పోలవరంపై రివర్స్‌ గేర్‌ ఏం చెబుతుందంటే.. | Ksr Comments On Chandrababu Naidu's Criticism Of The Polavaram Project | Sakshi
Sakshi News home page

పోలవరంపై రివర్స్‌ గేర్‌ ఏం చెబుతుందంటే..

Published Fri, Jun 21 2024 11:16 AM | Last Updated on Fri, Jun 21 2024 6:16 PM

Ksr Comments On Chandrababu Naidu's Criticism Of The Polavaram Project

ఆంధ్రప్రదేశ్‌కు అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టు గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర నిరుత్సాహాన్ని కలిగించాయి. కారణాలు ఏవైనా, ఈ ప్రాజెక్టు ఇప్పట్లో పూర్తి కాదన్న సమాచారం బాధ కలిగిస్తుంది. చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించింది కేవలం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌డ్డిను విమర్శించడానికి, పోలవరం జాప్యం నెపం మొత్తాన్ని ఆయనపై నెట్టడానికే అన్నట్లు పర్యటన సాగించారు.

2014 నుంచి ఐదేళ్లపాటు చేసిన పాలనలో ఈ ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేశానని చెప్పుకుంటే చెప్పుకోనివ్వండి. అందులో వాస్తవం ఉందా? లేదా? అనేది వేరే విషయం. నిజంగా అంత పని పూర్తి అయిపోయి ఉంటే కీలకమైన డయాఫ్రం వాల్ వరదలలో కొట్టుకుని పోయేది కాదు కదా అనే లాజిక్‌కు సమాధానం దొరకదు. వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం నిర్మాణ సంస్థను మార్చిందని చంద్రబాబు అంటున్నారు. దానివల్ల జాప్యం అయిందని చెబుతున్నారు. ఒకవేళ అది నిజమే అనుకుంటే చంద్రబాబు తాను అధికారంలోకి రాగానే పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్‌ను ఎందుకు మార్చారో చెప్పాలి కదా! నామినేషన్ పద్దతిన నవయుగ సంస్థకు ఎందుకు ఇచ్చారో వివరించాలి కదా! డయాఫ్రం వాల్‌తో సహా ఆయా పనులు నామినేటెడ్ పద్దతిన కొన్ని కంపెనీలకు ఎందుకు కేటాయించారన్నది వివరించాలి కదా!

2014 టరమ్‌లో కేంద్రంలో పొత్తులో భాగంగా ఉన్న తెలుగుదేశం పార్టీ పోలవరం ప్రాజెక్టును కేంద్రమే చేపట్టి సత్వరమే పూర్తి చేయించేలా ఒత్తిడి తేవడం మాని, రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతుందని ఎందుకు కోరినట్లు? ఆ ప్రాజెక్టు కాంట్రాక్టును తనకు కావల్సినవారికే ఇచ్చుకునేందుకే అన్న విమర్శలకు ఎందుకు తావిచ్చారు. స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ 2019 ఎన్నికల ప్రచారంలో పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎమ్ అయిందని ఎందుకు విమర్శించారు. దానికి చంద్రబాబు ఎందుకు సమాధానం చెప్పలేదు! మళ్లీ పొత్తు కుదిరింది కనుక మోడీ కూడా ఆ పాయింట్ మర్చిపోయినట్లు నటిస్తుండవచ్చు. అది వేరే విషయం. పోనీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్మించదలచినప్పుడు వ్యయ అంచనాలపై కేంద్రంతో ఎందుకు సరైన అవగాహనకు రాలేదు?

కేవలం ప్రాజెక్టు నిర్మాణమే కాకుండా, ప్రాజెక్టువల్ల ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలను అక్కడనుంచి తరలించడం, వారికి పునరావాసం కల్పించడానికి అయ్యే వ్యయం గురించి ఎందుకు కేంద్రంతో ఒప్పందం కాలేదు? కేంద్ర ప్రభుత్వం తాము ప్రాజెక్టు కడతాము కానీ, నిర్వాసితుల సమస్య రాష్ట్రమే చూసుకోవాలని చెప్పినప్పుడు ఎందుకు ప్రతిఘటించలేదు? అలాంటప్పుడు మొత్తం ప్రాజెక్టును కట్టి, రాష్ట్రానికి అప్పగించాలని ఎందుకు కోరలేదు. వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం స్పిల్ వే, గేట్ల అమరిక తదితర పనులను పూర్తి చేసింది నిజం కాదా? ఇవన్నీ అవ్వకుండానే పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేశామని చంద్రబాబు చెబితే అది నిజమే అవుతుందా?

2018 నాటికే ప్రాజెక్టును పూర్తి చేస్తామని శాసనసభలోనే టీడీపీ ప్రభుత్వం ప్రకటించిందా? లేదా? అయినా ఎందుకు పూర్తి కాలేదు? వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం వివిధ ప్రాజెక్టులకు రివర్స్ టెండరింగ్ ద్వారా నిధులు ఆదాచేసే ప్రయత్నం చేసింది. పోలవరం ప్రాజెక్టులో కూడా సుమారు 850 కోట్ల మేర తక్కువ వ్యయానికి మెఘా సంస్థ టెండర్ పొందింది. దీనిని తప్పు పడుతున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ ప్రాజెక్టు కాంట్రాక్టర్‌ను కొనసాగించదలిచారా? లేదా? పోలవరం ప్రాజెక్టు వ్యయం పెంపుదల కోసం వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి కేంద్రాన్ని ఒప్పించారా? లేదా?

బీజేపీతో పొత్తు కుదిరిన తర్వాత ఆ మొత్తం గురించి కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోకుండా టీడీపీ నాయకత్వమే ఆపుచేయించిందన్న విమర్శల గురించి ఏమి చెబుతారు? బీజేపీతో పొత్తు పెట్టుకునే క్రమంలో ప్రత్యేక హోదాతో పాటు పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితుల వ్యయం కేంద్రం పూర్తిగా భరించి సహకరించాలని చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు ఎందుకు కోరలేకపోయారు? చంద్రబాబు తన హయాంలో ఆయా కీలక పనుల ప్రాధాన్యతలను మార్చి పనులు చేయించడంవల్లే ఈ సమస్య వచ్యిందన్నది వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి వాదన. దీనిని ఆయన గత అసెంబ్లీలో వివరణాత్మకంగా వివరించారు.

కాఫర్ డామ్ పూర్తి కాకుండానే, గ్యాప్‌లు ఉంచి డయాఫ్రం వాల్ నిర్మాణం తలపెట్టింది చంద్రబాబు ప్రభుత్వమా? కాదా? డయాఫ్రం వాల్ నిర్మాణం వరద కారణంగా దెబ్బతిన్నదంటే అది నాణ్యతాలోపమా? లేక మరేదైనా కారణమా? దీనిపై కేంద్ర జల కమిషన్ ఎందుకు ఒక నిర్ణయం తీసుకోవడానికి తాత్సారం చేస్తోంది? కేంద్రంలో ఇప్పుడు కూడా టీడీపీ భాగస్వామి కనుక ఈ ప్రాజెక్టు వేగంగా పూర్తి చేయడానికి ఏమి చర్యలు తీసుకుంటుందో చెప్పకుండా వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డిపై నిందలు వేస్తే ఏమి ప్రయోజనం. తాను పూర్తి చేసి చూపిస్తే ఆయనకే పేరు వస్తుంది కదా! ఇన్ని రాజకీయాలు ఎందుకు!

మొత్తం ప్రాజెక్టును కేంద్రానికి అప్పగిస్తే పూర్తి చేయిస్తామని బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి గతంలో అన్నారు కదా? ఆ ప్రకారం ముందుకు వెళ్లే ఆలోచన చేస్తారా? కీలకమైన ఢయాప్రం వాల్ నిర్మాణం, సీపేజీ నీరు రాకుండా అడ్డుకోవడం వంటి వాటిపై దృష్టి పెట్టి, డామ్ నిర్మాణం పూర్తి చేయడానికి నాలుగు సీజన్‌లు అంటే నాలుగేళ్లు పడుతుందని నిపుణులు చెబుతున్నారని చంద్రబాబు తెలిపారు. దానిని ఎంత వీలైతే అంత తగ్గించడానికి ప్రయత్నించాలి కదా! కేవలం సాంకేతిక నిర్ణయం చేయడంలో కేంద్రం చేస్తున్న జాప్యాన్ని ఎందుకు చంద్రబాబు ప్రశ్నించడం లేదు?

పోలవరం ప్రాజెక్టుకు వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఎంత వ్యయం చేసింది? అందులో ఎంత మొత్తాన్ని కేంద్రం తిరిగి చెల్లించింది?మొదలైన వివరాలను చంద్రబాబు ఎందుకు వెల్లడించలేదు? ఇప్పుడు సమస్య రాష్ట్రం పరిధిలో లేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థ చేతిలో ఉంది. వెంటనే ఆ దిశగా ప్రయత్నాలు చేయకుండా వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డిను తప్పు పట్టడానికే అయితే చంద్రబాబు సోమవారం.. పోలవరం కార్యక్రమం చేపట్టినా ప్రయోజనం ఉండదు.

వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డిను రాజకీయంగా విమర్శిస్తే విమర్శించండి. తద్వారా రాజకీయ లబ్ది పొందడానికి యత్నిస్తే యత్నించండి. ప్రాజెక్టు విషయంలో ఎవరు ఎలా ప్రవర్తించారు. ఎవరు ఏ మేరకు కృషి చేశారు? ఎవరు ద్రోహం చేశారు? ఎవరు మేలు చేశారు? అనే అంశాలు చరిత్రలో నిక్షిప్తమై ఉంటాయి. ప్రస్తుతం వాటి జోలికి వెళ్లడం ముఖ్యం కాదు. ప్రాజెక్టును పూర్తి చేసిన రోజున చంద్రబాబు కాలర్ ఎగురవేసుకుని ఏమి చెప్పినా వినవచ్చు. అలాకాకుండా కుంటి సాకులు చెబుతూ కాలక్షేపం చేస్తే మాత్రం రాష్ట్రానికి ద్రోహం చేసినట్లు అవుతుంది.

ప్రాజెక్టులో తొలిదశలో నీటిని నిల్వ ఉంచే విషయంలో కూడా వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వంపై అప్పట్లో చంద్రబాబు, టీడీపీ నేతలు విమర్శలు చేసేవారు. మరి ఇప్పుడు పూర్తి స్థాయిలో 194 టీఎమ్‌సీల నీటిని నిల్వ ఉంచాలంటే నిర్వాసితులకు ఇవ్వవలసిన పరిహారం సుమారు ముప్పైవేల కోట్లను కూడా కేంద్రం నుంచి ఎంత తొందరగా రాబట్టుకోగలిగితే అంత మంచిది. ఈ ప్రాజెక్టు ఆంధ్రుల దశాబ్దాల కల. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ఏపీలో చాలా వరకు నీటి సమస్య లేకుండా పోయే అవకాశం ఉంటుంది.

2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే ఈ ప్రాజెక్టు ఒక రూపానికి వచ్చింది. రాజశేఖరరెడ్డి కేంద్రం నుంచి అనుమతులు తేవడంలో చాలా కృషి చేశారు. అలాగే ప్రాజెక్టుకు అవసరమైన భూ సేకరణకు కూడా చొరవ తీసుకున్నారు. దురదృష్టవశాత్తు ఆయన అనూహ్య మరణంతో ఉమ్మడి ఏపీ గతి మారిపోయింది. ఆయన తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టుపై చూపవలసినంత శ్రద్ద చూపలేదు. కాంట్రాక్టర్ ఎంపికే పెద్ద వివాదంగా మారుతూ వచ్చింది. ఇంతలో రాష్ట్ర విభజన జరగడం, విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టును కేంద్రం చేపడుతుందని పేర్కొనడంతో మళ్లీ ఆశలు చివురించాయి.

వైఎస్ రాజశేఖరరెడ్డి పోలవరం పనులపై ఎంతో శ్రద్దపెట్టి అనుమతులు తేకపోతే, విభజన సమయంలో ఈ ప్రాజెక్టు చట్టంలోకి కూడా వచ్చేది కాదేమో! విభజన వల్ల నష్టపోయిన ఏపీకి ఈ ప్రాజెక్టు ఒక వరం అవుతుందని అంతా భావించారు. ఈ తరుణంలో 2014లో చంద్రబాబు ప్రభుత్వం వెంటనే ఈ ప్రాజెక్టుపై దృష్టి పెట్టకుండా పట్టిసీమ ప్రాజెక్టును తెరపైకి తెచ్యింది. తదుపరి కేంద్రం బదులు తామే నిర్మిస్తామని తీసుకోవడంతో అనేక కొత్త సమస్యలు వచ్చాయి.

తర్వాత వచ్చిన వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం కొన్ని పనులు పూర్తి చేసినప్పటికీ, కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లేకపోవడం, వరదలు, కరోనా వంటి సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. ఇంతలో డయాఫ్రం వాల్ కొట్టుకుపోయింది. దాంతో ప్రాజెక్టు ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. కేంద్రంలో టీడీపీపై ఆధారపడిన ప్రభుత్వం వచ్చింది కనుక బీజేపీపై ఒత్తిడి పెంచి సకాలంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే ఏపీకి మేలు జరుగుతుంది. మరి ఆ విధంగా చంద్రబాబు చేయగలుగుతారా? లేక జగన్‌మోహన్‌ రెడ్డిను నిందించడానికే ప్రాధాన్యత ఇస్తారా?


– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement