Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష.. ఏక్‌నాథ్‌ షిండే ప్లాన్‌ ఇదే!

Maharashtra: Eknath Shinde Group Route Map From Guwahati To Mumbai To Floor Test - Sakshi

ముంబై: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం మొదలైనప్పటి నుంచి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు ప్రస్తుతం గోవాలో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ మహా వికాస్ అఘాడీ కూటమిని అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు సూచించారు. దీంతో ఏక్‌నాథ్‌ షిండే బృందం ముంబైకి వెళ్లేందుకు సిద్ధమైంది. అయితే నేరుగా కాకుండా గౌహతి నుంచి గోవా వెళ్లి అక్కడి నుంచి ముంబైకు చేరి నేరుగా అసెంబ్లీకి చేరుకోవాలని ఏక్‌నాథ్‌ షిండే బృందం నిర్ణయించింది.

రూట్‌ మ్యాప్‌
ఈ మేరకు షిండే వర్గం రూట్‌ మ్యాప్‌ ఖరారు చేసుకున్నట్లు సమాచారం. షిండే ముంబై ఎయిర్‌పోర్ట్‌లో దిగిన తర్వాత నేరుగా అసెంబ్లీకి వెళ్లేలా ప్లాన్‌ సిద్దం చేశారు. అయితే గౌహతి నుంచి ముంబైకి విమానంలో వెళ్లేందుకు మూడు గంటల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో ఆలస్యంగా అసెంబ్లీకి చేరుకోకూడదని షిండే వర్గం భావిస్తోంది. అందుకే ఈ విధంగా రూట్‌ మ్యాప్‌ ఖరారు చేసుకున్నారు. దీంతో షిండే వర్గం గౌహతి నుంచి మరో బీజేపీ పాలిత రాష్ట్రమైన గోవాకు బుధవారం మకాం మార్చి అక్కడే బుధవారం రాత్రి ఓ హోటల్‌లో బస చేయనున్నారు.

అనంతరం గురువారం ఉదయం ప్రత్యేక విమానంలో గోవా నుంచి బయలుదేరి ముంబైకి పయనమవుతారు. ఇదిలా ఉండగా గవర్నర్‌ బలపరీక్షను ఎదుర్కోవాలన్న ఆదేశాన్ని శివసేన సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. ఈ పిటిషన్‌పై బుధవారం సాయంత్రం 5 గంటలకు విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఏక్‌నాథ్‌ షిండే వర్గం ముంబైకి తిరిగి వచ్చే ప్లాన్‌ అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులపై ఆధారపడి ఉంటుంది.

చదవండి: maharashtra Political Crisis: ఉత్కంఠ రేపుతోన్న మహారాష్ట్ర రాజకీయాలు.. ఏం జరగవచ్చు?

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top