రాష్ట్రంలో బీజేపీ ఖాళీ.. ఢిల్లీలో ప్రధాని కుర్చీ ఖాళీ | KTR Comments On BJP and Amit Shah | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో బీజేపీ ఖాళీ.. ఢిల్లీలో ప్రధాని కుర్చీ ఖాళీ

Apr 24 2023 3:43 AM | Updated on Apr 24 2023 3:43 AM

KTR Comments On BJP and Amit Shah - Sakshi

అమిత్‌ షా జీ.. త్వరలో అధికారంలోకి కాదు..బీజేపీ అంధకారంలోకే. త్వరలో రాష్ట్రంలో బీజేపీ ఖాళీ.. ఢిల్లీలో ప్రధాని కుర్చీ ఖాళీ. 2024లో వైఫల్యాల మోదీకి గుజరాత్‌ ఘర్‌వాపసీ తప్పదు. మరోసారి మోదీని ప్రధాని పీఠం ఎక్కిస్తే దేశాన్ని బలిపీఠం ఎక్కించినట్టేననే బలమైన భావనలో ప్రజలున్నారు.

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా చేవెళ్ల సభలో చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి కె. తారక రామారావు ఆదివారం రాత్రి ట్విట్టర్‌ వేదికగా ఘాటుగా స్పందించారు. ‘డియర్‌ అమిత్‌షా జీ..త్వరలో అధికారంలోకి కాదు.. బీజేపీ అంధకారంలోకే.. త్వరలో రాష్ట్రంలో బీజేపీ ఖాళీ.. ఢిల్లీలో ప్రధాని కుర్చీ ఖాళీ.. 2024లో వైఫల్యాల మోదీకి గుజరాత్‌ ఘర్‌వాపసీ తప్పదు.. మరోసారి మోదీని ప్రధాని పీఠం ఎక్కిస్తే దేశాన్ని బలిపీఠం ఎక్కించినట్టేననే భావనలో ప్రజలున్నా రు’ అంటూ అమిత్‌షా వ్యాఖ్యలపై ఎక్కడికక్కడ కౌంటర్‌ ఇస్తూ ఆయన చేసిన వరుస ట్వీట్లు ఇలా.. 

అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్‌ 
‘కారు స్టీరింగ్‌ కాదు.. బీజేపీ స్టీరింగే అదానీ చేతికి చిక్కింది. కార్పొరేట్‌ దోస్తు కబంధహస్తాల్లో కమలం  విలవిలలాడుతోంది. హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌తో బీజేపీ ఫుల్‌ పిక్చర్‌ను దేశప్రజలు 70 ఎంఎంలో చూసేశారు. ఇంకా ఏ ట్రైలర్‌ అవసరం లేదు. తెలంగాణలో గల్లీ బీజేపీ నేతల పగటివేషాలు నడవవు. ఢిల్లీ పెద్దల పగటికలలు నెరవేరవు.

అదానీపై జేపీసీ వేయని బీజేపీకి సిట్టింగ్‌ జడ్జి విచారణ అడిగే హక్కుందా?. ముక్కునేలకు రాసినా..మోకాళ్ల యాత్ర చేసినా..మోసాల మోదీని తెలంగాణ నమ్మదు. బట్టేబాజ్‌ బీజేపీని తెలంగాణ సమాజం క్షమించదు. కరప్షన్‌కు కెప్టెన్‌.. మోదీ. క్యాప్షన్‌.. బీజేపీ. ఎంఐఎం భుజంపై తుప్పుపట్టిన బీజేపీ తుపాకీపెట్టి ఎంతకాలం కాలుస్తారు?. తెలంగాణలో సొంత బలం లేని పార్టీ బీజేపీ. పల్లెపల్లెనా బలగం కలిగిన పార్టీ బీఆర్‌ఎస్‌’.  

