‘డాష్ బోర్డు’ లోపాల దిద్దుబాటుకు చర్యలు
అనంతపురం క్రైం: డ్రైరెక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ) డ్యాష్ బోర్డులోని లోపాలను సరిదిద్దుకునే చర్యలను సంబంధిత అధికారులు చేపట్టారు. డ్యాష్ బోర్డులో నమోదువుతున్న యూఎల్‌బీ హాజరు గణాంకాల ఆధారంగా శానిటేషన్ విభాగంలోని కార్మికులకు వేతనాలు మంజూరవుతూ ఉంటాయి. అయితే ఉమ్మడి జిల్లా పరిధిలోని శానిటేషన్ విభాగంలో మొత్తం సిబ్బంది పనుల్లో పాలు పంచుకుంటుండగా హాజరు నమోదులో మాత్రం 0 శాతం నమోదైంది. ఈ అంశాన్ని ‘తప్పుల తడకగా డ్యాస్ బోర్డు’ శీర్షికన ఈ నెల 16న ‘సాక్షి’లో వెలువడిన కథనంపై అనంతపురం నగరపాలక సంస్థ అధికారులు స్పందించి మంగళగిరిలోని మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం ఆరు సర్కిళ్లు ఉండగా, 645 మంది పారిశుద్ధ్య కార్మికులు రోజూ విధుల్లో పాల్గొంటున్నారని, సాంకేతిక లోపాల కారణంగా ఆన్‌లైన్ హాజరు నమోదులో జాప్యం చోటు చేసుకున్నట్లుగా అక్కడి అధికారులు అంగీకరించారు. ఈ లోపాన్ని సరి చేస్తున్నట్లు వివరించారు.
ఇద్దరికి ఉమ్మడిశెట్టి అవార్డులు
అనంతపురం కల్చరల్: ఉమ్మడిశెట్టి సత్యాదేవి సాహితీ పురస్కారానికి ఈ ఏడాది ప్రగతిశీల దృక్ఫథం కలిగిన శ్రీకాకుళానికి చెందిన కవి, ఉపాధ్యాయుడు కంచరాన భుజంగరావును ఎంపిక చేసినట్లు నిర్వాహక సంస్థ అధ్యక్షుడు డాక్టర్ రాధేయ తెలిపారు. వివరాలను శనివారం ఆయన వెల్లడించారు. భుజంగరావు రాసిన ‘గీసి చెరిపే బొమ్మ’ కవితా సంపుటిని పురస్కారానికి న్యాయనిర్ణేతలు ఎంపిక చేశారన్నారు. అలాగే ఒంగోలుకు చెందిన యువ కథా రచయిత చరణ్ పరిమిని ఉమ్మడిశెట్టి సతీష్‌కుమార్ జాతీయ యువ పురస్కారానికి ఎంపిక చేసినట్లు వివరించారు. వీరిద్దరికి త్వరలో అనంత వేదికగా జరిగే కార్యక్రమంలో పురస్కారాన్ని, నగదు బహుమతిని అందజేయనున్నట్లు పేర్కొన్నారు.
పని మనిషే నగలు ఎత్తుకెళ్లింది
● చోరీ కేసులో మిస్టరీని
ఛేదించిన పోలీసులు
గుత్తి: స్థానిక తాడిపత్రి రోడ్డులో నివాసముంటున్న లింగాల రాధా ఇంట్లో మూడు మాసాల క్రితం 22 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఆలస్యంగా ఈ విషయాన్ని గుర్తించిన బాధితురాలు మూడు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసిన సీఐ రామారావు, ఎస్‌ఐలు సురేష్, అమీర్ ఖాన్ లోతుగా విచారణ చేపట్టి ఇందులోని మిస్టరీని ఛేదించారు. రాధా ఇంట్లో పని చేస్తున్న బెస్త సంధ్యానే చోరీ చేసినట్లుగా నిర్ధారించుకుని శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి 17 తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. 5 తులాల నగలను యూనియన్ బ్యాంకులో తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నట్లు నిందితురాలు అంగీకరించింది. సంధ్యాపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
‘డాష్ బోర్డు’ లోపాల దిద్దుబాటుకు చర్యలు
‘డాష్ బోర్డు’ లోపాల దిద్దుబాటుకు చర్యలు


