మంత్రి హరీష్‌, తుమ్మల కీలక వ్యాఖ్యలు..

Minister Harish Key Comments On Khammam BRS Sabha - Sakshi

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ఖమ్మంలో బీఆర్‌ఎస్‌ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు అధికార పార్టీకి చెందిన నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సభ ఏర్పాట్లను మంత్రి హరీష్‌ రావుతో పాటుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన నేతలు పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. 

కాగా, హరీష్‌ రావు మీడియాతో మాట్లాడుతూ.. ఖమ్మం సభ చారిత్రాత్మకమైనది. ఆనాడు తెలంగాణ సభ సింహగర్జనను కరీంనగర్‌లో ఏర్పాటు చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ ఇది. ఈ సభలో సీపీఎం, సీపీఐ, ఆమ్‌ ఆద్మీ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీల నేతలు, మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటారు. మలిదశ ఉద్యమానికి ఊతమిచ్చిన జిల్లా ఉమ్మడి ఖమ్మం. జాతీయ రాజకీయాలకు ఖమ్మం వేదిక కానుంది. 

సభ కోసం 100 ఎకరాలు కేటాయించాము. పార్కింగ్‌ కోసం 20 ప్రాంతాలను ఏర్పాటు చేశాము. పార్కింగ్‌ బాధ్యతలను ఎమ్మెల్సీ తాతా మధుకు అప్పగించాము. నియోజకవర్గాలుగా ఇంచార్జీలను ఏర్పాటు చేశాము. ఆరు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ జరిగింది. వాహనాలు కాకుండా కాలి నడకన వేలాదిగా తరలి వస్తున్నారు. ఖమ్మం జిల్లా నాయకత్వం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో వేదికపై ఉంటారు అని తెలిపారు. 

ఈ సందర్బంగా తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. దేశ రాజకీయ చరిత్రలో బీఆర్‌ఎస్‌ చారిత్రాత్మకమైనది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు వచ్చాక ఖమ్మం అభివృద్ధి ఏంటో చూడాలి. సీఎం కేసీఆర్‌ రెండు రోజుల పాటు ఖమ్మంలో ఉండి అభివృద్ధికి నిధులు ఇచ్చి.. ఖమ్మం స్వరూపం మార్చారు. దేశ ప్రజల ఆకాంక్షే బీఆర్‌ఎస్‌ ఖమ్మం సభ అని తెలిపారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top