గల్లీ నుంచి ఢిల్లీ దాకా అసత్యాలే

KTR Slams Congress, BJP Over employment - Sakshi

అదే పనిగా బీజేపీ ప్రచారం 

కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదు  

ప్రభుత్వ ఉద్యోగులతో టీఆర్‌ఎస్‌ది పేగు బంధం 

ఆరేళ్లలో మనం చేసింది ఓటర్లకు వివరించండి 

‘పట్టభద్రుల’ సన్నాహక సమావేశంలో కేటీఆర్‌  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో విపక్ష బీజేపీ ఢిల్లీ నుంచి గల్లీదాకా అసత్య ప్రచారాలు చేయడమే పనిగా పెట్టుకుందని, వాట్సాప్‌ యూనివర్సిటీ ద్వారా అసత్యాలను పంచుకుంటోందని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు విమర్శించారు. ప్రస్తుతం జరుగుతున్న శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల్లో వ్యూహాత్మకంగా పనిచేయడంతో పాటు బీజేపీ అసత్య ప్రచారాలకు విద్యావంతులు లోనుకాకుండా... టీఆర్‌ఎస్‌ చేస్తున్న పనులను వివరించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్‌లో శనివారం జరిగిన ‘హైదరాబాద్‌– రంగారెడ్డి– మహబూబ్‌నగర్‌’పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సన్నాహక సమావేశంలో కేటీఆర్‌ ప్రసంగించారు. మం త్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్‌ అలీ, గంగుల కమలాకర్, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, మేయర్‌ గద్వాల విజయలక్ష్మితో పాటు హైదరాబాద్‌ నగరానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఏ రాజకీయ పక్షానికైనా ప్రతీ ఎన్నిక అత్యంత కీలకమని, ప్రస్తుత ఎన్నికలో కలిసికట్టుగా పనిచేసి పార్టీ అభ్యర్థి వాణీదేవి గెలుపు కోసం కృషి చేయాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు.  

ఆరేళ్లలో కేంద్రం అదనంగా నయాపైసా ఇవ్వలేదు 
కాంగ్రెస్‌ పార్టీకి చరిత్ర మినహా భవిష్యత్తు లేదని, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వాణీదేవిని ఎదుర్కొనే పరిస్థితి లేదని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు గత ఆరేండ్లలో అటు పట్టభద్రులు, ఇటు తెలంగాణ కోసం చేసిందేమీ లేదని, న్యాయవాది అయిన రామచంద్రరావు అసత్యాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో బీజేపీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదని, ఆ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజల్లో బలంగా ఎండగట్టాలన్నారు.

ఆరేండ్లలో తెలంగాణకు చట్టబద్దంగా రావాల్సిన నిధులు మినహా అదనంగా కేంద్ర ప్రభుత్వం నయాపైసా ఇవ్వలేదని, పెట్రోలు, డీజిల్‌ ధరల పెంపు అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేటీఆర్‌ పార్టీ శ్రేణులను కోరారు. ఆరేండ్లలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పట్టభద్రులకు గుర్తు చేయడంతో పాటు, యువత, నిరుద్యోగులకు అవకాశాలు, ఉద్యోగాల భర్తీపై ప్రతిపక్షాలు చేస్తున్న అసత్యాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని రీతిలో 1.32 లక్షల ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేయడంతో పాటు, ప్రైవేటు రంగంలో 14 లక్షల ఉద్యోగాలు కల్పించామన్నారు. 

ప్రభుత్వ ఉద్యోగులతో టీఆర్‌ఎస్‌ది పేగు బంధం 
‘ప్రభుత్వ ఉద్యోగులు టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకం అనేది దుష్ప్రచారం మాత్రమే. రాష్ట్ర సాధన ఉద్యమంలో మనతో వారంతా కలిసి పనిచేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో టీఆర్‌ఎస్‌ది పేగు బంధం. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత దేశంలోనే మొదటిసారిగా 43 శాతం ఫిట్‌మెంట్‌ను సీఎం ప్రకటించారు’అని కేటీఆర్‌ అన్నారు. పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారని, హైదరాబాద్‌లో కార్పోరేటర్లుగా పోటీ చేసేందుకు అభ్యర్థులు లేని పరిస్థితి నుంచి రెండు పర్యాయాలు జీహెచ్‌ఎంసీలో సొంత బలంతో మేయర్‌ పీఠం దక్కించుకునే స్థాయికి పార్టీ చేరిందన్నారు. హైదరాబాద్‌ నగర అభివృద్దిని పట్టభద్రులకు వివరించి ఓట్లు అభ్యర్థించాలని కేటీఆర్‌ కోరారు. సమావేశంలో ఎమ్మెల్యేలు సాయన్న, దానం నాగేందర్, ముఠా గోపాల్, గాంధీ, గోపినాథ్, టీఆర్‌ఎస్వీ నేత గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 

కార్పోరేటర్ల గైర్హాజరుపై కేటీఆర్‌ ఆగ్రహం 
పట్టభద్రుల ఎన్నిక సన్నాహక సమావేశానికి పలువురు జీహెచ్‌ఎంసీ కార్పోరేటర్లు, మాజీ కార్పోరేటర్లు గైర్హాజరు కావడంపై పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏదైనా పని ఉంటే ముందే అనుమతి తీసుకొని వెళ్లడాన్ని అర్దం చేసుకోవచ్చు. అలిగేది ఉంటే ముందే చెప్పండి. మీకు రావడం కుదరకపోతే ప్రత్యామ్నాయం చూసుకుంటాం. వేరేవాళ్లను పెట్టి పనిచేసుకుంటాం. ఇటీవలి గ్రేటర్‌ ఎన్నికల్లో పనిచేసినట్లు ఎవరికి వారు.. ఇష్టారీతిగా పనిచేస్తామంటే కుదరదు. పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారు. వారికి కచ్చితంగా గుర్తింపునిస్తాం. ప్రస్తుత ఎన్నికలో పార్టీ అభ్యర్థి కోసం కలిసికట్టుగా పనిచేయండి’అని కేటీఆర్‌ పిలుపునిచ్చారు.  

చదవండి: (మార్చి మూడో వారంలో రాష్ట్ర బడ్జెట్‌)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top