
పదకొండు రాష్ట్రాల అధ్యక్షులను ప్రకటించామని.. త్వరలోనే అన్ని రాష్ట్రాలకు ప్రకటిస్తామని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు.
సాక్షి, హైదరాబాద్: పదకొండు రాష్ట్రాల అధ్యక్షులను ప్రకటించామని.. త్వరలోనే అన్ని రాష్ట్రాలకు ప్రకటిస్తామని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. మరో వారం, పది రోజుల్లో మన రాష్ట్ర అధ్యక్షుడి నియామకం పూర్తవుతుందన్నారు. దక్షిణాది వ్యక్తికి జాతీయ అధ్యక్ష పదవి అని ఎక్కడా చర్చ లేదని ఆయన పేర్కొన్నారు.
‘‘డీపీఆర్ సర్వే సక్రమంగా చేయకపోతే ట్రిపుల్ ఆర్ వెనక్కి వెళ్తుంది. బీఆర్ఎస్ చేసిన తప్పునే కాంగ్రెస్ చేస్తే ఎట్లా?. బీసీల్లో పది శాతం ముస్లింలను కలపకపోతే ఆమోదిస్తాం. కుల గణన తప్పుల తడకగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డికి అవగాహన లేదు. జన గణన చేసిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ ఖరారు చేస్తారు. దక్షిణాదిలో ఒక్క పార్లమెంటు సీటు తగ్గదని ప్రధాని చెప్పారు. 2011తో పోలిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో జనాభా తగ్గింది. జనాభా తగ్గినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంటు సీట్లు తగ్గవు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో 153 అసెంబ్లీ సీట్లు తెలంగాణాలో పెంచుకోవచ్చని పొందుపరిచారు’’ అని లక్ష్మణ్ చెప్పారు.