లోక్‌ నాయకులెవరో!  | Lok Sabha elections will be a test for the major parties | Sakshi
Sakshi News home page

లోక్‌ నాయకులెవరో! 

Dec 7 2023 1:02 AM | Updated on Dec 7 2023 8:04 AM

 Lok Sabha elections will be a test for the major parties - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: శాసనసభ ఎన్నికల ఫలితాలు రానున్న లోక్‌సభ ఎన్నికలను మరింత ఆసక్తికరంగా మార్చాయి. గ్రేటర్‌ పరిధిలో కాంగ్రెస్, బీజేపీ కంటే బీఆర్‌ఎస్‌కు మెజారిటీ స్థానాలు దక్కాయి. రాజధాని పరిధిలో నాలుగు పార్లమెంట్‌ స్థానాల పరిధిలో 28 అసెంబ్లీ సీట్లున్నాయి. వీటిలో 17 స్థానాలు బీఆర్‌ఎస్‌ దక్కించుకోగా.. ఎంఐఎం ఏడు, కాంగ్రెస్‌ 3, బీజేపీ ఒక స్థానాన్ని గెలుపొందాయి.

గోషామహల్‌లో కమలం వికసించగా.. గ్రామీణ సెగ్మెంట్లయిన పరిగి, తాండూరు, వికారాబాద్‌లు “హస్త’గతమయ్యాయి. మిగిలిన అన్ని స్థానాలు గులాబీ వశమయ్యాయి. నాంపల్లి అసెంబ్లీతో సహా హైదరాబాద్‌ లోక్‌సభలో సెగ్మెంట్లలో పతంగి ఎగిరింది. ఇలాంటి మిశ్రమ ఫలితాల నడుమ రానున్న పార్లమెంట్‌ ఎన్నికలు కూడా నగరంలో అనూహ్య ఫలితాలకు వేదికగా మారే అవకాశం లేకపోలేదు. 

తగ్గిన ఓట్ల శాతం.. 
రాజధాని పరిధిలో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల లోక్‌సభ స్థానాలున్నాయి. ఆయా నియోజకవర్గాల్లోని అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలకు వచ్చిన ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే.. హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ మినహా మల్కాజిగిరి, చేవెళ్ల, సికింద్రాబాద్‌ ఎంపీలు రేవంత్‌ రెడ్డి, రంజిత్‌ రెడ్డి, కిషన్‌ రెడ్డి నియోజకవర్గాల పరిధిలోని ఫలితాలో మార్పులు చోటుచేసుకునే అవకాశాలున్నాయి. రంజిత్‌ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిలో గత ఎన్నికలలో బీఆర్‌ఎస్‌కు 40.62 శాతం ఓట్లు రాగా.. తాజా అసెంబ్లీ ఎన్నికలలో ఈ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలలో బీఆర్‌ఎస్‌కు వచ్చిన ఓట్ల శాతం 24.91.  

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్‌ లోక్‌సభలో గతంలో బీజేపీకి 42.05 శాతం ఓట్లు రాగా.. తాజా ఫలితాలలో కేవలం 10.31 శాతం మాత్రమే ఓట్లొచ్చాయి. ఇక.. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజిగిరి పార్లమెంట్‌ పరిధిలో గతంలో కాంగ్రెస్‌కు 38.63 శాతం ఓట్లు రాగా.. తాజా అసెంబ్లీ ఫలితాలలో 15.91 శాతం మాత్రమే ఓట్లు వచ్చాయి. 

హైదరాబాద్‌లో మజ్లిస్‌దే హవా.. 
హైదరాబాద్‌ లోక్‌సభ పరిధిలో మలక్‌పేట, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, బహదూర్‌పురా శాసనసభ నియోజకవర్గాలు వస్తాయి. ఈ పార్లమెంట్‌ స్థానంలో మజ్లిస్‌ పార్టీదే జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా తొమ్మిది లోకసభ ఎన్నికలలో హైదరాబాద్‌ పార్లమెంట్‌ స్థానాన్ని మజ్లిస్‌ కైవసం చేసుకుంటుంది. గత నాలుగు ఎన్నికలలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ విజయం సాధించగా.. అంతకుముందు ఐదు ఎన్నికలలో అసద్‌ తండ్రి సుల్తాన్‌ సల్లావుద్దీన్‌ ఒవైసీ గెలుపొందారు.  

గత ఎన్నికలలో గ్రేటర్‌లోని నాలుగు పార్లమెంట్‌ స్థానాలలో అత్యధికంగా హైదరాబాద్‌ లోక్‌సభలో 2,82,186 ఓట్ల మెజారిటీతో ఎంఐఎం అధినేత అసదుద్దిన్‌ ఓవైసీ గెలుపొందారు. అత్యల్పంగా మల్కాజిగిరి లోక్‌సభలో 10,919 ఓట్ల మెజారిటీతో రేవంత్‌ రెడ్డి విజయం సాధించారు. చేవెళ్ల స్థానంలో 14,317 ఓట్ల మెజారిటీతో రంజిత్‌ రెడ్డి, సికింద్రాబాద్‌లో 62,114 ఓట్ల మెజారిటీతో కిషన్‌ రెడ్డి విజయం సాధించారు. నాలుగు పార్లమెంట్‌ స్థానాలలో మొత్తం 41,840 నోటా ఓట్లు పడ్డాయి. అత్యధికంగా మల్కాజిగిరిలో 17,895, అత్యల్పంగా హైదరాబాద్‌లో 5,663 నోటాకు ఓట్లు పోలయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement