నాడు ‘హూ ఈజ్ మోడీ?’.. నేడు ప్రశంసల వ్యాసం! | KSR on Chandrababu Comments Over PM Modi | Sakshi
Sakshi News home page

నాడు ‘హూ ఈజ్ మోడీ?’.. నేడు ప్రశంసల వ్యాసం!

Oct 13 2026 10:05 AM | Updated on Oct 13 2026 10:13 AM

KSR on Chandrababu Comments Over PM Modi

బహుశా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన జీవితంలో ఇలా ఒకరిని పొగుడుతూ వ్యాసం రాయవలసి వస్తుందని ఊహించుకుని ఉండరు. కాని కాలమాన పరిస్థితులు ఎలా మారతాయో చెప్పడానికి ఇది  ఉదాహరణే అవుతుంది.  దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై ఆయన రాసిన ఒక వ్యాసం ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ది హిందూలో ప్రచురితమైంది. ముఖ్యమంత్రిగా, ప్రధానిగా మోడీ ఇరవైఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా  ఈ వ్యాసాన్ని ఆయన రాశారు. ఒకప్పుడు ఎంత గొప్పగా మోడీని విమర్శించారో, లేదా దూషించారో ఇప్పుడు అంతకన్నా గొప్పగా పొగడడమే ఇందులో ఉన్న గొప్పతనం అని చెప్పాలి. 

చంద్రబాబు ఇంతగా తగ్గి వ్యాసాలు రాయవలసిన  పరిస్థితి ఎందుకు ఏర్పడిందన్న దానిపై రకరకాల విశ్లేషణలు సోషల్ మీడియాలో వచ్చాయి. చంద్రబాబు గతంలో పలుమార్లు చెప్పినట్లు మోడీకన్నా సీనియర్ అన్నది వాస్తవం!అదే విషయాన్ని పరోక్షంగా ఈ వ్యాసంలో ప్రస్తావించారు.తన నలభై ఎనిమిది సంవత్సరాల ప్రజా జీవితంలోపలు రాజకీయ పార్టీల ఉత్ధానపతనాలు చూశానని, గొప్ప ఆశలు  కల్పిస్తూ   ప్రజల ముందుకు  వచ్చిన నేతలు కనుమరుగు అవడం చూశానని, ప్రభుత్వాల మార్పు, ఆర్ధిక వ్యవస్థలో మార్పులు, అందరి జీవితాలను ప్రభావితం చేసిన టెక్నాలజీ వంటివి చూశానని, ఇవన్ని తెలిపిన పాఠం ఏమిటంటే, అన్నిటికి మించి నాయకత్వం ప్రధానమని స్పష్టత వచ్చిందని చంద్రబాబు ఉపోద్ఘాతంలో పేర్కొన్నారు. 

ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం, విజ్ఞానం, పెట్టుబడి ,ఐడియాలు బాగానే అందుబాటులోకి వచ్చాయని, కాని ప్రధానమైన తేడా ఏమిటంటే జాతికి ఒక విజన్, సమగ్రత, విశ్వసనీయత ,అనుకున్నట్లుగా అమలు చేయగలిగే సమర్ధతతో  నాయకత్వం వహించడం కీలకం అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆ రకమైన  నాయకత్వానికి దేశానికి మోడీ అందించారని అని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రపంచం అంతా యుద్దాలు, తదితర సంక్షోభాలలో ఉన్నప్పుడు భారత్ స్థిరంగా నిలిచి అభివృద్ది పధంలో సాగుతోందని ఆయన మెచ్చుకున్నారు.దేశంలో రోడ్లు, విమానాశ్రయాల అభివృద్ది, రైల్వే విద్యుద్దీకరణ తదితర రంగాలలో దేశం ప్రగతి సాధించిందని, 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చారని చంద్రబాబు అన్నారు. 

మామూలుగా అయితే  ఈ వ్యాసాన్ని ఆక్షేపించనక్కర్లేదు. పాతికేళ్ల ప్రస్తానం సందర్భం కనుక రాయవచ్చు.కాని చంద్రబాబు ఎప్పుడూ లేనట్లు ,మరీ ఇంత శ్రద్ద తీసుకుని ఈ వ్యాసం  రాశారంటే ఇందులో ఆంతర్యం ఏమిటన్నది ప్రశ్న. వైఎస్సార్‌సీపీ అదినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా మోడీని అభినందిస్తూ ఒక ట్వీట్ చేశారు. కాని చంద్రబాబు మాత్రం ఏకంగా వ్యాసం రాయడం, మంత్రివర్గ సమావేశంలో మోడీని కీర్తిస్తూ తీర్మానం చేయడం, తదుపరి ఢిల్లీ వెళ్లి ఆయనను కలిసి మీ ప్రస్థానం స్పూర్తిదాయకం అని ప్రశంసిచడం చేశారు. చంద్రబాబుకు ఇందులో ఎంత చిత్తశుద్ది ఉందన్నది కొంతమంది విశ్లేషకుల ప్రశ్న. నిజంగా మోడీ అంత గొప్పవారని నమ్మి ఇలా పొగుడుతున్నారా?లేక తన రాజకీయ అవసరాల కోసం మాట్లాడుతున్నారా అన్నది వారి సందేహం. దీనికి చంద్రబాబే జవాబు చెప్పాలి. 

