కేటీఆర్‌పై విరుచుకుపడ్డ కవిత.. నాతో పెట్టుకోవద్దు.. | MLC Kavitha Serious Comments On BRS Party | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌పై విరుచుకుపడ్డ కవిత.. నాతో పెట్టుకోవద్దు..

May 29 2025 11:16 AM | Updated on May 29 2025 12:22 PM

MLC Kavitha Serious Comments On BRS Party

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌లో ఉన్న కోవర్టులే తనను ఓడించారని చెప్పుకొచ్చారు. కేసీఆర్‌ ఇంటి ఆడ బిడ్డపైనే పేయిడ్‌ వార్తలు రాయిస్తున్నారు. లేఖ ఎవరు బయటపెట్టారో చెప్పమంటే నాపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో కేటీఆర్‌ను టార్గెట్‌ చేసి విమర్శలు చేశారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా చేయాల్సిన పనులు చేయాలి.. కేవలం ట్వీట్లకే పరిమితం అయితే ఎలా? అని ప్రశ్నించారు. తనది బీఆర్‌ఎస్‌ పార్టీనే. కొత్త పార్టీలు ఎందుకు?. ఉన్న పార్టీని, కేసీఆర్‌ను కాపాడుకుంటే సరిపోతుంది. లీక్ వీరులను బయట పెట్టండి అంటే గ్రీక్ వీరులు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు. 

ఎమ్మెల్సీ కవిత తాజాగా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ..  ఏది ఉన్నా నేను సూటిగానే మాట్లాడతాను. వెన్నుపోటు రాజకీయాలు చేయను. నేను కేసీఆర్‌ లాగే నేను ఏదైనా సూటిగానే మాట్లాడతాను. తిక్క తిక్కగానే ఉంటాను. పార్టీని నడిపించే సత్తా మీకు లేదు.. నాకు నీతులు చెబుతున్నారా?. వరంగల్‌ మీటింగ్‌ సక్సెస్‌ అయ్యిందని చెప్పుకుంటున్న వాళ్లను చూసి జనం నవ్వుకుంటున్నారు. ఏమైనా ఉంటే.. పార్టీ ఫోరమ్‌ లోపల మాట్లాడాలి అన్నారు. నేను బయటే మాట్లాడతాను. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ సోయితో పరిపాలన జరగట్లేదు అని అన్నారు. నాకు వెన్నుపోటు రాజకీయాలు తెలియదు.. ఏది ఉన్నా నేను ముక్కు సూటిగానే మాట్లాడతాను.

ట్వీట్లకే పరిమితం అయితే ఎలా?..
అంతర్గత విషయాలపై లేఖ రాస్తే ఎందుకు బయటపెట్టారు. నేను రాసిన లేఖను ఎవరు బయటపెట్టారు. బీఆర్‌ఎస్‌లో నాకు ఒకే నాయకుడు కేసీఆర్‌.. నాకు ఇంకెవరూ నాయకులు లేరు. పార్టీలో ఇంకెవరి నాయకత్వాన్ని నేను అంగీరించను. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా చేయాల్సిన పనులు చేయాలి.. కేవలం ట్వీట్లకే పరిమితం అయితే ఎలా?. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఆయన చేసే కార్యచరణ చేయనివ్వండి. నాది బీఆర్‌ఎస్‌ పార్టీనే. కొత్త పార్టీలు ఎందుకు?. ఉన్న పార్టీని, కేసీఆర్‌ను కాపాడుకుంటే సరిపోతుంది. నేను కాంగ్రెస్‌తో 2013లోనే మాట్లాడాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాట్లాడలేదు. కాంగ్రెస్‌ మునిగిపోయే నావ అని సెటైర్లు వేశారు. బీజేపీ వాళ్లు కట్టిన ఆసుపత్రి ఓపెనింగ్‌కి వెళ్ళిన వాళ్ళు బీఆర్‌ఎస్‌ పార్టీలో ఉన్నారని అన్నారు. 

నేను అసలే మంచి దాన్ని కాదు..
డబ్బులు ఇచ్చి నాపై తప్పుడు వార్తలు రాయిస్తున్నారు. నన్ను అరెస్ట్ చేసే సమయంలో కేసీఆర్‌ వద్దకు వెళ్లి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా అని అడిగితే కేసీఆర్‌ వద్దని చెప్పినట్టు తెలిపారు. పార్టీ చేయలేని పనులను జాగృతి తరఫున నేను చేసి చూపించాను. కేసీఆర్ తప్ప ఇప్పుడు నన్ను విమర్శిస్తున్న వారు ఏం చేశారో చెప్పాలి. నేను ఎప్పుడూ పదవులు అడగలేదు. కేసీఆరే నాకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. పార్టీ నడిపించే సత్తా లేదు.. నాకు నీతులు చెబుతున్నారా అని మండిపడ్డారు. నేను కడుపులో బిడ్డను పెట్టుకుని తెలంగాణ కోసం పోరాటం చేశాను. నేను మంచి దాన్ని కాదు.. నాతో పెట్టుకోవద్దు అంటూ వార్నింగ్‌ ఇచ్చారు. 

బీఆర్‌ఎస్‌ను బీజేపీలో కలిపే ప్లాన్‌.. 
అలాగే, పార్టీ చేసే పనులు నేను సగం చేస్తున్నాను. అందుకే తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుంది. కేసీఆర్‌కి కాళేశ్వరం నోటీసులు ఇస్తే.. పార్టీ పరంగా ఏం చేశారు?. తెలంగాణ తల్లి విగ్రహం మారిస్తే.. ఈ బీఆర్‌ఎస్‌ పార్టీ ఏం చేసింది?. అదానీ టీ షర్ట్స్ వేసుకొని హంగామా చేసి వదిలేశారు.పార్టీ కోసం కేసీఆర్‌కు వంద లేఖలైనా రాస్తాను. నేను 25 ఏళ్ల నుంచి కేసీఆర్‌కు లేఖలు రాస్తున్నాను. ప్రతీసారి లేఖలు చూడగానే కేసీఆర్‌ వాటిని చించేస్తారు.. కానీ, ఈసారి ఏమైందో లేఖ బయటకు వచ్చింది. అలాంటి లేఖను ఎందుకు బయట పెట్టారు.  నేను జైలులో ఉన్న సమయంలో బీఆర్‌ఎస్‌ను బీజేపీలో కలపాలనే ప్రతిపాదన వచ్చింది. కానీ, నేను బీజేపీలో​ కలపవద్దని చెప్పాను. వందకు 101 శాతం బీఆర్‌ఎస్‌ను బీజేపీలో కలిపే ప్రయత్నం జరుగుతోంది. నేను పార్టీలో ఉంటే బీఆర్‌ఎస్‌.. బీజేపీలో కలిసే అవకాశం ఉండదు. నేను ఉంటే అది కుదరని పని.. అందుకే నన్ను కేసీఆర్‌కు దూరం చేయాలని చూస్తున్నారు. నేను కేసీఆర్‌ నాయకత్వంలోనే పనిచేస్తాను. ఇవాళ తెలంగాణ వ్యతిరేకులు పనిచేస్తున్నారు. అది అడ్డుకునే ప్రయత్నం పార్టీ చేయట్లేదు.  కేసీఆర్‌ను ఎప్పుడు కలిసేది ఇప్పుడు చెప్పలేను.. డెడ్‌లైన్‌ అంటూ ఏమీ లేదు’ అని చెప్పుకొచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement