
మంగళవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్. చిత్రంలో దాసోజు, కుర్ర సత్యనారాయణ
సాక్షి, హైదరాబాద్: ప్రదానమంత్రి నరేంద్ర మోదీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుంటే.. గవర్నర్లు ఆయన ఏజెంట్లుగా ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు తీవ్రంగా విమర్శించారు. అనేక ఉద్యమాల్లో పాల్గొన్న దాసోజు శ్రవణ్, జాతీయ స్థాయిలో ట్రేడ్ యూనియన్ నాయకుడిగా పనిచేసిన కుర్ర సత్యనారాయణను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తే, వారు రాజకీయ పార్టీలో ఉన్నారంటూ గవర్నర్ తమిళిసై తిరస్కరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఎవరు అన్ ఫిట్ అనేది ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటాం..
‘రాజకీయాల్లో ఉన్న వారు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా అనర్హులన్న తమిళిసై.. తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న సమయంలో సర్కారియా కమిషన్ సూచనలు తుంగలో తొక్కి తెలంగాణ గవర్నర్‌గా నియమితులయ్యారు. తెలంగాణ ప్రభుత్వం నామినేట్ చేసిన అభ్యర్థులు అన్ ఫిట్ అని ఆమె అంటున్నారు. ప్రధాని మోదీ లేదా గవర్నర్ తమిళిసై.. ఎవరు అన్ ఫిట్ అనేది ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం.
దేశంలో అందరికంటే అన్ ఫిట్ మంత్రి కిషన్‌రెడ్డి. గవర్నర్ పదవికి తమిళిసై అన్ ఫిట్. ఇద్దరు బలహీనవర్గాల వారిని మండలిలోకి తెస్తే మీకేం బాధ? వారికి రాజకీయ పార్టీతో సంబంధం ఉంటే తప్పేంటి? మీకు రాజకీయ పార్టీతో సంబంధం లేదా? గవర్నర్‌గా ఉంటూ బీజేపీ నాయకురాలిగా పని చేయడం లేదా? మీకు వర్తించనిది ఇతరులకు ఎలా వర్తిస్తుంది?..’ అంటూ కేటీఆర్ నిలదీశారు.
పైనుంచి అందిన ఆదేశాల మేరకే..
‘బీజేపీ నేతలు జ్యోతిరాదిత్య, రంజన్ గగోయ్ రాజ్యసభ సభ్యులుగా నియమితులయ్యారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆ పార్టీ నేతలు పలువురు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు అయ్యారు. కానీ తెలంగాణలో రాష్ట్ర మంత్రివర్గం సిఫారసు చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను పైనుంచి అందిన ఆదేశాల మేరకు గవర్నర్ తిరస్కరించారు.
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలకు బదులు మోదీ ఏజెంట్లదే పెత్తనమైతే పరిస్థితి ఏంటి? గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వాలను పని చేయనీయడం లేదు. వలస పాలనకు చిహ్నమైన గవర్నర్ పదవి ఇంకా అవసరమా? నామినేటెడ్ ఎమ్మెల్సీల విషయంలో సాధ్యమైన మార్గాలను అన్వేషిస్తాం. గవర్నర్ కోరిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్‌తో మళ్లీ పంపుతాం..’ అని చెప్పారు.
తెలంగాణపై ప్రధాని మోదీ విషం
‘ఎన్‌డీఏ కూటమిలో భాగస్వామి అయిన బీజేపీ తన డీఎన్‌ఏతో పాటు నరనరాన విషం నింపుకుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానిస్తూ ఆత్మగౌరవం దెబ్బతీసేలా ప్రధాని మోదీ విషం చిమ్ముతున్నారు. పార్లమెంటుతో పాటు బహిరంగ సభ వేదికలపై తెలంగాణ పుట్టుక, అస్తిత్వాన్ని అగౌరవ పరుస్తున్నారు.
ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటులో అమృత్‌కాల్ సమావేశాల్లో ‘తల్లిని చంపి బిడ్డను వేరు చేశారు’ అంటూ మోదీ అజ్ఞానంతో చేసిన విషపూరిత వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల త్యాగాన్ని, ఉద్యమాన్ని కించపరిచేలా ఉన్నాయి. రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి పుట్టగతులు ఉండవు. తెలంగాణ ప్రజల త్యాగాలను అవమానించిన ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి..’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
పాలమూరులో పాప పరిహారం చేసుకోవాలి
‘దేశంలో అత్యంత అవినితి ప్రధాని మోదీ. అక్టోబర్ 1న పాలమూరుకు వస్తున్నారు. మోదీకి అక్కడ కాలు పెట్టే నైతిక హక్కు లేదు. కృష్ణా గోదావరి జలాల్లో వాటా తేల్చాలని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లేదా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని సీఎం కేసీఆర్ కోరినా ప్రధాని స్పందించలేదు. ఇక్కడి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వకుండా ఇతర రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు ఇచ్చారు.
కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి ఉన్న 811 టీఎంసీల కేటాయింపుల్లో తెలంగాణకు 575 టీఎంసీలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న డిమాండ్‌ను ఆమోదిస్తున్నారో లేదో మహబూబ్‌నగర్ గడ్డపై మోదీ స్పష్టం చేయాలి. బీజేపీ జాతీయ పార్టీ కాదు, తెలంగాణ జాతిని మోసం చేసిన పార్టీ. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్ ఆమోదించకుండా కొర్రీలతో ఇబ్బందులు పెట్టారు.
ఓట్ల వేట కోసం రాష్ట్రానికి వస్తున్న మోదీ పాప పరిహారం చేసుకుని పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలి. లేకుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 110 స్థానాల్లో డిపాజిట్లు కూడా దక్కవు..’ అని మంత్రి అన్నారు. ‘జమిలి ఎన్నికలు మోదీ డైవర్షన్ రాజకీయాలకు నిదర్శనం. ఆయన జిమ్మిక్కుల్లో భాగం.
నియోజవకర్గాల పునర్విభజనలో జనాభా నియంత్రణ చేసిన దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరిగితే భావసారూప్య పార్టీలతో చర్చించి గళమెత్తుతాం. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల్లోకి రావడం, పోవడం అత్యంత సహజం. రేపు కాంగ్రెస్ నుంచి కూడా మా పార్టీలోకి నేతలు రావొచ్చు. ఇతర పార్టీల్లోకి మా పార్టీ నేతలు వెళ్లడానికి అంతగా ప్రాధాన్యత లేదు..’ అని కేటీఆర్ అన్నారు.