బీజేపీవి చిల్లర ప్రయత్నాలు

KTR Slams On BJP Money Distribution Dubbaka Bypoll Elections - Sakshi

ధ్వజమెత్తిన మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌లో కార్యకర్తలను రెచ్చగొట్టి డ్రామాకు తెరతీశారు

ఓట్ల కోసం వారి ప్రాణాలను పణంగా పెట్టడం దుర్మార్గం

రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా కుట్రలు

సాక్షి, హైదరాబాద్‌: దుబ్బాక శాసనసభ ఉప ఎన్నికలో నాలుగు ఓట్లు సంపాదించేందుకు భారతీయ జనతా పార్టీ చిల్లర ప్రయత్నాలన్నీ చేస్తోందని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ విమ ర్శించారు. ఇప్పటికే డబ్బుల డ్రామా ఫెయిలైందని, సామాజిక మాధ్యమాల్లో విషప్రచారం, మితిమీరిన అబద్ధాలను ప్రచారం చేసి ప్రజల దృష్టిని మళ్లించేం దుకు చేసిన ప్రయత్నాలు కూడా సఫలం కాలే దన్నారు. దీంతో చివరగా హైదరాబాద్‌లో కార్యకర్త లను రెచ్చగొట్టి చివరి దశ డ్రామాకు తెరలేపుతోం దని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా కార్యక్రమాలు రచిస్తున్నారని ఆరోపించారు. ఆదివారం టీఆర్‌ఎస్‌ భవన్‌లో మంత్రులు శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్‌ తది తరులతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు.

ఆ ప్రచారం దారుణం..:
దుబ్బాక సెగ్మెంట్‌ పరిధిలో టీఆర్‌ఎస్‌ పార్టీ నేతల ఇళ్లలో కూడా సోదాలు జరిగాయని, కానీ కేవలం బీజేపీ నేతల ఇళ్లపైనే దాడులు జరుగుతున్నాయనే ప్రచారాన్ని సామాజిక మాధ్యమాల్లో చేయడం దారుణమని మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. అయితే బీజేపీ నేతల ఇళ్లలో పెద్ద ఎత్తున నగదు దొరకడం వాస్తవమని, ఆ ఇంటి ఆడపడుచులే ఈ విషయాన్ని బహిరంగంగా చెబుతున్నారన్నారు. తాజాగా హైదరాబాద్‌లో రూ.కోటి నగదు పట్టుబడిందని వెల్లడించారు. బీజేపీ అధ్యక్షుడిపై దాడి జరిపినట్లు, ఎమ్మెల్యే అభ్యర్థి చెయ్యి విరిగినట్లు సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలు జరగడం సహజమని, కానీ ఈ ఎన్నికల్లో గెలుపొందేందుకు తప్పుదారి పట్టడం సరికాదని హితవు పలికారు. 

బీజేపీదీ హింసాత్మక మార్గం..
ప్రజల మద్దతు సాధించేలా కార్యక్రమాలు ఉండాలని, బీజేపీ అలాంటి దారి కాకుండా హింసాత్మక మార్గాన్ని ఎంచుకుందని కేటీఆర్‌ దుయ్యబట్టారు. బీజేపీ పార్టీ కార్యాలయం ఎదుట ఓ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి ఒడికట్టినట్లు తమకు సమాచారం ఉందని, దీన్ని ఆసరాగా చేసుకుని సోమవారం హైదరాబాద్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా కార్యక్రమాలు రచిస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంపై ఇప్పటికే కార్యకర్తలకు సమాచారాన్ని చేరవేశారన్నారు. సోమవారం నాటి కుట్రకు సంబంధించిన సమాచారం బీజేపీ క్యాంపు నుంచే తమకు లీకైందని కేటీఆర్‌ చెప్పారు. హైదరాబాద్‌లో డీజీపీ కార్యాలయం లేదా ప్రగతిభవన్, తెలంగాణ భవన్‌ ముట్టడి పేరుతో బీజేపీ సోమవారం కార్యచరణకు సిద్ధం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా లాఠీచార్జ్‌ జరిగేలా అవసరమైతే ఫైరింగ్‌ జరిగేలా ఆందోళన చేపట్టాలని నిర్ణయించారన్నారు. దీంతో వచ్చే సానుభూతిని దుబ్బాక ఎన్నికల్లో ఓట్లుగా మలుచుకునేందుకు చూస్తోందని విమర్శించారు. కార్యకర్తల ప్రాణాలను పణంగా పెట్టి ఓట్లు రాబట్టాలనుకోవడం అత్యంత దుర్మార్గమన్నారు.

ఆ కుట్రలను టీఆర్‌ఎస్‌ ఎదుర్కొంటుంది..
బీజేపీ చేసే కుట్రలను టీఆర్‌ఎస్‌ పార్టీ గట్టిగా ఎదుర్కొంటోందని, ఈ అంశాలపై సమాచారాన్ని ఎప్పటికప్పుడు టీఆర్‌ఎస్‌ బాధ్యులు, ప్రచారకర్తలు సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తున్నారని కేటీఆర్‌ చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను విఘాతం కలిగించే ఏ కార్యక్రమాన్ని ఉపేక్షించొద్దని టీఆర్‌ఎస్‌ కోరుకుంటోందన్నారు. బీజేపీ చేసే కుట్రను భగ్నం చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. ఇటు డీజీపీకి తమ పార్టీ తరఫున వినతిపత్రాన్ని కూడా ఇచ్చామన్నారు. అలాగే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి సైతం వినతి పత్రం ఇస్తామని తెలిపారు. బీజేపీలాంటి రాజకీయ శక్తి పట్ల దుబ్బాక ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్‌ సూచించారు. డీజీపీకి వినతిపత్రం ఇచ్చిన వారిలో చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు ఆనంద్, వెంకటేశ్, గోపీనాథ్‌ తదితరులున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top