శివ సేనలో చీలిక.. డేంజర్‌లో మహా సర్కార్!? షిండేతో పాటు ఎమ్మెల్యేలు గుజరాత్‌ హోటల్‌లో!

Maharashtra Updates: Sena Eknath Shinde Missing MVA Govt Trouble - Sakshi

Maharashtra Political Crisis : మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. అధికార కూటమిలోని శివ సేన పార్టీ ఎమ్మెల్యే, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఏక్‌నాథ్‌ షిండే వేరు కుంపటితో.. సంకీర్ణ ప్రభుత్వాన్ని సంక్షోభం వైపు తీసుకెళ్తున్నారు. గుజరాత్‌ సూరత్‌లోని ఓ హోటల్‌లో ఆయన మరికొందరు ఎమ్మెల్యేలతో క్యాంప్‌ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు సుమారు 11 మంది ఎమ్మెల్యేలు(27 అని అనధికార సమాచారం) అక్కడ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. థానేకు చెందిన ప్రముఖ నేతగా ఏక్‌నాథ్‌ షిండే.. ఆ ప్రాంతంలో శివ సేన బలోపేతానికి ఎంతో కృషి చేశారు. అయితే తన శాఖల్లో(అర్బన్‌ డెవలప్‌మెంట్‌తో పాటు పబ్లిక్‌ వర్క్స్‌) సీఎం ఉద్దవ్‌ థాక్రే, ఆయన తనయుడు టూరిజం మంత్రి అయిన ఆదిత్యా థాక్రేల జోక్యం ఎక్కువగా ఉండడంతో ఆయన రలిగిపోతున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ నుంచి నిధుల కేటాయింపుల విషయంలోనూ షిండేతో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వీళ్లంతా సూరత్‌ హోటల్‌కు చేరుకోవడం ఆసక్తికరంగా మారింది. 

సీఎం అత్యవసర భేటీ
శివ సేన కీలక నేత షిండే, మరికొందరు నేతలు అందుబాటులో లేరన్న కథనాల నడుమ.. ముఖ్యమంత్రి ఉద్దవ్‌ థాక్రే అత్యవసర సమావేశానికి పిలుపు ఇచ్చారు. మంత్రులతో పాటు శివ సేన ఎమ్మెల్యేలంతా మంగళవారం మధ్యా‍హ్నం 12 గంటల ప్రాంతంలో తనతో భేటీ కావాలని ఆయన పిలుపు ఇచ్చారు. పైకి ఇది క్రాస్‌ ఓటింగ్‌ కోసం జరుగుతున్న భేటీ అని చెప్తున్నప్పటికీ.. షిండే ఎఫెక్ట్‌ వల్లే ఈ భేటీ అనేది జోరుగా చర్చ సాగుతోంది. ఇక గుజరాత్‌ సూరత్‌ హోటల్‌లో ఉన్న ఏక్‌నాథ్‌ షిండే సైతం అదే సమయానికి మీడియా సమావేశం నిర్వహించొచ్చని తెలుస్తోంది. 

క్రాస్‌ ఓటింగ్‌!
సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో.. మహా వికాస్ అఘాడి కూటమి (MVA)కి పెద్ద దెబ్బ తగిలింది. నాలుగు స్థానాలు గెలవాల్సిన బీజేపీ.. ఏకంగా ఐదు సీట్లు గెల్చుకుంది. కాంగ్రెస్‌ 1, ఎన్పీపీ, శివసేలు చెరో రెండు గెల్చాయి. అధికార కూటమి నుంచే 20 మంది ఎమ్మెల్యేలు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడి(షిండే కూడా ఉన్నారని సమాచారం).. బీజేపీ అభ్యర్థి విజయంలో కీలక పాత్ర పోషించారు.  కాంగ్రెస్‌ దళిత అభ్యర్థి చంద్రకాంత్ హందోరే ఓటమికి సొంత పార్టీ ఎమ్మెల్యేల క్రాసింగ్‌ ఓటమే కారణమంటూ కార్యకర్తలూ నిరసనలకు దిగారు.

ఈ నేపథ్యంలో ఇప్పుడు శివ సేన చీలికను ఎన్సీపీ, కాంగ్రెస్‌లు పరిశీలిస్తున్నాయి.  మహారాష్ట్రంలో శివ సేన, కాంగ్రెస్‌, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ సంయుక్తంగా మహా వికాస్‌ అగాధి(ఎంవీఏ) కూటమిగా.. ప్రభుత్వాన్ని నడిపిస్తున్న సంగతి తెలిసిందే. జూన్ 10న రాజ్యసభ ఎన్నికల్లో ఎంవీఏను ఓడించడంలో బీజేపీ విజయం సాధించగా.. ఇప్పుడు రెండు వారాల వ్యవధిలో కూటమికి ఎమ్మెల్సీ ఫలితంతో మరో షాక్‌ ఇచ్చింది. తాజా పరిణామాలతో ఢిల్లీ మాజీ సీఎం ఫడ్నవిస్‌ ఢిల్లీకి పయనమైనట్లు తెలుస్తోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top