హరీశ్‌.. పేజీన్నర లేఖ రాసి రాజీనామానా?   | Sakshi
Sakshi News home page

హరీశ్‌.. పేజీన్నర లేఖ రాసి రాజీనామానా?  

Published Sat, Apr 27 2024 4:30 AM

Komatireddy Venkat Reddy Comments On Harish Rao

రాజీనామా చేస్తే స్పీకర్‌ ఫార్మాట్‌లో ఉండాలి 

ఆర్థిక మంత్రిగా ఒకటో తేదీన ఉద్యోగులకు వేతనాలు ఇవ్వని వ్యక్తి హరీ‹Ô

మాజీ మంత్రిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధ్వజం 

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావుపై రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర రాజకీయాల్లో హరీశ్‌ రావు ఓ జోకర్‌లా మారారని, ఆయన అన్నీ హౌలా(పులిష్) పనులు చేస్తున్నారని అందుకే ఆయన్ను హౌవ్లేష్‌రావు అంటారని మండిపడ్డారు. ఎమ్మెల్యేగా రాజీనామా చేయడానికి సిద్ధపడితే.. ఆయన స్పీకర్‌ ఫార్మాట్‌లో లేఖ ఇవ్వాలే తప్ప.. సుదీర్ఘంగా పేజీన్నర లేఖ రాసి రాజీనామా చేస్తు న్నట్లు ప్రకటించడం ఏమిటని మంత్రి కోమటిరెడ్డి నిలదీశారు.
 

శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డితో కలిసి మీడియా తో మాట్లాడారు. ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటిస్తే..ఆ ఒక్క హామీ కాదు.. మొత్తం 13 హామీలు నెరవేర్చాలని.. లేదంటే రాజీనామాకు సిద్ధం కావాలని హరీశ్‌ సవాల్‌ చేస్తూ.. ఓ డూప్లికేట్‌ రాజీనామా పట్టుకుని అమరవీరుల స్తూపం వద్ద రాజీనామా డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. దమ్ముంటే మెదక్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థికి డిపాజిట్‌ తెచ్చుకోవాలని హరీశ్‌రావుకు సవాల్‌ విసిరారు. 
 

హరీశ్‌కు మతిభ్రమించింది 
అధికారం పోయాక హరీశ్‌కు మతిభ్రమించిందని మంత్రి విమర్శించారు. ఆర్థిక మంత్రిగా ఉండి ఉద్యోగులకు ఒకటో తారీఖు జీతాలు ఇవ్వడం చేతకాని ఈ దద్దమ్మ, ఇవ్వాళ తాము ఒకటో తారీఖు జీతాలు ఇస్తుంటే ఓర్వలేకపోతున్నాడని నిందించారు. ఆయన, ఆయన మామ చేసిన రూ.లక్షల కోట్ల అప్పులకు ప్రతినెలా రూ.26 వేల కోట్ల వడ్డీలు కడుతున్నామని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. 
 

జూన్‌ 3 తరువాత బీఆర్‌ఎస్‌ మూతే... 
పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత బీఆర్‌ఎస్‌ పార్టీ పూర్తిగా మూతపడుతుందని మంత్రి జోస్యం చెప్పారు. మీ మామ చేసిన పలు హామీలు అమలు చేయనప్పుడు ఆ రాజీనామా లేఖ తీసుకుని అమరవీరుల స్థూపం వద్దకు వచ్చి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. రుణమాఫీ కాంగ్రెస్‌ బ్రాండ్‌ అనీ.. అప్పటికే రుణం చెల్లించిన వారికి కూడా అప్పటి సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి రూ. 5 వేల నుంచి రూ. 10 వేలు ప్రోత్సాహం ఇచ్చిన విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. 

నష్టమని తెలిసినా.. తెలంగాణ ఇచ్చారు 
కాంగ్రెస్‌ పార్టీ కి నష్టం జరుగుతుందని తెలిసినా.. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను నేరవేర్చిన దేవత సోనియాగాంధీ అని మంత్రి కోమటిరెడ్డి కొనియాడారు. తెలంగాణ వస్తే దళితున్ని సీఎం చేస్తానని ఆ తరువాత తానే సీఎం అయిన కేసీఆర్‌ మోసగాడని నిందించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement