
ఎవరైనా బలవంతంగా ఇంట్లోకి చొరబడితే ఏం చేస్తాం?. ముందుగా అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. ఆ తరువాత పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. మరి పోలీసులే వ్యక్తుల ఇళ్లల్లోకి బలవంతంగా చొరబడితే? చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తే? ప్రజల స్వేచ్ఛను కాపాడాల్సిన ప్రభుత్వమే వాటిని హరిస్తూ అరాచకాలకు పాల్పడితే? ఏపీలో ప్రస్తుత పరిస్థితి ఇదే.
ఏపీ ప్రభుత్వం మిగిలిన పనులన్నీ పక్కనబెట్టి మరీ పోలీసులతో తప్పుడు కేసులు పెట్టిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను వేధిస్తూ చివరికి ప్రజల పక్షాన వార్తలు రాస్తున్న మీడియా గొంతు నొక్కేందుకూ ప్రయత్నిస్తోంది. సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి నివాసంపై పోలీసుల దాడిని కూడా ఈ కోణంలోనే చూడాలి. టీడీపీ, అధికారంలోకి వచ్చినప్పటి జనసేన, బీజేపీ కూటమి దుశ్చర్యలకు అంతు లేకుండా పోతోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎప్పుడూ మీడియాపై ఒక కన్నేసే ఉంచుతారు. బాకా మీడియాను ఒకరకంగా, వైఫల్యాలను, ప్రభుత్వ స్కామ్‌లను బయటపెట్టే మీడియాను మరో రకంగా చూస్తారు. మాట వినని జర్నలిస్టులను ఉద్యోగాల నుంచి తొలగించేలా యాజమాన్యాలపై ఒత్తిడి తీసుకు వస్తారు కూడా. అనుకూలంగా ఉండే మీడియాకు రకరకాల రూపాలలో మేళ్లు చేస్తారు. తద్వారా ఆ యాజమాన్యాలను తన గుప్పెట్లో ఉంచుకుంటారు.
1995లో తన మామ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక వర్గం మీడియా ద్వారా ఆయనపైనే వ్యతిరేక ప్రచారం అనండి.. దుష్ప్రచారం చేయించిన చరిత్ర చంద్రబాబుది అని అప్పటి నుంచి రాజకీయాలు చూస్తున్నవారు చెబుతుంటారు. ఎన్టీఆర్ కేబినెట్‌లో మంత్రిగా ఉంటూనే ఆయన తెలివిగా ఎన్టీఆర్ ప్రతిష్టను తగ్గించే వ్యూహాలు అమలు చేశారని ఆరోపణలున్నాయి. ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతిని బూచిగా చూపెట్టేందుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి పత్రికలను బాగా వాడుకోగలిగేవారు. ఈనాడు చూడడానికే అసహ్యంగా ఉండే ఘోరమైన కార్టూన్లు ఎన్టీఆర్‌పై వేసేది. అయినా ఆ రోజుల్లో ఈ పత్రికలపై ఎన్టీఆర్ కేసులు పెట్టలేదు.
మామను కూలదోసి ముఖ్యమంత్రి అయిన తరువాత చంద్రబాబు పాలన మాటెలా ఉన్నా అనుకూల మీడియా వ్యవస్థనైతే బాగానే ఏర్పాటు చేసుకున్నారు. మీటింగ్‌లు జరిగినా, జరగకపోయినా, కల్పిత కథనాలకు కొదవ ఉండేది కాదు. అదే టైమ్‌లో రాజకీయ ప్రత్యర్థులపై బురద చల్లే వ్యూహాలు పక్కాగా అమలయ్యేవి. ఆ రోజుల్లో కూడా ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాసే కొన్ని పత్రికలకు ప్రభుత్వ ప్రచార ప్రకటనలు నిలిపివేసే వారు. కానీ ఇప్పటిలా బరితెగించి మరీ కేసులు పెట్టేవారు కాదనే చెప్పాలి. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడం చంద్రబాబుకు కొత్తకాదు. అయితే, ఆ హామీలను అమలు చేయకపోయినా ఎవరూ వాటిని గుర్తు చేయకూడదు! అందుకోసం ఆయన నానా ప్రయత్నాలూ చేస్తుంటారు.
2014లో రైతుల సంపూర్ణ రుణమాఫీ కావచ్చు.. కాపుల రిజర్వేషన్ ఉద్యమం కావచ్చు.. మరేదైనా కావచ్చు. చంద్రబాబు పంథా ఒక్కటే. తనకు వ్యతిరేకంగా ఏదైనా జరుగుతుంటే అనుకూల మీడియా చేత వాటిని అణచివేసే ప్రయత్నం చేయడం. అంశం ఏదైనా.. టీవీ ఛానళ్లలో అనుకూల ప్రచారమే సాగాలన్నది ఆయన ఆకాంక్ష. కాపుల రిజర్వేషన్ విషయమే తీసుకుందాం.. ఇచ్చిన హామీ అమలుకు ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేపడితే ఆ విషయం ప్రజలలోకి వెళ్లనీయకుండా కొన్ని టీవీ చానళ్లను బ్లాక్ చేయడానికి యత్నించారు. ఇదే చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటే మాత్రం అధికార పార్టీపై వ్యతిరేక వార్తలు రాయాలని జర్నలిస్టులకు నూరి పోస్తుంటారు. దానికి తగినట్లే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి తమ రాజకీయ, వ్యాపార ప్రయోజనాల కోసం ఉన్నవి, లేనివి కల్పించి వార్తలు ఇచ్చేవి. ఈ మీడియా 2019-2024 మధ్యలో ముఖ్యమంత్రి జగన్‌పై కక్కినంత విషం బహుశా ప్రపంచంలోనే మరే మీడియా కక్కి ఉండదు. ఇందుకోసం పచ్చి అబద్ధాలు రాసేందుకూ వెనుకాడలేదు ఈ సంస్థలు.
టీడీపీ మీడియా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్‌ను కించపరిచేలా కథనాలు ఇచ్చినా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ తదితరులు దారుణమైన వ్యాఖ్యలు చేసినా అప్పట్లో ఎవరిపై కేసులు పెట్టలేదు. కానీ 2024లో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చంద్రబాబు.. సాక్షి మీడియా అణచివేతకు యత్నిస్తూనే ఉన్నారు. పలువురు విలేకరులపై పోలీసు కేసులు నమోదవడం ఇందుకు నిదర్శనం. నెల్లూరు జిల్లా కావలి వద్ద ఎప్పుడో మూడేళ్ల క్రితం శిలాఫలకం పడవేశారంటూ అప్పటి ఎమ్మెల్యేతోపాటు విలేకరిపై కూడా కేసు పెట్టారట. అప్పుడు ఏం చేశారో కాని, కూటమి అధికారంలోకి వచ్చాక, టీడీపీ, జనసేన వారు లెక్కలేనని శిలా ఫలకాలను ధ్వంసం చేసినా ఒక్క కేసు నమోదు కాలేదు. మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఎవరెవరో ఫిర్యాదు చేయడం పోలీసులు హుటాహుటిన వైఎస్సార్‌సీపీ వారిని అరెస్టు చేయడం సాధారణమై పోతోంది.
ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి లోకేశ్ ‘రెడ్ బుక్’పేరుతో కక్ష రాజకీయాలు చేస్తున్నారు. ఎందుకు ఇవన్నీ?. చాలా సింపుల్ ప్రభుత్వ తప్పులు ఎవరూ ఎత్తి చూపకూడదు. సూపర్ సిక్స్ తో సహా ఎన్నికల సమయంలో ఇచ్చిన 150 హామీలు ఎందుకు అమలు చేయడం లేదని ఎవరూ ప్రశ్నించకూడదు. గత ప్రభుత్వం చేసిన అప్పులపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదితరుల అసత్యపు ప్రచారాన్ని ఎవరూ గుర్తు చేయకూడదు. ఏడాది తిరగకుండానే కూటమి ప్రభుత్వం చేసిన రూ.1.5 లక్షల కోట్ల అప్పులు ఎందుకు? దేనికి ఖర్చుపెట్టారు? అని ఎవరూ అడగకూడదు. ప్రభుత్వంలో జరుగుతున్న కుంభకోణాలను ఎవరూ వెలికి తీయకూడదు. సాక్షి మీడియా ఇవన్నీ చేస్తున్నందునే చంద్రబాబు ప్రభుత్వం కక్ష కట్టి దాడి చేస్తోంది.
నిజానికి సాక్షి మీడియా ప్రతీ వార్తనూ ఆధార సహితంగానే రాస్తుంది. సౌర శక్తి ఒప్పందాలనే తీసుకుందాం. జగన్ హయాంలో యూనిట్‌కు రూ.2.49లకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంస్థ సెకీతో ఒప్పందం చేసుకుంది. ఇందుకు గగ్గోలు పెట్టిన చంద్రబాబు, ఎల్లోమీడియా..లక్ష కోట్ల రూపాయల నష్టం జరిగిపోయిందని ప్రచారం చేశాయి. తీరా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిందేమిటి? అదే విద్యుత్తును రూ.4.60లకు కొనుగోలు చేస్తున్నారు. అంటే.. యూనిట్‌కు దాదాపు రెండు రూపాయలు ఎక్కువ పోసి కొంటున్నారన్నమాట. అయినా సరే.. దీనిపై ఈనాడు, ఆంధ్రజ్యోతుల్లో ఒక్క వార్త కూడా రాలేదు. సాక్షి మాత్రం పక్కా ఆధారాలతో జరిగిన అవినీతిని వివరించారు. సౌర శక్తి కొనుగోళ్ల విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో చంద్రబాబు ప్రభుత్వ ప్రతిష్ట మసకబారింది.
అలాగే.. విశాఖలో టీసీఎస్‌కు 99 పైసలకు ఎకరా భూమి ఇవ్వడం, ఊరు, పేరు లేని ఒక కంపెనీకి అరవై ఎకరాలు కట్టబెట్టడం, అమరావతి రాజధాని నిర్మాణాల పేరుతో అధిక రేట్లకు ఇష్టారాజ్యంగా టెండర్లు కేటాయించడం, అప్పుల కోసం ఏకంగా రాష్ట్ర ఖజానాను కూడా తాకట్టు పెట్టడం పెన్షన్లు మినహా మరే హామీ అమలు చేయకపోవడంతో ప్రజలలో అసంతృప్తి నెలకొనడం మొదలైన వార్తలను సాక్షి మీడియా ఇస్తోంది. ఏలికలకు ఇది పంటికింద రాయిలా మారింది. దీంతో సాక్షిని ఇబ్బంది పెట్టడానికి యత్నిస్తోంది. ఈ క్రమంలో ఆధారాలు లేని మద్యం స్కామ్‌ను సృష్టించి వైఎస్సార్‌సీపీ నేతల అరెస్టుకు చంద్రబాబు.. పోలీసులను ప్రయోగించారు. నిందితులు సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి ఇంటిలో ఉన్నారన్న అనుమానం వచ్చిందని పోలీసులు.. చెప్పా పెట్టకుండా విజయవాడలో ఆయన ఇంటిపై పడ్డారు. నిజంగా అలాంటి అనుమానం ఉంటే ఏమి చేయాలి? సెర్చ్ వారంటే ఇచ్చి సోదాలు చేయాలి. అసలు ఒక పత్రికా సంపాదకుడి ఇంటికి అంత ధైర్యంగా వెళ్లారంటే ఈ ప్రభుత్వం ఎంత నియంతృత్వంగా వ్యవహరిస్తున్నది అర్థం చేసుకోవచ్చు.
సాక్షి సిబ్బందిని మానసికంగా వేధించడానికి ఇలా చేసినట్లు తెలుసుకోవడం కష్టం కాదు. ఇంత మాత్రానికే సాక్షి మీడియా వణికిపోతుందా?. 2008 నుంచి సాక్షి మీడియా ఇలాంటి ఆటుపోట్లను ఎన్నింటినో ఎదుర్కొంది. ఈ మీడియాను దెబ్బతీయడానికి చంద్రబాబు కాంగ్రెస్‌తో కలిసి ఎన్ని కుట్రలు పన్నింది.. ఎన్ని కేసులు పెట్టించింది తెలియనిది కాదు. 2014 టర్మ్‌లో కూడా సాక్షిని లేకుండా చేయాలని ప్రయత్నించి విఫలం అయ్యారు. తిరిగి ఈ టర్మ్‌లో అంతకన్నా ఎక్కువగా కక్ష సాధింపు చర్యలకు తెగిస్తున్నారు. ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి వాటిని సమర్థంగానే ఎదుర్కొన్నారు. పోలీసులు మూడు గంటలపాటు అక్కడ ఉన్నా వారికి ఏమీ దొరకలేదు. దాంతో వారు సైలెంట్‌గా వెళ్లిపోక తప్పలేదు. సెర్చ్ వారంట్ లేకుండా వెళ్లడం ద్వారా పోలీసులు దుశ్చర్యకు పాల్పడినట్లు అయింది.
ఇక, ఎమర్జన్సీలో సైతం ఇందిరాగాంధీ ఇలాంటి పద్దతులు అనుసరించి మీడియా గొంతు నులమాలని విశ్వయత్నం చేశారు. కానీ, అంతిమంగా ఆమె ఘోర పరాజయాన్ని మూట కట్టుకున్నారు. తొలుత ఇందిరాగాంధీ శిష్యుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసి, ఆ తర్వాత తెలుగుదేశంను తన అధీనంలోకి తెచ్చుకుని రాజకీయం చేస్తున్న చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు అవే పద్దతులు అవలంభిస్తున్నారు. చరిత్ర చెప్పిన పాఠాలను మర్చిపోయి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఎవరికైనా ఓటమి తప్పదు.
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.