కరకట్ట నుంచే అక్రమాలకు లోకేష్‌ ప్లాన్‌: రవీంద్రనాథ్‌ రెడ్డి | YSRCP Ravindranath Reddy Serious On Nara Lokesh | Sakshi
Sakshi News home page

కరకట్ట నుంచే అక్రమాలకు లోకేష్‌ ప్లాన్‌: రవీంద్రనాథ్‌ రెడ్డి

Nov 4 2026 1:04 PM | Updated on Nov 4 2026 1:18 PM

YSRCP Ravindranath Reddy Serious On Nara Lokesh

సాక్షి, వైఎస్సార్ జిల్లా: రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని వైఎస్సార్‌సీపీ నాయకులు రవీంద్రనాథ్‌ రెడ్డి విమర్శించారు. ఈ ఎన్నికలు నకిలీ ఎన్నికలను తలపించాయని ఆరోపించారు. అధికార బలం, పోలీసుల అండతో ఎన్నికల ఫలితాలను తారుమారు చేశారని మండిపడ్డారు.

కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..‘ఎన్నికల్లో చోటుచేసుకున్న పరిణామాలను రాష్ట్ర ప్రజలంతా గమనించారు. టీడీపీ నాయకులు ముందుగానే ఇంటింటికీ తిరిగి ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారని, తమకు ఓట్లు పడే పరిస్థితి లేదని గుర్తించడంతో ముందస్తు ప్రణాళిక ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల అక్రమాలకు తెరలేపారు. అధికారులను, పోలీసులను అడ్డుపెట్టుకుని అధికార బలంతో ఎన్నికల్లో గెలవాలని చూశారు. ఈ ఎన్నికల్లో జరిగిన అక్రమాలన్నింటికీ కరకట్ట నుంచి నారా లోకేష్ కారణమని ఆరోపించారు.

ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు కాదు. అధికార బలం, పోలీసుల సహకారంతో సాధించిన ఫలితం. పోలీసు, అధికార యంత్రాంగంతో పాటు ఎన్నికల కమిషన్‌ కూడా అధికార పార్టీకి సహకరించింది. సుప్రీంకోర్టు స్పందించడంతో రాష్ట్రంలో జరిగిన ఎన్నికల పరిణామాలు జాతీయ స్థాయికి చేరాయి. పోలీసులు, రౌడీలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నించినప్పటికీ.. ఓటర్లు స్వచ్ఛందంగా వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేశారు. కౌంటింగ్‌ కేంద్రంలోనూ పోలీసుల సమక్షంలోనే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై దాడులు జరిగాయి. ఎన్ని దాడులు, బెదిరింపులు ఎదురైనా వెనక్కి తగ్గకుండా నిలబడిన ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు’ చెప్పుకొచ్చారు.

అలాగే, కడప జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీకి ప్రజల మద్దతు ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణ, బలానికి ఈ ఎన్నికలే నిదర్శనమని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీకి కడప ఎప్పటికీ కంచుకోటేనని స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చదవండి: టీడీపీలో కానరాని గెలుపు కళ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement