చంద్రబాబు వ్యాక్సిన్‌ వేయించుకున్నారా? లేదా?

Kurasala Kannababu Comments On Chandarababau - Sakshi

మంత్రి కురసాల కన్నబాబు ప్రశ్న

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఇల్లు లేని పేద వాడు ఉండకూడదని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రమిస్తుంటే దాన్ని ఎలా అడ్డుకోవాలా అని ప్రతిపక్షం ప్రయత్నిస్తోందని మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. చంద్రబాబు హాయంలో కేంద్రం ఇచ్చిన నిధులతో ఇళ్ల పథకానికి ఎన్‌టీఆర్ హౌసింగ్ అని పేరు పెట్టుకోలేదా?.. కేంద్రం నిధులు ఇవ్వకుండా రాష్ట్రాల్లో పథకాలు అమలవుతాయా? అని ప్రశ్నించారు. బడ్జెట్‌ని కూడా కేంద్రం ఇచ్చే నిధులు, మనకు రావాల్సిన పన్నులు చూసుకునే తయారుచేస్తారని అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ సీఎం కడుతుంది ఇల్లు కాదు.. ఊళ్లు. జగనన్న కాలనీల్లో మౌలిక వసతులకు ఎంత ఖర్చు చేస్తున్నారో టీడీపీ వాళ్లకు తెలియదా?. ఆ స్థలాలు ఇవ్వకూడదని అడ్డుకుని కోర్టులో కేసులు వేసింది టీడీపీ వాళ్లు కాదా ?. చివరికి అమరావతిలో పేదలకు ఇళ్లు ఇస్తే డెమోగ్రాఫికల్ బ్యాలెన్స్ పోతుందని కోర్టుకు చెప్పింది మీరు కాదా?. సీఎం జగన్ ఇన్ని మంచి పనులు చేసి ప్రజలకు దగ్గరవుతున్నారని తట్టుకోలేక విమర్శలు చేస్తున్నారు. వ్యాక్సిన్ విషయంలో ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తున్నారు.

దేశంలో అత్యధికంగా వ్యాక్సినేషన్ చేసిన రాష్ట్రాల్లో మనం ముందున్నాం. వ్యాక్సిన్ సరఫరా కేంద్రం చేతుల్లో ఉన్న విషయం టీడీపీ వారికి తెలిసినా మాపై విమర్శలు చేస్తున్నారు. గ్లోబల్ టెండర్లతో వ్యాక్సిన్ సరఫరా పెంచి అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేయాలనుకోవడం తప్పా?. కేంద్రం అనుమతి లేక గ్లోబల్ టెండర్లకు ఎవరూ రాలేదు. అందుకే కేంద్రమే దీనిపై చర్యలు తీసుకోవాలని సీఎం అన్నదాంట్లో తప్పేముంది. వ్యాక్సిన్ గురించి ఇంతగా మాట్లాడుతున్న చంద్రబాబు అసలు వ్యాక్సిన్ వేయించుకున్నారా?. 45 ఏళ్లు దాటిన ఆయన వ్యాక్సిన్ వేయించుకోవాలి కదా.. వేయించుకుంటే ఎక్కడ వేయించుకున్నారు?. ఏపీలోనా...లేక తెలంగాణలోనా?. భారత్ బయోటెక్ వాళ్ల వ్యాక్సిన్ వేయించుకున్నారా?. కోవి షీల్డ్ వేయించుకున్నారా?. ఆయన వ్యాక్సిన్ వేయించుకున్నారా లేదా అనేది ప్రజలకు చెప్పాలి’’ అని డిమాండ్‌ చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top