నిస్సిగ్గుగా సుద్దులా? 
‘బారాణా తీసుకుని చారాణా కూడా ఇవ్వని బీజేపీకి మిగిలేది బూడిదే. అదానీ విషయంలో జేపీసీ కాదు కదా కనీసం సిట్‌ కూడా వేయని వారు అవినీతి గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. గుజరాత్‌లో మోదీ హయాంలో మీరు హోంమంత్రిగా ఉన్నప్పుడు పేపర్‌ లీకుల్లో గుజరాత్‌ నంబర్‌వన్‌గా ఉన్నమాట నిజం కాదా?. గత ఎనిమిదేళ్లలో గుజరాత్‌లో 13సార్లు పేపర్లు లీక్‌ కాలేదా?. ఈ దేశంలో ‘వ్యాపం’ లాంటి అతి జుగుప్సాకరమైన స్కాం చేసింది మీ బీజేపీ ప్రభుత్వం కాదా?. అటువంటి మీరు నిస్సిగ్గుగా సుద్దులు మాట్లాడటం మీకే చెల్లింది’. 

పీఎం కేర్స్‌లో ఎంత జమైందో చెబుతారా? 
‘పీఎం కేర్స్‌లో ఎంత జమైందో, ఏవిధంగా ఖర్చ యిందో చెప్పని వారు, కాగ్‌ ఆడిట్‌ పీఎం కేర్స్‌కు వర్తించదని నిస్సిగ్గుగా సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ వేసిన వారు, కాగ్‌ మాత్రమే కాక అన్ని రకాల బ్యాంక్స్‌ ఆడిట్లతో కట్టిన ప్రాజెక్టులపై మాట్లాడటం అవివేకం కాక మరేమిటి?. ఎనిమిదేళ్లుగా కృష్ణా నదిలో తెలంగాణ వాటా తేల్చకుండా, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించకుండా ఇక్కడికొచ్చి ఎవరో మీ గులాములు రాసిచ్చిన స్క్రిప్టును వల్లెవేస్తే నమ్మేదెవరు?’ అంటూ కేటీఆర్‌ తన వరుస ట్వీట్‌లను ముగించారు.

మీకు ఫ్రెండ్‌ ఫస్ట్‌.. నేషన్‌ లాస్ట్‌.. 
‘ఐటీఐఆర్‌ హైదరాబాద్, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, హైదరాబాద్‌ మెట్రో రెండోదశ, ఐఐఎం, ఐసెర్, ట్రిపుల్‌ ఐటీ, ఎన్‌ఐడీ, నవోదయ, మెడికల్‌ కాలేజీలు, నర్సింగ్‌ కాలేజీలకు శంకుస్తాపన చేసినందుకు కృతజ్ఞతలు. ఓహ్‌.. ఆగండాగండి.. ఇవేవీ ఆయన చేయలేదు’ అంటూ అమిత్‌ షాను ఉద్దేశించి రాష్ట్రమంత్రి కేటీఆర్‌ మరో ట్వీట్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గడిచిన తొమ్మిదేళ్లలో తెలంగాణ కంటే మెరుగ్గా పనిచేసిన బీజేపీ పాలిత రాష్ట్రం పేరు ఒక్కటీ ఎందుకు చెప్పలేకపోయారు’ అని మంత్రి కేటీఆర్‌ అమిత్‌షాను ప్రశ్నించారు.

‘ఆకాశాన్నంటుతున్న పప్పు, ఉప్పు, నూనె ధరలు నియంత్రించే సోయి లేదు. ప్రజలపై పెట్రోధరల భారాన్ని తగ్గంచాలన్న సోయి కూడా లేదు. గ్యాస్‌ ధరలను భరించలేకపోతున్న మహిళలపై కనికరం లేదు. కానీ ఆగమేఘాలపై అదానీ కంపెనీని ఆదుకోవడమే మీ ఏకైక లక్ష్యం. దేశం కోసం కాదు.. దోస్తు కోసం ప్రజల రెక్కల కష్టాన్ని ధారపోస్తున్న వైనం. సామాన్యుడు ప్రశ్నిస్తున్నాడు.. ప్రధాని ప్రాధాన్యాల్లో పేదవాడు ఎక్కడ?. దేశానికి అర్దమైంది.. మీకు ఫ్రెండ్‌ ఫస్ట్‌.. నేషన్‌ లాస్ట్‌’ అంటూ కేటీఆర్‌ బీజేపీపై మండిపడ్డారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement