సాక్షి, ఢిల్లీ: సింగరేణిని రాజకీయ ప్రయోగశాలగా మార్చారని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నైనీ కోల్ బ్లాక్ విషయంలో కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ తరహాలోనే పనిచేస్తోందన్నారు. టెండర్ల విషయాల్లో అవినీతి, అక్రమాలు జరిగాయని నివేదికలు వస్తున్నాయి. ఎక్కడా లేని సైట్ విజిట్ అనే కొత్త నిబంధన పెట్టారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణ వచ్చిన తర్వాత సింగరేణి సంస్థ అనేక సమస్యల్లో కూరుకుపోయింది. కేంద్రానికి సింగరేణిలో 49 శాతం వాటా ఉన్నా నిర్వహణలో జోక్యం చేసుకోలేదు. నైనీ బొగ్గు గనులకు చివరి అనుమతులు వచ్చాక పనులు ఎందుకు ఆలస్యం చేశారు?. తెలంగాణ విద్యుత్ సంస్థలకు బొగ్గు కోసం కేంద్రం నైనీ కోల్ బ్లాక్‌ను సింగరేణికి అప్పగించింది. టెండర్లను ఆహ్వానించి వాటిని రద్దు చేశారు. దేశంలో ఎన్నో టెండర్లు నిర్వహిస్తుంటాం.. కానీ, ఎక్కడా ఎలాంటి ఆరోపణలు రాలేదు. ఒడిషాలో బీజేపీ వచ్చాక అక్కడి ప్రభుత్వంతో అనుమతులపై చర్చించాను.
నేను సింగరేణికి 683 ఎకరాల అటవీ భూమిని అప్పగించేందుకు ఒడిశా ప్రభుత్వం ఒప్పించాను. టెండర్ల విషయాల్లో అవినీతి, అక్రమాలు జరిగాయని నివేదికలు వస్తున్నాయి. రాష్ట్ర పెద్దల ఆదేశంతోనే ఇది జరిగింది. దేశంలో అనేక గనులను కేంద్రం పారదర్శకంగా వేలం నిర్వహిస్తోంది. తెలంగాణ చేతిలో ఒక్క నైనీ కోల్ బ్లాక్ పెడితే అక్రమాలకు తెర లేపారు. ఈ వివాదంలోకి నన్ను లాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి 32వేల కోట్ల బకాయి పడింది. గతంలో బీఆర్‌ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ సింగరేణిని వాడుకుంటున్నాయి. బీఆర్‌ఎస్ లాగే కాంగ్రెస్ పనిచేస్తోంది. సింగరేణిని బంగారు బాతుగా కాంగ్రెస్ చూస్తోంది. 12 ఏళ్లుగా నైనీ బ్లాక్ విషయంలో సమస్యలు సృష్టిస్తున్నారు. సీబీఐ అనుమతి కోరుతున్నారు. దానికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కావాలి. బీఆర్‌ఎస్ హయాంలోనూ అనేక అక్రమాలు జరిగాయి. సింగరేణి బొగ్గు క్వాలిటీ పడిపోయింది. దీనిపై దృష్టి పెట్టే పరిస్థితి లేదు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ సింగరేణిని కలుషితం చేశాయి. సింగరేణి భవిష్యత్ అంధకారంగా మారే పరిస్థితి ఉంది. అనేక జిల్లాలో సింగరేణి భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరికి నచ్చిన విధంగా వారికి భూములు ఇస్తున్నారు.
అవినీతి, అక్రమాలతో సింగరేణిని నాశనం చేయవద్దు. సింగరేణిలో ఒక్క అధికారిని కూడా బదిలీ చేసే అధికారం కేంద్రానికి లేదు. సింగరేణి సంపూర్ణ ప్రక్షాళన జరగాలి. సింగరేణి అన్ని వ్యవహారాలపై దర్యాప్తు జరగాలి. నైనీ కోల్ బ్లాక్ టెండర్ల రద్దు వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేస్తే పరిశీలిస్తాం. మంత్రుల మధ్య వాటాల తేడా వల్లే నైనీ కోల్ బ్లాక్ టెండర్ల రద్దు జరిగింది. సైట్ విజిట్ నిబంధన పెట్టాలనే విషయం కేంద్రానికి తెలియదు. దేశవ్యాప్తంగా సెల్ఫ్ డిక్లరేషన్ నిబంధన ఉంటే.. ఇక్కడ మాత్రం వేరుగా పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిని కేంద్రానికి అప్పగిస్తే లాభాల్లోకి తీసుకువస్తాం అని అన్నారు.


