సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావును సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ అంశంపై హరీష్ విచారణపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంతటి వారున్న శిక్ష తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ..‘కేటీఆర్ ఏమీ తెలియదు. టెలిగ్రాఫిక్ యాక్టు చదివితే ఈ కేసు తీవ్రత ఏంటో కేటీఆర్‌కు తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంతటి వారున్న శిక్ష తప్పదు. నా ఫోన్, షబ్బీర్ అలీ ఫోన్ సహా చాలా మంది ఫోన్స్ ట్యాప్ చేసి.. ప్రైవేట్ సంభాషణలు విన్నారు. బీఆర్ఎస్ నాయకులు.. మహిళా యాక్టర్ల ఫోన్లు ట్యాప్ చేసి వారి వ్యక్తిగత జీవితాల్లో తొంగి చూశారు. తప్పు చేశారు కాబట్టే ఇలా మాట్లాడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. బీఆర్‌ఎస్ నాయకులు చేసిన తప్పులపై విచారణ జరుగుతోంది. ఇది రాజకీయ వేధింపులు కానే కాదు, వేధింపులకు పాల్పడాలంటే రెండేళ్ల వరకు ఎందుకు వేచి చూస్తాం. అప్పుడే జైలుకు పంపే వాళ్లం అని వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ..‘గతంలో నా ఫోన్ ట్యాప్ అయ్యిందని నన్ను కూడా విచారణకు పిలిచారు. నా కుటుంబ సభ్యులు, మా ఇంటి వాచ్‌మెన్ ఫోన్ కూడా ట్యాప్ చేశారు. బీఆర్‌ఎస్ హయంలో నాపైనే అధికంగా కేసులు పెట్టారు. గాంధీభవన్ లోపలికి వచ్చి మరీ అరెస్ట్ చేశారు. బీఆర్‌ఎస్ నేతలను విచారణ చేయవద్దని చట్టం ఏమైనా ఉందా? అంటూ ప్రశ్నించారు.