ఎందుకంటే మోడీ రాజకీయ జీవితం ఆరంభం అయిన తర్వాత తొలి సంక్షోభం ఎదుర్కున్నప్పుడు చంద్రబాబు వైఖరిని  ఆయన ఎప్పటికి మర్చిపోకపోవచ్చు. గుజరాత్‌లో మత కలహాలు జరిగిన నేపధ్యంలో మోడీని సీఎం పదవిలో కొనసాగించాలా?లేదా?అన్న చర్చ బీజేపీలో వచ్చింది. ఆనాటి ప్రధాని వాజ్  పేయి  రాజధర్మ ముఖ్యమంటూ  మోడీని పదవి నుంచి తప్పించాలని అనుకున్నారు. ఆ సమాచారం అందుకున్న చంద్రబాబు వెంటనే మోడీ రాజీనామాకు డిమాండ్ చేశారు.  హైదరాబాద్ రానివ్వబోమని కూడా హెచ్చరించారు.టీడీపీకి బీజేపీతో పొత్తు  ఉన్నప్పటికీ ఆయన  ఈ డిమాండ్ చేయడం దేశంలో కలకలం అయింది. కాని బీజేపీలో ఉప ప్రధాని ఎల్.కె.అద్వాని మాట చెల్లి, మోడీ పదవిలో కొనసాగించడానికి బీజేపీ కార్యవర్గం అంగీకరించింది.దాంతో తన పరువుకు భంగం వాటిల్లిందని భావించిన చంద్రబాబు లోక్ సభలో విపక్షం పెట్టిన తీర్మానంపై వ్యతిరేకంగా ఓటు వేస్తారని అనుకున్నారు. కాని బీజేపీ రాయబారంతో అలా చేయకుండా జారుకున్నారు. 2004 ఎన్నికలలో ఓటమి తర్వాత బీజేపీని జీవితంలో సమర్ధించబోనని ఆయన ప్రకటించారు. 

కాని 2014 నాటికి దేశంలో ట్రెండ్ మోడీకి అనుకూలంగా ఉందని భావించడమే కాకుండా, ఒంటరిగా పోటీచేస్తే ఏపీలో వైఎస్ జగన్ స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ను ఓడించలేమని గమనించి చంద్రబాబు వెంటనే  ప్లేట్ ఫిరాయించారు. మెల్లగా మోడీకి దగ్గరవడానికి పలు వ్యూహాలు అనుసరించారు. ఎలాగైతేనేం..సఫలం అయ్యారు.ఆ తర్వాత కొంతకాలం సాఫిగానే సాగించారు.2018 నాటికి మళ్లీ నాటికి బీజేపీ గెలవదేమోనన్న  అనుమానం వచ్చింది.దాంతో ఆయన  బీజేపీని వీడి తిరిగి కాంగ్రెస్ వైపు మళ్లారు.అలా వెళితే వెళ్లవచ్చు. కాని ఈ టైమ్ లోనే చంద్రబాబు తీవ్రమైన భాష వాడి మోడీని విమర్శించేవారు.వాటిలో కొన్ని  దూషణలుగా అనిపించేవి. చివరికి ఉగ్రవాదులతో కూడా పోల్చడానికి వెనుకాడలేదు. అవినీతి ఆరోపణలు చేశారు.వ్యక్తిగత జీవితంపై కూడా వ్యాఖ్యలు చేశారు. ఒక ఇంటర్వ్యూలో హూ ఈజ్ మోడీ అని ప్రశ్నించారు.

మోడీ సైతం చంద్రబాబును అవినీతి పరుడని ధ్వజమెత్తేవారు.2019లో బీజేపీ మళ్లీ కేంద్రంలో అదికారంలోకి రావడం, టీడీపీ ఏపీలో ఓడిపోవడంతో చంద్రబాబు తెలివిగా రూట్  మార్చేశారు.  కేంద్రంలోని బీజేపీవారితో ఎలా సంబంధాలు పెట్టుకున్నారో కాని తన పిఎస్ పై ఆదాయపన్ను  శాఖ దాడులు జరిపి  పలు అభియోగాలు చేసినా, ఆ కేసు  తనవరకు రాకుండా చేసుకున్నారు. 2024 నాటికి మళ్లీ మోడీ, అమిత్ షా లను  ప్రసన్నం చేసుకుని తిరిగి బీజేపీతో జతకలిశారు. కాని అప్పటి నుంచి గతంలో మాదిరి స్వతంత్రంగా వ్యవహరించలేకపోతున్నారేమో అనిపిస్తుంది. చంద్రబాబుకు ఒక అలవాటు ఉంది. ఏది చెప్పినా తన జీవితంలో..అంటూ వ్యాఖ్యలు చేస్తుంటారు. మోడీని విమర్శించాలనుకున్నా,తన జీవితంలో ఇంత అధ్వాన్నపు నేతను చూడలేదని అంటారు. పొగడాలనుకున్నా ఇంత గొప్ప నాయకత్వం చూడలేదని అంటారు. అన్నీ గుజరాత్ కే తీసుకువెళుతున్నారని,ఏపీకి ఏ సాయం చేయడం లేదని, అమరావతికి మట్టి ,నీళ్లు ఇచ్చారని అనగలరు.  ఇప్పుడేమో రాష్ట్రాలతో కోఆపరేటివ్ పెడరలిజం అనుసరిస్తున్నారని ప్రశంసించగలరు. 

మోడీ నేతృత్వంలో దేశం నాశనం అయిందని చెప్పగలరు. ఇప్పుడు దేశం అభివృద్ది పధంలో పరుగులు తీస్తోందని చెప్పగలరు. మోడీ కన్నా డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ గొప్పవాడని, మోడీ కన్నా టీడీపీ సామాన్య కార్యకర్త కూడా గొప్పవాడని అనగలరు. ఇప్పుడేమో ఈ పాతికేళ్ల మోడీ ప్రస్థానంలో దేశానికి గొప్ప నాయకత్వం అందిందని, ఇది దేశ గతినే మార్చుతోందని అనగలరు. దేనికైనా చంద్రబాబు సమర్ధులే. బహుశా ఎప్పటికేది ప్రస్తుతమో దానిని పట్టుకోవడమే చంద్రబాబు విజయ రహస్యమేమో అనిపిస్తుంది. ఈ క్రమంలో ఎంత అప్రతిష్ట వచ్చినా ఆయన పట్టించుకోకపోవడం నేర్పరితనం అని చెప్పాలి. తనకు రాజకీయ ప్రయోజనం కలిగిందా?లేదా?అన్నదే ముఖ్యమని ఆయన  భావిస్తారని పలు  అనుభవాలు చెబుతున్నాయి. కొంతకాలం క్రితం మోడీ జన్మదినం నాడు వారణాసి వెళ్లి పూజలు చేయడం అందరిని ఆశ్చర్యపరచింది. ఒకప్పుడు టీడీపీ ఆత్మగౌరం కోసం పుట్టిన పార్టీగా ప్రచారం చేసుకుంది. తాను ఆత్మ విశ్వాసం ఇచ్చానని చంద్రబాబు  చెప్పుకునేవారు. 

ఆ ఆత్మగౌరవం,ఆ ఆత్మ విశ్వాసం ఏమైందో కాని ప్రస్తుతం, వాటిని  పక్కనబెట్టి బీజేపీ అధిష్టానాన్ని  మెప్పించడానికి నానాపాట్లు పడుతున్నట్లు అనిపిస్తుంది. ఇందులో రాజకీయ కారణాలు ఉండవచ్చు. బీజేపీ తనను నమ్మడం లేదన్న అనుమానం ఉండవచ్చు. వైఎస్ జగన్‌ను ఏదో రకంగా ఇబ్బంది పెట్టడానికి చంద్రబాబు గట్టిగా యత్నిస్తున్నారు.దానికి సహకరించాలని ఆయన కోరుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.అలాగే లోకేష్ నాయకత్వాన్ని ప్రమోట్ చేయడానికి కూడా ఈ పరిస్థితిని వాడుకుంటుండవచ్చు.  మోడీ కన్నా  చంద్రబాబు రాజకీయంగా  సుమారు 23 ఏళ్ల  సీనియర్ . లోపల ఆ పాయింట్ తొలుస్తున్నా,పైకి మాత్రం మోడీ గురించి ఇంత ఘనంగా వ్యాసం రాయవలసి అవసరం ఎందుకు వచ్చిందో ఆయనకే తెలియాలి.


- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement