PM Modi Meghalaya Visit: మోదీకి షాకిచ్చిన మేఘాలయ సీఎం.. ఎన్నికల ర్యాలీకి అనుమతి నిరాకరణ..

Meghalaya Govt Denied Permission For Pm Modi Rally - Sakshi

షిల్లాంగ్‌: ప్రధాని నరేంద్ర మోదీకి మేఘాలయ ప్రభుత్వం షాకిచ్చింది. ఫిబ్రవరి 24న టురలో పీఎం సంగ్మా స్టేడియంలో నిర్వహించే ఎన్నికల ర్యాలీకి అనుమతి నిరాకరించింది. ఈ స్టేడియంలో ఇంకా పనులు పూర్తి కాలేదని, కన్‌స్ట్రక్షన్ మెటీరియల్‌ కూడా అక్కడే ఉందని పేర్కొంది. ప్రధాని సభకు జనం భారీగా తరలివస్తారు కాబట్టి ఈ స్టేడియానికి ఆ సమర్థ్యం లేదని, మెటీరియల్‌కు కూడా భద్రత ఉండదని వివరణ ఇచ్చింది.

మోదీ సభకు వేదికను మార్చుకుంటే అనుమతి ఇస్తామని మేఘాలయ క్రీడా శాఖ చెప్పింది. అలోత్‌గ్రే క్రికెట్ స్టేడియంలో ర్యాలీ నిర్వహించుకోవచ్చని పేర్కొంది. ఈ వ్యవహారంపై బీజేపీ జాతీయ కార్యదర్శి ఈశాన్య రాష్ట్రాల ఇంఛార్జ్ రితురాజ్ సిన్హా స్పందించారు. మోదీ ఎన్నికల ర్యాలీ అనుకున్న తేదీనే జరిగి తీరుతుందని స్పష్టం చేశారు. అయితే వేదిక ఎక్కడనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. మేఘాలయ ప్రజలతో మోదీ మాట్లాడాలని నిర్ణయం తీసుకున్నాక ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించారు.

అయితే రెండు నెలల క్రితమే ప్రారంభోత్సవం జరిగిన స్టేడియంలో ఇంకా పనులు పూర్తి కాకపోవడం ఏంటని రితురాజ్ ప్రశ్నించారు. బీజేపీని చూసి సీఎం కోన్రాడ్ సంగ్మాకు భయమేస్తోందా? అని ఎద్దేవా చేశారు. సభ జరగకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని, ఈసారి ఎన్నికల్లో బీజేపీ వేవ్‌ ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. మేఘాలయతో పాటు నాగలాండ్‌లో ఫిబ్రవరి 27న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరో రాష్ట్రం త్రిపురలో ఫిబ్రవరి 16నే ఓటింగ్ పూర్తయింది. ఈ మూడు రాష్ట్రాల ఫలితాలు మార్చి 2న ప్రకటిస్తారు.
చదవండి: శివసేనను షిండేకు ఇవ్వడంపై సుప్రీంకోర్టుకు ఉద్ధవ్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top