ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్లబొల్లి కబుర్లు ,కధలు చెప్పడంలో మహా నేర్పరితనం ప్రదర్శిస్తున్నట్లు అనిపిస్తుంది. రాయలసీమలో లక్ష కోట్ల రూపాయల వ్యయంతో ఉద్యాన హబ్‌ను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పనిలో పనిగా తనకు తానే తగిలించుకున్న వాటర్ మాన్ బిరుదును కూడా గుర్తు చేసుకుని రాయలసీమలో ప్రాజెక్టుల ఘనత తనదేనని కూడా తెలిపారు. మదనపల్లెలో జరిగిన కార్యక్రమంలో హబ్‌కు శ్రీకారం చుట్టారు. అక్కడే ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ స్థాపనకు నాంది పలికారు. ఈ స్కూల్ ఏర్పాటు చేయడం వరకు ఓకే. దానివల్ల రైతులకు ఉపయోగం జరిగితే మంచిదే. కాకపోతే దీనిపై సందేహాలు రావచ్చు. రిలయన్స్ కంపెనీ నెలకొల్పితే,సామాన్యులకు అందుబాటులో ఎంతవరకు ఉంటుందన్నది చెప్పలేం.
ఉదాహరణకు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో చదవాలంటే సుమారు ఏభై లక్షల వరకు ఫీజలు ఉంటాయట. గత రెండు దశాబ్దాలలో ఈ స్కూల్ వల్ల తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేకంగా ఒనగూరిన ప్రయోజనం ఏమిటో తెలియదు. అయినా ఒక సంస్థ ఏర్పడితే దానిని ఆక్షేపించనవసరం లేదు. ఇక రాయలసీమ హబ్ గురించి విశ్లేషించుకుందాం. ఎల్లో మీడియాలో వచ్చిన ఒక కధనం ప్రకారం ప్రస్తుతం 20.77 లక్షల ఎకరాలలో రాయలసీమలో పండ్ల తోటలు ఉన్నాయి. కొత్తగా ఈ హబ్ ద్వారా మరో తొమ్మిది లక్షల ఎకరాలకు విస్తరిస్తారట. అంటే ఏమిటి దీని అర్దం ఇప్పటికే 21 లక్షల ఎకరాలలో తోటలు ఉంటే హబ్ గా అభివృద్ది చెందినట్లే కదా! 9 లక్షల ఎకరాలలో విస్తరిస్తే కొత్తగా హబ్ అవడం ఏమిటి?దీనితో రాయలసీమ భవిష్యత్తు మారిపోవడం ఏమిటి? దీనిపై వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత రెడ్డి ఒక వ్యాఖ్య చేస్తూ లక్ష కోట్ల హబ్ కాదు..లక్ష అబద్దాలతో పాలని అని ఎద్దేవ చేశారు.
వ్యవసాయాన్ని గబ్బు పట్టించి హబ్బులంటూ ప్రచారమా అని చంద్రబాబు ప్రభుత్వవంపై మాజీ మంత్రి కన్నబాబు ధ్వజమెత్తారు.ఈ ప్రోగ్రాంకు సంబంధించి వచ్చిన వార్తలను పరిశీలిస్తే ఫ్రూట్ బౌల్ ఆఫ్ వరల్డ్ గా రాయలసీమ అంటూ ఆకర్షణీయమైన డైలాగులతో అబద్దాల హబ్ గా మార్చారా అన్న అభిప్రాయం కలగవచ్చు. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎపిలో ఉద్యానవన రైతులతో సహా వివిధ ఇతర పంటలు వేసే కర్షకులంతా నానా పాట్లు పడుతున్నారు.ఉదాహరణకు చిత్తూరు జిల్లాలోనే మామిడి రైతులు పడ్డ పాట్లు ఇన్నీ అన్నీ కావు.పండించిన మామిడికి గిట్టుబాటు ధర రాకపోవడంతో రోడ్డు మీద కాయలను పారేసిన ఘట్టాలు కనిపించాయి.
మరో వైపు ఈ ఏడాది వర్షాలు లేక తోటలు ఎండిపోతున్నాయి.వాటిని రక్షించుకోవడం కోసం టాంకర్ల ద్వారా నీటిని తోలుకోవడానికి రైతులు అదనంగా ఖర్చు పెట్టవలసి వస్తోంది. ఎల్లో మీడియా వీటన్నిటిని కప్పిపుచ్చుతూ రాయలసీమ కు శుభకరం, ఫలప్రదం అంటూ శీర్షికలు పెట్టి హబ్ అంటూ పాఠకులను మాయ చేయడానికి తంటాలు పడుతోంది.తన ప్రార్ధనవల్లే విశాఖలో వర్షాలు పడ్డాయని చిత్రమైన వాదన ప్రచారం చేసుకున్న చంద్రబాబు రాయలసీమలో వానల కోసం ఎందుకు ప్రార్ధనలు చేయలేదో తెలియదు. ఒకవేళ చేసినా అది ఫలించలేదా అన్నది సామాన్య రైతుల ప్రశ్నగా ఉంది.చిత్రమేమిటంటే తాను వాటర్ మాన్ అనిపించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చంద్రబాబు చెప్పుకున్నారు.కాని ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పంలో సైతం తీవ్రమైన కరువు ఉందని ప్రభుత్వం అధికారిక జాబితాలో వెల్లడించింది. 1989 నుంచి ఆ నియోజకవర్గానికి ప్రాతినిద్యం వహిస్తున్న చంద్రబాబు అక్కడ కరువు జాడలు లేకుండా చేసి వాటర్ మాన్ అయ్యానని చెప్పుకుంటే ఒప్పుకోవచ్చు.
ప్రాజెక్టుల నిర్మాణంపై ఆయన చేసిన కృషి అంతంతమాత్రమే అయినా, మొత్తం క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవడానికి చంద్రబాబు వాటర్ మాన్ అని చెప్పుకుంటే జనం నమ్ముతారా! నిజంగానే ఈయనే వాటర్ మాన్ అయితే ,రాయలసీమలో అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి ఉద్యానవనాలతో పాటు, వివిధ పంటలకు నీళ్లందించిన వైఎస్ రాజశేఖరరెడ్డి, ఎన్టీ రామారావు ,నీలంసంజీవరెడ్డి వంటివారిని ఇంకెంత గొప్పగా పిలవాలి?జగన్ రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ తీసుకు వస్తే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కోరిక మేరకు దానిని నిలిపివేసిన చంద్రబాబు వాటర్ మాన్ ఎలా అవుతారో అర్ధం కాదు. ఒకపక్క సీమలో కుప్పంతో సహా అత్యధిక మండలాలు కరువుతో అల్లాడుతుంటే ఇలాంటి డైలాగుల వల్ల ప్రజలలో అపహాస్యం పాలవ్వరా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు.
లక్ష కోట్ల రూపాయల హబ్ లో కేంద్రం నలభై వేల కోట్లు ఇస్తుందట. ఆ మాట కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట మాత్రంగా కూడా ఎందుకు చెప్పలేదో అన్న మీమాంస ప్రజలలో ఏర్పడింది.అంటే ఇది ప్రచారం కోసమేనా అన్న సందేహం వస్తోందన్నమాట.మిగిలిన అరవైవేల కోట్ల రూపాయలు ప్రైవేటు సంస్థలు పెట్టుబడులు పెడతాయట. ఇది నమ్మశక్యంగా ఉందా? అందుకే కల్లబొల్లి కబుర్లు,కాకమ్మ కధలుగా పలువురు ఎద్దేవ చేస్తున్నారు.ప్రభుత్వం వెల్లడించినదాని ప్రకారం తొలి దశలో 2026-27 లో 12 వేల కోట్ల రూపాయలు వ్యయం చేస్తారట.ఈ ఆర్ధిక సంవత్సరం ఆరు నెలులు గడిచిపోయింది.మిగిలిన ఆరు నెలల్లో ఇంత భారీ మొత్తం వ్యయం చేస్తారంటే విశ్వసిస్తారా?2029 నాటికి మూడో దశ పూర్తి అవుతుందట.ఎల్లో మీడియాలో వచ్చిన వివరాలను చూస్తే ఈ మూడేళ్లలో నలభై వేల కోట్లు వ్యయం చేయవలసి ఉంటుంది.
అది కేంద్రం ఇస్తుందా?లేక రాష్ట్రం ఖర్చు చేస్తుందా? ప్రైవేటు సంస్థలు వ్యయం చేస్తాయా అన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు.ప్రైవేటు సంస్థలైతే ఏ ఏ కార్యక్రమాలు నిర్వహిస్తాయి.రైతులకు ఎలా ఉపయోగం కలుగుతుంది?అన్నదానిపై క్లారిటీ లేదు.రైతుల పొలాలను లీజుల పేరుతో తీసుకోవడానికి ఇందులో ఏమైనా ప్లాన్ ఉందేమో తెలియదు.రైతుల ఉత్పత్తుల మార్కెటింగ్,నాణ్యత పెంపు,విస్తరణ తదితర కార్యక్రమాలు ఇందులో ఉంటాయని చెబుతున్నారు. ప్రపంచ ఉద్యాన కేంద్రం అని, రాయలసీమ రైజింగ్ అంటూ ప్రచార ప్రకటనలు గుప్పించి ఈ సభ జరిపారు.రైతులకు జరిగే మేలు ఏమో కాని అడ్వర్టైజ్ మెంట్లకు భారీగానే ఖర్చు చేశారన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. ఎల్లో మీడియాలో అదరగొట్టే హెడింగ్ లు వచ్చాయి.
అద్భుత ప్రస్తానానికి నాంది అని, రాయలసీమ తలరాత మార్చే ఉద్యాన హబ్ అని చంద్రబాబు అన్నారు.త్వరలోనే ప్రపంచంలో ప్రతి మూలకు మన ఉద్యాన ఉత్పత్తులు అని ఆయన అంటున్నారు.నిజానికి ఇప్పటికే ఆయా ఉద్యాన ఉత్పత్తులు దేశ వ్యాప్తంగాను, ఇతర దేశాలకు రాయలసీమ నుంచి ఎగుమతి అవుతుంటాయి. ఇకపై కూడా ఎగుమతి అవుతాయి.ఆ క్రెడిట్ అంతా తమదేనని కూటమి పెద్దలు ప్రచారం చేసుకోవచ్చన్నమాట.ఇదంతా డైవర్షన్ రాజకీయాలలో భాగమేనని, అమరావతిలో వేల కోట్లు వ్యయం చేస్తున్న నేపధ్యంలో ఇతర ప్రాంతాలలో వ్యక్తం అవుతున్న అసంతృప్తిని కప్పిపుచ్చేందుకు చంద్రబాబు ఆడే గేమ్ ఇదన్నది రాయలసీమ ప్రాంతంలో బలపడుతున్న అభిప్రాయంగా కనిపిస్తుంది.లక్ష కోట్ల హబ్ కాదు..లక్ష మోసాలు అని మాజీ సి.ఎమ్. జగన్ విమర్శించారు. ఫ్రూట్ బౌల్ ఆఫ్ వరల్డ్ గా ప్రకటనలు చేస్తే రైతుల కడుపు నిండుతుందా!

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


