అర్ధరాత్రి దొంగల బీభత్సం | - | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి దొంగల బీభత్సం

Feb 22 2026 8:07 AM | Updated on Feb 22 2026 8:07 AM

అర్ధర

అర్ధరాత్రి దొంగల బీభత్సం

రాయదుర్గం టౌన్‌: స్థానిక వేణుగోపాలస్వామి ఆలయం వద్ద శుక్రవారం అర్ధరాత్రి దొంగలు హల్‌చల్‌ చేశారు. బొలెరో వాహనంలో వచ్చిన కొత్త వ్యక్తులను గమనించిన స్థానిక యువకులు కొందరు అనుమానంతో ప్రశ్నించారు. ఆ సమయంలో వారిపై రాళ్లు రువ్వి బొలెరో వాహనంలో ఉడాయించారు. తక్షణమే సమాచారం అందుకున్న పోలీసులు పట్టణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. అప్పటికే దుండగులు బళ్లారి రోడ్డు వైపు నుంచి వాహనాన్ని తరలించినట్లు ఫుటేజీల్లోని దృశ్యాలు స్పష్టం చేశాయి. పందుల దొంగతనానికి వచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై అన్ని కోణాల్లో విచారిస్తున్నట్లు సీఐ జయనాయక్‌ తెలిపారు.

కారు ఢీ – వ్యక్తి మృతి

గుత్తి రూరల్‌: కారు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. కర్నూలు జిల్లా దేవనకొండకు చెందిన పరమేశ్వరాచారి, రాము శనివారం గుత్తి మండలం బాచుపల్లిలో గృహ నిర్మాణ పనికి వచ్చారు. ఈ క్రమంలో టిఫెన్‌ చేసేందుకు బాచుపల్లి వద్ద 44వ జాతీయ రహదారి పక్కన ద్విచక్ర వాహనాన్ని ఆపి రోడ్డు దాటుతుండగా రోగిని అత్యవసర చికిత్స కోసం కర్నూలుకు తరలిస్తున్న కారు శరవేగంగా వచ్చి పరమేశ్వరాచారిని ఢీకొంది. తీవ్రంగా గాయపడిన పరమేశ్వరాచారిని స్థానికుల సాయంతో రాము వెంటనే గుత్తిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ప్రథమ చికిత్స అనంతరం అనంతపురానికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు... ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకున్నారు.

రైలు కింద పడి వృద్ధుడి..

తాడిపత్రి రూరల్‌: స్థానిక చల్లవారిపల్లి రైల్వేస్టేషన్‌ మార్గం మధ్యలో శనివారం తెల్లవారుజామున రైలు కింద పడి 65ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. ఈ మేరకు రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ వరప్రసాద్‌ వెల్లడించారు. లోకో పైలెట్‌ సమాచారంతో ఘటనా స్థలాన్ని పరిశీలించి వృద్ధుడి మృతదేహాన్ని ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. మిస్సింగ్‌ కేసులో సంబంధీకులు ఎవరైనా ఉంటే సంప్రదించాలని తాడిపత్రి రైల్వే పోలీసులు కోరారు.

వివాహిత బలవన్మరణం

గుమ్మఘట్ట (రాయదుర్గం రూరల్‌): మండలంలోని 74ఉడేగోళం గ్రామానికి చెందిన మద్దానమ్మ(45) ఆత్మహత్య చేసుకుంది. భర్త గంగాధర, ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వ్యవసాయ పనులతో జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం రాత్రి జాతరలో బయలు నాటకం ఆడంబరాలకు వెళ్లరాదని చెప్పిన భర్త పెడచెవిన పెట్టడంతో మనస్తాపానికి లోనైన ఆమె ఇంట్లో ఉరి వేసుకుంది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే రాయదుర్గంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై అర్బన్‌ సీఐ జయనాయక్‌ కేసు నమోదు చేశారు.

పోక్సో కేసు నమోదు

పామిడి: మండలంలోని రామగిరి దిగువతండాకు చెందిన సెటానాయక్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాలను శనివారం వెల్లడించారు. 3వ తరగతి చదువుతున్న చిన్నారిపై అత్యాచారయత్నానికి పాల్పడడంతో బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు విచారణ అనంతరం సెటా నాయక్‌పై పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాగా, ప్రమాదంలో గాయపడి అనంతపురంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని పామిడి పీఎస్‌కు తరలించారు.

అర్ధరాత్రి దొంగల బీభత్సం 1
1/2

అర్ధరాత్రి దొంగల బీభత్సం

అర్ధరాత్రి దొంగల బీభత్సం 2
2/2

అర్ధరాత్రి దొంగల బీభత్సం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement