఎన్టీఆర్‌ పేరు జిల్లాకు ఉండాలా.. యూనివర్సిటీకి ఉండాలా అంటే.. జిల్లాకే తన ఓటు అని స్పష్టంచేశారు. జిల్లా అనేది పెద్దదని, యూనివర్సిటీ అన్నది చిన్నది అని విమర్శించే వారు తెలుసుకోవాలన్నారు. హెల్త్‌ యూనివర్సిటీకి ఆరోగ్యశ్రీ సృష్టికర్త, రూపాయి వైద్యుడిగా పేరు గడించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరు పెట్టడమే సముచితమని అన్నారు.

ఆమె సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆనాడు ఎల్లో మీడియాలో ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా వచ్చిన వార్తలను ప్రదర్శించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న రాకుండా అడ్డుపడ్డవారు ఆయన్ను గౌరవిస్తారంటే ప్రజలు నమ్ముతారా అని లక్ష్మీపార్వతి అన్నారు.

ప్రతి మహానాడులో ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేయడం, చెత్తబుట్టలో వేయడం పరిపాటని తెలిపారు. 14 ఏళ్ళు సీఎంగా ఉన్న చంద్రబాబు.. ఎన్టీఆర్‌ గౌరవార్థం ఏం చేశారని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు చంద్రబాబుకు వంతపాడి కన్న తండ్రినే చంపుకున్నారని చెప్పారు. ఆయన గౌరవాన్ని కాపాడలేని వారు బిడ్డలు ఎలా అవుతారని ప్రశ్నించారు. ఇప్పటికీ పశ్చాత్తాపం కలగదా అని అన్నారు. 

ఎన్టీఆర్‌ జీవితంలోకి తాను వచ్చాకే వసంతం వచ్చిందని లక్ష్మీపార్వతి చెప్పారు. ఆయన బతికి ఉన్నప్పుడు తన కాళ్ళు మొక్కినవారే, ఇప్పుడు తిడుతున్నారన్నారు. బాబుతో కుమ్మక్కై రామోజీ ఆనాడు ఎన్టీఆర్‌పై తప్పుడు రాతలు రాశారని, ఇప్పుడూ సీఎం జగన్‌పై దు్రష్పచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఎన్టీఆర్‌ను బాబు అండ్‌ కో హత్య చేశారా లేదా అని రామోజీ, రాధాకృష్ణలను నిలదీశారు. రాజకీయానికే కాదు కులానికి కూడా గౌరవం తెచ్చిన ఒక పెద్దను సజీవ దహనం చేసింది వీరే కదా అని అన్నారు. స్పీకర్‌ పదానికి అగౌరవం తెచ్చిన వ్యక్తి యనమల రామకృష్ణుడు అని మండిపడ్డారు. రాధాకృష్ణ  చెత్త పలుకులకు తాను భయపడనని చెప్పారు. 

ఎన్టీఆర్‌పై నాకున్న అభిమానం అందరికీ తెలుసు 
ఎన్టీఆర్‌పై తనకున్న అభిమానం అందరికీ తెలుసునన్నారు. పిచ్చి పిచ్చి కార్టూన్లతో ఎన్టీఆర్‌ వ్యక్తిత్వాన్ని కించపరిచింది పచ్చమీడియానే అని చెప్పారు. తాను ఏనాడూ పదవుల కోసం తాను ఆశపడలేదన్నారు.  ఇందుకు ఆయన ఇంటర్వ్యూలలో చెప్పిన మాటలే సాక్ష్యమన్నారు. టెక్కలి, గోరంట్ల నియోజకవర్గాల్లో పోటీ చేయాలని ఎన్టీఆర్, ఆయన అభిమానులు కోరినా వద్దని చెప్పానని అన్నారు.

ఎన్టీఆర్‌ భార్య పదవికి మించింది తనకు ఏదీ లేదని చెప్పానన్నారు. లక్ష్మీపార్వతి భార్య మాత్రమే కాదని, తల్లిలాంటిదని ఆనాడు ఎన్టీఆర్‌ చెప్పారని గుర్తు చేశారు. పత్రికల్లో వచ్చినవి రామోజీ, రాధాకృష్ణ, చంద్రబాబు చదవలేదా అని ప్రశ్నించారు. ఈనాడు అబద్ధపు రాతలను ఎన్టీఆర్‌ ఆనాడే తప్పుబట్టారని చెప్పారు. ఎన్టీఆర్‌కు అన్యాయం చేయనని చంద్రబాబు ఆనాడు లోకేశ్‌ మీద ప్రమాణం చేసి మాట తప్పలేదా అని నిలదీశారు.

తాను అడ్డుపడి ఉంటే ఎన్టీఆర్‌ కేబినెట్‌లో చంద్రబాబుకు ఫైనాన్స్, రెవెన్యూ వంటి కీలక శాఖలు దక్కేవి కాదని చెప్పారు. ఎన్టీఆర్‌ అసలు తనను పెళ్లి చేసుకోలేదని, ఆ ఇంటి పేరు వాడుకునే హక్కు తనకు లేదంటూ అతి దారుణంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

చంద్రబాబు అధికార వ్యామోహాన్ని ఎదిరించినందుకే మహిళనైన తనపై విషప్రచారం చేస్తున్నారని అన్నారు. వారి ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు కదా? ఇది సమంజసమా అని ప్రశ్నించారు. తమ పెళ్లి గురించి తప్పుగా మాట్లాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. 

రామోజీ, రాధాకృష్ణలకు  బుద్ధీ, జ్ఞానం ఉందా?
ఎన్టీఆర్‌కు చేసిన ద్రోహాన్ని, అధికార దాహాన్ని కప్పిపుచ్చుకోవడానికి పచ్చ మీడియా, టీడీపీ సోషల్‌ మీడియా తనపై విష ప్రచారం చేస్తోందని చెప్పారు. అసలు రామోజీ, రాధాకృష్ణలకు బుద్ధీ, జ్ఞానం ఉందా.. వెన్నుపోటును అధికార మార్పు అంటారా అని ప్రశ్నించారు.

పత్రికాధిపతులని చెప్పుకోవటానికి వారు అనర్హులని చెప్పారు. అధికార దాహంతో చంద్రబాబు, లోకేశ్‌లు ఎల్లో మీడియాతో కలిసి చేసే దు్రష్పచారాలను, వెన్నుపోటుదారుల మాటలను నమ్మొద్దని ప్రజలను కోరారు.   

Advertisement
 
Advertisement
 
Advertisement