
కులం పేరుతో మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నామని అనడం సరికాదు...
ఢిల్లీ: పార్లమెంట్ భద్రత వైఫల్యానికి సంబంధించి హోంమంత్రి అమిత్ షా స్పందించాలని పట్టుబట్టారు కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి ఎంపీలు. ఈ క్రమంలో 146 మంది ఉభయ సభల నుంచి సస్పెండ్ చేయబడిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యుల సస్పెన్షన్‌పై నిరసనగా శుక్రవారం ఇండియా కూటమి ఎంపీలు జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేపట్టారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ చీఫ్ మళ్లికార్జున ఖర్గే.. రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్‌పై విమర్శలు గుప్పించారు. ‘రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న మీరు, హుందాగా వ్యవహరిస్తూ ఆ పదవిని నిలబెట్టుకోవాలి. కులం పేరుతో మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నామని అనడం సరికాదు. ట్రెజరీ బెంచ్‌లు నన్ను చాలాసార్లు మాట్లాడనివ్వకుండా అడ్డుకున్నాయి. దానికి నా కులం(దళిత సామాజికవర్గం) పేరుతో నన్ను మాట్లాడకుండా అడ్డుకున్నారని నేను అనుకోవాలా?’ అని ఖర్గే తీవ్రంగా విమర్శించారు.
అయితే పార్లమెంట్ భద్రత వైఫల్యంపై నిరసన తెలిపిన ఎంపీలపై రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ పలువురు ఎంపీలను సస్పెండ్ చేశారు. అయితే సస్పెన్షన్‌కు గురైన ఎంపీలు పార్లమెంట్ బయట ‘మాక్ పార్లమెంట్’ నిర్వహించారు. ఇందులో టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ.. రాజ్యసభ చైర్మన్ సభలో వ్యవహరించే తీరును అనుకరించి మరీ నిరసన తెలిపాడు. దీంతో.. ‘నన్ను కులం (జాట్) పేరుతో అవమానించారు. నేను ఒక వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చినందుకు నన్ను టార్గెట్ చేశారు’ అంటూ రాజ్యసభ చైర్మన్ ధన్‌ఖడ్ సదరు ఎంపీలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.