ఆర్వో నుంచి విజయం ధ్రువీకరణ పత్రాన్ని స్వీకరిస్తున్న మొల్లిలక్ష్మి
విశాఖపట్నం: జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 19వ వార్డు అభ్యర్థి మొల్లి లక్ష్మి హ్యాట్రిక్ విజయం సాధించారు. 2007, 2023, 2026లో జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు గెలిచి ఈ రికార్డును సొంతం చేసుకున్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో సమీప టీడీపీ అభ్యర్థి గుడ్ల విజయసాయిపై 98 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దీంతో వరుసగా మూడోసారి విజయం సాధించిన ఘనత దక్కించుకున్నారు.
మొల్లి లక్ష్మి తొలిసారిగా 2007 జీవీఎంసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై 850 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అనంతరం 2023లో జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి టీడీపీ అభ్యర్థిపై 1,250 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. తాజాగా 2026 ఎన్నికల్లోనూ విజయం సాధించి వరుసగా మూడు జీవీఎంసీ ఎన్నికల్లో గెలిచిన రికార్డును నమోదు చేశారు.
మొల్లి లక్ష్మికి అభినందనలు
జీవీఎంసీ ఎన్నికల్లో 19వ వార్డు నుంచి మొల్లి లక్ష్మి అప్పారావు విజయం సాధించిన సందర్భంగా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఆమెకు పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. వరుసగా మూడు సార్లు విజయం సాధించి హ్యాట్రిక్ సాధించడంపై అభినందనలు వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో 18వ వార్డు అధ్యక్షుడు కణితి మరియుదాస్, ఉపాధ్యక్షుడు బుగత యేసురత్నం, మహిళా అధ్యక్షురాలు అర్జీ వెంకట్ లక్ష్మి, బీసీ సెల్ అధ్యక్షుడు వేగి వెంకట్రావు, ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు మహమ్మద్ కరిముల్లా, వార్డు స్టూడెంట్ వింగ్ అర్జీ తరుణ్, వార్డు కార్యదర్శి కాళ్లపులి రాజు, వార్డు సీనియర్ నాయకులు గొటివాడ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.


