ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి రాజధానికి సంబంధించి చేస్తున్న ప్రకటనలు ప్రజలను మభ్యపెట్టేవిగా ఉంటున్నాయా? లేక అంతా ఆమోదించేవిగా ఉంటున్నాయా అన్నది చర్చనీయాంశంగా ఉంది. ఈ మధ్య కాలంలో చంద్రబాబు చేసిన కొన్ని ప్రకటనలను గమనించండి. అమరావతికి లక్ష్మీ కటాక్షం-హిందూ ధర్మానికి సాక్ష్యంగా రాజధానిని నిర్మిస్తున్నాం.. అమరావతి అంటే విజయవాడ గుంటూరు, మంగళగిరి కలిసి ఉండేదే.. ఈ వ్యాఖ్యలను విశ్లేషించుకుంటే ఏమి అర్దం అవుతుంది?ఇంతకాలం అమరావతిని దేవతల రాజధాని అని ఆయన ప్రచారం చేశారు. దీనిపై వస్తున్న ప్రశ్నలను దృష్టిలో పెట్టుకున్నారేమో తెలియదు కాని ప్రజల రాజధాని అని కూడా అంటున్నారు. అంతవరకు సంతోషమే.
దేశంలో మరే రాష్ట్రంలో తమది దేవతల రాజధాని అని ఏ ముఖ్యమంత్రి చెప్పి ఉండరు. ప్రజలను సెంటిమెంట్‌తో ఆకట్టుకోవడం కోసం ఆయన ఇలా చేస్తున్నారన్నది తెలుస్తూనే ఉంది. గత ఏడెనిమిదేళ్లుగా ఆయన ఈ మాట చెబుతూనే ఉన్నారు. తాజాగా మరో అడుగు ముందుకు వేసి హిందూ ధర్మానికి సాక్ష్యంగా రాజధానిని నిర్మిస్తున్నామని చంద్రబాబు అన్నారట. ఇలా అనడంలోని ఆయన ఉద్దేశం ఏమిటో తెలియదు. భారత్.. రాజ్యాంగం ప్రకారం సెక్యులర్ దేశంగా ఉంది. అన్ని మతాలను సమానంగా చూడాలి. చంద్రబాబు బీజేపీతో పొత్తు ఉంటే ఒకరకంగా, లేకుంటే మరో రకంగా వ్యవహరిస్తుంటారన్న భావన రాజకీయ వర్గాలలో ఉంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు వ్యతిరేకంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదితరులు మతపరమైన రాజకీయాలు చేయడానికి రకరకాల యత్నాలు చేశారు. చంద్రబాబు 2024లో మరోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్లీ అదే ప్రయత్నం సాగిస్తున్నారు.
తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందంటూ ఆరోపించి, వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా జనాన్ని రెచ్చగొట్టేందుకు కృషి చేశారు. తీరా అలాంటిదేమీ జరగలేదని తేలడంతో ఆయన సెల్ఫ్‌గోల్ వేసుకున్నట్లయింది. అయినప్పటికీ ఈ మధ్య మీమతం, మా మతం, మీ దేవుడు, మా దేవుడు అంటూ స్పీచ్‌లు ఇస్తూ ప్రజలను అటువైపు మళ్లించడానికి తంటాలు పడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను డైవర్ట్ చేయడానికి ఆయన ఇలా మతపర వ్యాఖ్యలు చేస్తున్నారన్న అభిప్రాయం ప్రబలుతోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు గత డెబ్బై ఐదేళ్లలో ఎన్నడూ మతాల ఆధారంగా కాకుండా ప్రభుత్వాల పనితీరు, విధానాల ఆధారంగానే ఓట్లు వేస్తూ వచ్చారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక మతపరమైన అంశాలకు ప్రాధాన్యం పెరిగిన మాట వాస్తవమే. అందులోనూ మోదీ ప్రధానమంత్రి అయ్యాక ఈ ధోరణి మరింత హెచ్చింది. బీజేపీ మెప్పు కోసం చంద్రబాబు కూడా హిందూయిజాన్ని ప్రధాన అంశంగా మలచుకుని ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నట్లుగా కనిపిస్తుంది. అమరావతి రాజధానిలో జగన్నాధ రధయాత్రలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా స్వామివారి ఆశిస్సులను కోరుకోవడం, ప్రజలకు మేలు కలగాలని ప్రార్ధించడం సహజంగానే జరుగుతుంది. కాని హిందూ ధర్మానికి సాక్ష్యంగా రాజధానిని నిర్మించడం ఏమిటో తెలియదు. ఈ మాటలు విన్న ఇతర మతాలవారికి అది ఎలాంటి భావన కల్గిస్తుందన్నది ఆయన ఆలోచించుకోవాలి!
