కహానీలు చెబితే కడుపు నిండుతుందా? | KSR Comment: Under Kutami Govt No Sankranti For AP Poor People | Sakshi
Sakshi News home page

కహానీలు చెబితే కడుపు నిండుతుందా?

Jan 14 2025 11:43 AM | Updated on Jan 14 2025 1:07 PM

KSR Comment: Under Kutami Govt No Sankranti For AP Poor People

ఆంధ్రప్రదేశ్‌లో ఎల్లోమీడియా తీరు భలే విచిత్రంగా ఉంటుంది. వారికి లాభం జరిగితే ప్రజలందరికీ జరిగినట్లే. వారి ఇబ్బందులు ప్రజలందరి సమస్యలు! ఇప్పుడెందుకు ఈ ప్రస్తావన అంటే.. ఆంధ్రప్రదేశ్‌లో ‍ప్రజలందరికీ సంక్రాంతి వరాలు వచ్చేశాయట!. అభివృద్ధి పనులతో గ్రామాలకు సంక్రాంతి కళ వచ్చేసిందట!. పచ్చి అబద్ధాలను వండి వార్చేఈ ఎల్లో మీడియా ఉరఫ్‌ ఈనాడులో వచ్చిన కథనాల్లో కొన్ని ఇవి. 

ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలన్నీ అమలు చేసి ఉంటే ప్రజలు సంతోషంగా ఉండేవాళ్లు కానీ.. తిమ్మిని బమ్మి చేసినట్లు ప్రతి వాగ్ధానాన్ని మసిపూసి మారేడు కాయ చేసేందుకు కూటమి నానా తంటాలూ పడుతూంటే ఎల్లోమీడియా ఆ అబద్ధాలకు వంతపాడుతూ మురిసిపోతోంది. ఎన్నికలకు ముందు ఒక రకమైన అసత్యాలు.. ఇప్పుడు ఇంకో రకంగా బిల్డప్‌ ఇస్తూ జనాన్ని మభ్యపెడుతోంది. 

😱కూటమి ప్రభుత్వం గద్దెనెక్కింది మొదలు.. రాష్ట్రంలో అరాచకమే ఎక్కువ. జగన్‌ టైమ్‌లో జరిగిన అభివృద్దిని కూడా తమ ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. వృద్దుల ఫించన్‌ వెయ్యి రూపాయలు పెంచడం మినహా మరే ఇతర హామీని పూర్తిగా అమలు చేయని కూటమి, ఎన్నికల ప్రణాళికలో ఉన్న సుమారు 175 వాగ్దానాల జోలికే వెళ్లలేదు. దీన్ని కప్పిపుచ్చడానికి ఎల్లో మీడియా రోజుకో కొత్త రకం భజన కీర్తలను పాడుతోంది. అయితే.. 

👉జనం వాస్తవాలు తెలుసుకుంటున్నారు. సూపర్ సిక్స్ పేరుతో కూటమి నేతలు చేసిన మోసాన్ని గుర్తిస్తున్నారు. ఈ మధ్య ఒక సీనియర్ పాత్రికేయుడు ఉభయ గోదావరి జిల్లాలలో పర్యటించినప్పుడు ప్రజల్లోని ఈ అసంతృప్తిని గమనించారు. జగన్ ఉండి ఉంటే ఫలానా స్కీమ్ కింద తమకు ఇంత డబ్బు వచ్చి ఉండేది.. చేతులలో డబ్బు ఆడేది.. అని చెప్పుకుంటున్నారట. కానీ అంతకు మూడు రెట్లు సాయం చేస్తామని చెప్పి చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు తమను వంచించారని ఎక్కువ మంది భావిస్తున్నారట!.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన ఏ స్కీమ్ కూడా ఇప్పుడు ప్రజలకు అందడం లేదు. ‘అమ్మ ఒడి’ని మార్చి ప్రతి బిడ్డకు రూ.15 చొప్పున ఇస్తామన్న కూటమి నేతలు, కావాలంటే ఇంకా పిల్లలను కనండని బంపర్ ఆఫర్ ప్రకటించిన చంద్రబాబు అధికారం చేపట్టిన తరువాత తూచ్‌ అనేశారు. జాకీ మీడియా కూడా ‘అమ్మ ఒడి’ అంటే బటన నొక్కడమని ధనం వృధా చేయడమేనని ఊదరగొట్టింది. కానీ ఇప్పుడు ఏమి జరుగుతోందో చూడండి. 👇

  • ఈ ఏడాదికి తల్లికి వందనం లేదు పొమ్మన్నారు

  • రైతు భరోసా జాడ కనిపించడం లేదు. 

  • విద్యా దీవెన, వసతి దీవెన ఏమయ్యాయో తెలియదు. 

  • ఆరోగ్య శ్రీని నీరుకార్చే పనిలో ఉన్నారు. 

  • జగన్ ఇంటింటికి డాక్టర్ ను పంపిచే స్కీమ్ తెస్తే, ఇప్పుడు అది గాలికి పోయినట్లు ఉంది. 

  • ప్రతి వ్యక్తికి ప్రభుత్వ సేవలందించేందుకు జగన్ తెచ్చిన వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని జీతాలూ పెంచుతామని చంద్రబాబు ఉగాది పండగనాడు దైవ సాక్షిగా ప్రకటించినా.. ఇప్పుడు దానికి మంగళం పలికారు. మరోవైపు.. 

ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. వంట నూనెల ధరలే లీటర్‌కు రూ.30 నుంచి రూ.40 వరకూ పెరిగాయి. పప్పులు, కూరగాయల ధరలన్ని అందుబాటులో లేకుండా పోయాయి. వీటన్నిటి ఫలితంగా సంక్రాంతి వచ్చినా ప్రజలు చేతిలో డబ్బులు ఆడక ఇబ్బంది పడుతున్నారు.  వ్యాపారాలు కూడా తగ్గాయి. ఇందుకు ఉదాహరణ ఏమిటంటే.. 

లెక్కలు ఇలా.. 👇
ఒక్క కృష్ణా జిల్లాలోనే  వైఎస్ జగన్ పాలనలో 2023 లో పండగల సీజన్ అయిన అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లలో  వస్త్ర వ్యాపారం రూ.3000 కోట్ల మేర జరిగితే కూటమి పాలన వచ్చిన 2024లో అదే కాలానికి కేవలం రూ.1200 కోట్లుగానే ఉంది. కిరాణా వ్యాపారం పరిస్థితి అలాగే ఉంది. గతంతో పోల్చితే ఈసారి  లావాదేవీలు రూ. వెయ్యి కోట్ల తగ్గాయి. బంగారం వ్యాపారం రెండు నెలల టైమ్‌కు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు  రూ.3000 కోట్ల టర్నోవర్ జరిగితే, కూటమి పాలనలో  అది రూ.1500 కోట్లుగా ఉంది. ఫర్నిచర్ కొనుగోళ్లు కూడా సగానికి సగం పడిపోయాయి. అప్పట్లో రూ.800 కోట్లు ఉంటే, ఈ సారి రూ.400 కోట్లే ఉంది. వీటి ఫలితంగా జీఎస్టీ రూపంలో రాష్ట్రానికి వచ్చే ఆదాయమూ తగ్గింది. ఏపీలో జీఎస్టీ వసూళ్లు బీహారు కన్నా తక్కువ కావడం పరిస్థితిని తెలియచేస్తుంది. జగన్ టైమ్ లో 12 శాతం జీఎస్టీ వసూళ్లతో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే అగ్ర భాగాన ఉంటే, ఈ సారి ‘- 6’ శాతం మాత్రమేనని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 

👉ఈ లెక్కలు  ఇలా ఉన్నా, ఎల్లో మీడియా మాత్రం సంక్రాంతికి ప్రజలంతా ఆనందంతో కేరింతలు కొడుతున్నట్లుగా బిల్డప్ ఇస్తోంది. అవును.. నిజమే.. మార్గదర్శికి సంబంధించిన కేసులలో గత ప్రభుత్వం జప్తు చేసిన రూ.వెయ్యి కోట్లను ఈ ప్రభుత్వం రాగానే తీసి వేసింది కదా!.. అందువల్ల ఈనాడు వారికే పండగే కావచ్చు. సామాన్యుడికి వస్తే ఎంత? రాకపోతే ఎంత? సంక్రాంతి వరాలు రూ.6700 కోట్లు అంటూ పెద్ద బ్యానర్ కథనాన్ని ఇచ్చింది. గతంలో జగన్ ఒక్క స్కీమ్ కింద ఈ స్థాయిలో ప్రజలకు డబ్బు ఇచ్చేవారు. కాని చంద్రబాబు ప్రభుత్వం ఈ ఏడు నెలల్లో రూ.70 వేల కోట్లకు పైగా అప్పులు చేసినా, ఆ డబ్బు అంతా ఏమైందో కాని స్కీమ్ లు అమలు చేయలేదు. 

🤔నిజంగానే చెప్పిన హామీలు చెప్పినట్లు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ అమలు చేసి ఉంటే సుమారు రూ.40 వేల కోట్లకు పైగా ప్రభుత్వం ఇచ్చి ఉండాలి. కానీ అందులో ఆరోవంతు నిధులు కూడా ఇవ్వలేదు. ఉద్యోగులకు, వివిధ వర్గాలకు ఇవ్వాల్సిన మొత్తాలలో కొద్ది, కొద్దిగా ఇచ్చి పండగ చేసుకోమంటోంది. ఉద్యోగులకు రూ.25 వేల కోట్ల బకాయిలు ఉంటే రూ.1300 కోట్లు ఇచ్చారు. ఇది ఏ మూలకు వస్తాయని ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. అలాగే  ఫీజ్ రీయింబర్స్‌మెంట్ స్కీమ్‌, ఆరోగ్యశ్రీ బకాయిలు కూడా  అర కొరగానే ఇచ్చారని చెబుతున్నారు. ఉద్యోగులకు కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటెరిమ్ రిలీఫ్ ప్రకటిస్తామని అన్నా, దాని గురించి మాట్లాడడం లేదు. ఆర్థికంగా సమస్యలు  ఉన్నాయని వాస్తవ పరిస్థితి చెప్పడం వేరు. మొత్తం హామీలు అమలు చేసినట్లు బిల్డప్ ఇచ్చి ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ప్రచారం చేసుకోవడం వేరు అన్న సంగతి గుర్తుంచుకోవాలి. 

😥గతంలో ధరలు కొద్దిగా పెరిగినా, విద్యుత్ చార్జీల సర్దుబాటు జరిగినా ఇదే చంద్రబాబు ,పవన్ ఏ స్థాయిలో విమర్శలు చేసేవారు! ఈనాడు,ఆంధ్రజ్యోతి వంటివి ఎంత దారుణమైన కథనాలు రాసేవి. మరి ఇప్పుడు రూ.15 వేల కోట్ల విద్యుత్ భారం మోపినా, రెండున్నర  లక్షల మంది వలంటీర్ల నోటికాడి కూడు తీసేసినా, తల్లులకు ప్రతి ఏటా వచ్చే రూ.15 వేలు ఎగ్గొట్టినా మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని మోసం చేసినా, నిరుద్యోగులకు రూ.3,000 ఖాయమని చెప్పి ఊరించి తూచ్ అంటున్నా, వారంతా సంతోషంగా ఉన్నారని భ్రమ పడాలన్నది ఎల్లో మీడియా లక్ష్యంగా ఉందనుకోవాలి. అభివృద్ధి పనులతో గ్రామాలకు సంక్రాంతి కళ వచ్చేసిందని ఈనాడు బోగస్ వార్తలు ఇస్తోంది. ప్రజల చేతిలో డబ్బు ఉంటే సంక్రాంతి పండగ బాగా చేసుకుంటారు కాని, కహానీలు చెబితే కడుపు నిండుతుందా?. కాకపోతే  క్యాసినోలు, జూదాలు, కోడి పందేలు ఆడించి, ఎక్కడబడితే అక్కడ మద్యం అమ్మించి ఇదే సంక్రాంతి అనుకోండని అంటున్నారు. పేదలు వీటితో సరిపెట్టుకోవలసిందేనా!..



:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement