వైఎస్‌ హయాంలోనే ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు 

MLA Jeevan Reddy Comments On AP CM - Sakshi

ఏపీ సీఎం చిన్నవాడైనా సమర్థ్ధవంతంగా వ్యవహరిస్తున్నారు: జీవన్‌రెడ్డి

మైనారిటీల సంక్షేమంపై సీఎం ప్రత్యేక శ్రద్ధ : మహమూద్‌ అలీ

సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవలు అందించిన దివంగత నేత వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ముస్లింలకు 4% రిజర్వేషన్లు కల్పించడం ద్వారా వారి అభ్యున్నతికి బాటలు వేశారని ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి అన్నారు. మైనారిటీ సంక్షేమ కార్యక్రమాలపై మంగళవారం మండలిలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.

2004లో అధికారంలోకి వచ్చిన తరువాత ముస్లింలకు 5% రిజర్వేషన్లు ఇవ్వాలని వైఎస్‌ భావించారని, అయితే సాంకేతిక కారణాల వల్ల 4% రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు. తద్వారా విద్య, ఉద్యోగాల్లో ముస్లింలకు రిజర్వేషన్లు లభించాయన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రిజర్వేషన్లను 12% పెంచాలనుకున్నా, కేంద్రం నుంచి సహకారం లేదని, ఈ నేపథ్యంలో సంక్షేమ కార్యక్రమాల్లో ముస్లింలకు 12% రిజర్వేషన్లు ఇవ్వాలని సూచించారు. 

చిన్నవాడైనా ఏపీ సీఎం జగన్‌ సమర్థవంతుడు.. 
ఉర్దూ టీచర్ల నియామకంలో ప్రభుత్వం కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని టి.జీవన్‌రెడ్డి సూచించారు. ఉర్దూ టీచర్ల రిక్రూట్‌మెంట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను అమలు చేయడానికి పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ‘డీ–నోటిఫై’చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో ఉర్దూ చదువుకున్న వారు ఉండరనే ఉద్దేశంతో ఉర్దూ టీచర్‌ పోస్టులను జగన్‌ ఓపెన్‌ కేటగిరీలో పెట్టారని కొనియాడారు.

‘చిన్నవాడైనా సీఎంగా సమర్థవంతంగా ఉర్దూ టీచర్‌ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇక్కడ కేటీఆర్‌ జనరల్‌ కేటగిరీలోకి ఉర్దూ పోస్టులు తీసుకురావాలి’ అని సూచించారు. అందుకు స్పందించిన కేటీఆర్‌ ‘నేను ఆ శాఖ మంత్రిని కాదు’అని చెప్పగా, కాకపోయినా చేయవచ్చని జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.  

మైనారిటీ సంక్షేమానికి పెద్దపీట.. 
మైనారిటీ వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ చెప్పారు. తెలంగాణ వచ్చిన తరువాత ఏడేళ్లలో మైనారిటీల కోసం రూ. 6,644.26 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు హోంమంత్రి సమాధానమిచ్చారు. సంక్షేమంతో పాటు పాతబస్తీ అభివృద్ధికి కూడా  నిధులు వెచ్చించిందని చెప్పారు. ఈ అంశంపై ఎమ్మెల్సీలు ఎం.ఎస్,ప్రభాకర్‌ రావు, వాణీదేవి, సయ్యద్‌ అమీనుల్‌ జాఫ్రి, మీర్జా రియాజ్‌ అఫెండీ, డి.రాజేశ్వర్‌రావు పలు ప్రశ్నలు సంధించారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top