గతంలో కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి అమరావతిని కమ్మరావతి అని పిలవరా అని అన్నప్పుడు తీవ్ర విమర్శలు వచ్చాయి. టీడీపీకి దూరంగా ఉన్న రోజుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీగా మారిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవారు అన్ని కులాలను, మతాలను తన వెంట తీసుకువెళ్లేలా వ్యవహరించాలి. దేశం కాని, రాష్ట్రం కాని మతపరమైనవిగా లేవన్న సంగతి గుర్తించాలి. స్థల మహత్యంతో అమరావతిని ఎవరూ కదలించలేరని అంటూ రాజకీయ లక్ష్యంగా ప్రసంగం చేసినట్లు అనిపిస్తుంది. ఆధ్యాత్మికత తోడుంటేనే ప్రశాంతత వస్తుందని ఆయనే చెబుతారు. కాని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వచ్చినప్పుడు ఆయనే రాజకీయ ప్రసంగాలు చేస్తుంటారు.
అమరావతికి లక్ష్మీ కటాక్షం లభిస్తుందని చంద్రబాబు అంటున్నారు. అది నిజమే అయితే అంతా సంతోషపడతారు. లక్ష్మీ కటాక్షం రాష్ట్రం అంతటికి రావాలని ఎవరైనా కోరుకుంటారు కాని, అమరావతికే కోరడం ఏమిటో తెలియదు. ఇప్పటికైతే అమరావతి ద్వారా ప్రభుత్వానికి లక్ష్మీ కటాక్షం ఎంత జరిగిందో అంటే.. ఎంత ఆదాయం వచ్చిందో తెలియదు కాని, అప్పు మాత్రం 47వేల కోట్లకు చేరింది. ఇక్కడ మౌలిక వసతులు కల్పించడానికి లక్షకోట్లు ప్రస్తుతం ఖర్చు చేయవలసి ఉందని అంటారు. నిజంగానే లక్ష్మీకటాక్షం జరిగి, ప్రజల మీద భారం లేకుండా అమరావతి సొంతంగా సంపాదించుకుంటే చంద్రబాబు చెప్పింది నిజమేనని నమ్ముతారు. అలాకాకుండా వేల కోట్ల అప్పులు తెస్తూ దానినే లక్ష్మీ కటాక్షం అని అనుకోవాలంటే కష్టం అవుతుంది.
అంతేకాదు... అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ఈ రెండేళ్లలో కలిగిన లక్ష్మీ కటాక్షం పెద్దగా ఏమి లేదని బాధపడుతుంటారు. వారికి ప్లాట్లు అభివృద్ధి చేసి ఇచ్చి ఉంటే కొంత కటాక్షం కలిగేదేమో. పైగా బలవంతపు భూ సేకరణ ద్వారా రైతుల వద్ద ఉన్న లక్ష్మీని కూడా ప్రభుత్వం లాక్కుంటోందన్న బాధ పలువురిలో ఉంది. కొందరు మహిళలను సైతం ప్రభుత్వం ఈ విషయంలో వేధించిన తీరు చూసి లక్ష్మీదేవి కూడా బాధపడి ఉండాలి. ప్రభుత్వం స్టార్ హోటళ్లకు ఎకరా ఎనిమిది కోట్లకు భూమి ఇస్తామని ప్రతిపాదించిందట. అదే టైమ్ లో భూముల సొంతదారులైన రైతులకు మాత్రం కోటి, రెండు కోట్లు కూడా ఇవ్వడం లేదని ఉండవల్లి రైతులు వాపోతున్నారు.
చివరిగా మరో మాట.. మాజీ సీఎం జగన్ మావిగన్ అంటే విజయవాడ, గుంటూరు, మచిలీపట్నంలను ఒక కారిడార్‌గా తీసుకుని రాజధాని అభివృద్ది చేయాలని సలహా ఇస్తే దానిని చంద్రబాబు ఎద్దేవ చేశారు. కాని తాజాగా చేసిన ఒక ప్రసంగంలో అమరావతి అంటే విజయవాడ, మంగళగిరి, గుంటూరు కలిసి ఉన్నాయని అంటున్నారు. అవి ఇందులో భాగం అయితే రైల్వేస్టేషన్, ఎయిర్‌పోర్టు వంటివి మళ్లీ ఎందుకు నిర్మించాలి? వాటికోసం వేల ఎకరాల భూములు తీసుకుని రైతులను ఎందుకు బాధించాలి అన్న ప్రశ్నకు జవాబు దొరకదు. మొత్తం తెచ్చిన అప్పు అంతా అమరావతి 29 గ్రామాలలోనే ఎందుకు వ్యయం చేస్తున్నారన్నదానికి సమాధానం చెప్పరు. అయితే జగన్ మావిగన్ ప్రతిపాదనను కాదనలేని స్థితికి చంద్రబాబు చేరుకున్నారని అనుకోవాలి. మతం మత్తు మందు వంటిదని కారల్ మార్క్స్ అంటారు. దానిని ఎంతవరకు అంగీకరిస్తారో తెలియదు కాని, మతం పేరుతో రాజకీయ లబ్ది పొందడానికి మాత్రం చంద్రబాబు వేస్తున్న వ్యూహాలు ప్రజలకు అర్థం కాకుండా ఉంటాయా?.

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత


