
గుంతకల్లు/గుత్తి : ‘రెడ్‌బుక్‌ను ఎట్టి పరిస్థితిల్లోనూ మర్చిపోను.. టీడీపీ కేడర్‌ను ఇబ్బంది పెట్టిన అందరూ మూల్యం చెల్లించుకోకతప్పదు. టీడీపీ కార్యకర్తలపై ఉన్న కేసులన్నీ ఎత్తేపిస్తా’ అని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్య, ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారాలోకేశ్ పేర్కొన్నారు.
గురువారం ఆయన అనంతపురం జిల్లా గుత్తి మండలం రామరాజుపల్లిలో ఉత్తమ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి నారా లోకేష్.. మాట్లాడుతూ ఏ సమావేశానికి వెళ్లినా పార్టీ కేడర్ రెడ్‌బుక్ గురించి అడుగుతున్నారని, ప్రతి ఒక్కరి చిట్టా విప్పి, చేయాల్సిన పని చేస్తానన్నారు. కాకపోతే కాస్త సమయం పడుతుందని పేర్కొన్నారు. కార్యకర్తలపై గత ప్రభుత్వం పెట్టిన కేసులను ఎత్తివేయిస్తానని చెప్పారు. వైఎస్ జగన్ నిర్వహకం వల్లే కరెంటు బిల్లుల్లో ట్రూఅప్ చార్జీలు వేయాల్సి వస్తోందని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం స్కూల్ మూసివేస్తుందని వైఎస్సార్సీపీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పి కొట్టాలని లోకేష్ చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో స్కూళ్లలో 45 లక్షల మంది విద్యార్థులు ఉండగా, ఇప్పడు ఆ సంఖ్య 33 లక్షలకు పడిపోయిందన్నారు. అనంతపురానికి రూ.22 వేల కోట్ల విలువైన భారీ సోలార్ విండ్ ప్రాజెక్టు వస్తుందని వెల్లడించారు. అనంతరం ఉత్తమ కార్యకర్తలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యకర్తలతో సెల్ఫీలు దిగారు.