
సాక్షి, ప్రకాశం జిల్లా: ఈ నెల 28న పొదిలిలో పొగాకు బోర్డును వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సందర్శించనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో మంత్రుల హడావుడి మొదలైంది. వైఎస్ జగన్ దెబ్బకు మంత్రులు దిగొచ్చారు. పొగాకు రైతులతో మార్టూరులో సమావేశం నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పలువురు రైతులతో మాట్లాడారు. 28 లోపు పొగాకు కొనుగోలు జరపాలంటూ అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం.
మంత్రి అచ్చెన్నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు
ఈ క్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతులకు ఆశ ఎక్కువ .. పంట పండించక ముందు ఆలోచించాలి. పండించాక నష్టపోయామని బాధపడకూడదంటూ వ్యాఖ్యానించారు. మార్కెట్ లో పంట అమ్మకాలను పసిగట్టి పంటలు వేసుకోవాలంటూ రైతులకు ఉచిత సలహా ఇచ్చారు.
కాగా, పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిరప, వరి, కంది, పొగాకు వంటి పంటలకు కనీస మద్దతు ధర కూడా ఇవ్వకుండా రైతులను నష్టాలబాట పట్టించిందని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడుతున్నారు. అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదు. జిల్లాలో పొగాకు రైతుల కష్టాలు అన్నీఇన్నీ కావు. వేలం కేంద్రానికి వెళ్లి పొగాకు అమ్ముడుపోక బేళ్లను వెనక్కు తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో పొగాకు రైతుల కష్టాలు తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు ఈ నెల 28వ తేదీన వైఎస్ జగన్ పొదిలి వేలం కేంద్రానికి రానున్నారు.
