కాంగ్రెస్‌లో చేరికలు.. అలకలు

Most Of Leaders From Congress Party Growing Voices Of Dissent - Sakshi

కాంగ్రెస్‌ పార్టీలో పెరుగుతున్న అసమ్మతి స్వరాలు

చేరికలపై తమతో చర్చించాలని డిమాండ్‌ చేస్తున్న

స్థానిక నేతలు.. ఎర్ర శేఖర్, ప్రవీణ్‌రెడ్డి, ఆరేపల్లి

తదితరుల రాకను వ్యతిరేకిస్తున్న వైనం 

సాక్షి,హైదరాబాద్‌: ‘ఒక్క చేరిక.. రెండు అసంతృప్తులు’ అన్నట్లుగా కాంగ్రెస్‌ పరిస్థితి ఉందనే చర్చ కార్యకర్తల్లో సాగుతోంది. కొత్త చేరికలు పాతవారి అలకలకు కారణమవుతున్నాయి. చేరికలతో కాంగ్రెస్‌ పార్టీ బలపడుతోందని భావిస్తున్న తరుణంలో కొంతమంది పాతనేతల అసంతృప్తి క్యాడర్‌ను నిరుత్సాహానికి గురిచేస్తోంది. తమతో చర్చించకుండానే కొత్తవారిని ఎలా చేర్చుకుంటారంటూ బహిరంగంగా ప్రశ్నిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్‌ పార్టీలో జరిగిన, జరుగుతున్న అసంతృప్తి సెగలు ఎటు వైపు తీసుకెళ్తాయోనన్న ఆందోళన పార్టీ నేతలు, కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది.   

ప్రవీణ్‌రెడ్డిని వ్యతిరేకిస్తున్న బొమ్మ
కరీంనగర్‌ జిల్లా హుస్నాబాద్‌ నియోజకవర్గం నుంచి 2009లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలిచిన అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి 2014లో ఓటమి పాలైన తర్వాత టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఆ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న కుమారుడు శ్రీరాంచక్రవర్తి కాంగ్రెస్‌ పార్టీలోనే ఉంటూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రవీణ్‌రెడ్డి తిరిగి పార్టీలోకి రానున్నారని వస్తున్న వార్తలతో శ్రీరాం అప్రమత్తమై తన అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రవీణ్‌రెడ్డి చేరికను వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారు. 

కవ్వంపల్లికి ఆరేపల్లి ఎఫెక్ట్‌
కరీంనగర్‌ జిల్లాలోని మరో నియోజకవర్గమైన మానకొండూరులో జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణకు మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్‌ చేరే అంశంపై అసంతృప్తి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మానకొండూరు నుంచి 2009లో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేగా మోహన్‌ గెలిచి 2014, 2018 ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిపోయారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి కవ్వంపల్లి టికెట్‌ ఆశిస్తున్నారు. 

ఇటీవలి చేరికలపై...     
మంచిర్యాల జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు చేరిక వ్యవహారంపై ఆ జిల్లా నేత, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు అసంతృప్తిగా ఉన్నట్టు తెలిసింది. తనతో చర్చించకుండానే పార్టీలోకి చేర్చుకోవడంపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఇటీవల మంచిర్యాల నుంచి కొంతమంది నేతలను రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కాకుండా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సమక్షంలో పార్టీలో చేర్పించి తన అసంతృప్తిని పరోక్షంగా వ్యక్తం చేశారనే చర్చ జరుగుతోంది.  

దివంగత సీఎల్పీ నేత పీజేఆర్‌ కూతురు, టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ విజయారెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరడం ఆమె సోదరుడు, జూబ్లీహిల్స్‌ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డిని ఆగ్రహానికి గురిచేసినట్టు తెలుస్తోంది. తనకు సమాచారం ఇవ్వకుండా తన సోదరిని పార్టీలోకి ఎలా తీసుకుంటారంటూ విష్ణు సీనియర్లతో విందు భేటీ నిర్వహించడం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.  

ఎర్ర శేఖర్‌.. కోమటిరెడ్డి
టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్న వారంలోనే పార్టీలోకి వస్తానని ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే శేఖర్‌ ప్రకటించారు. అయితే అక్కడ కాంగ్రెస్‌ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అనుచరుడు అనిరుధ్‌రెడ్డి టికెట్‌ ఆశిస్తున్నారు. దీంతో శేఖర్‌ను పార్టీలోకి ఆహ్వానిస్తే తీవ్ర పరిణామాలుంటాయని గతంలోనే అంతర్గత చర్చల్లో కోమటిరెడ్డి వ్యాఖ్యానించినట్టు చెప్తున్నారు.    

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top