దమ్ముంటే నన్ను సస్పెండ్ చేయండి.. బీఆర్ఎస్‌కు పొంగులేటి సవాల్..

Khammam Ponguleti Srinivas Reddy Challenge To BRS High Command - Sakshi

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: సొంతపార్టీ బీఆర్ఎస్‌పై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విరుచుకుపడ్డారు. వైరా నియోజకవర్గంలో తన అనుచరులను సస్పెండ్ చేయడంపై ఘాటుగా స్పందించారు. సస్పెండ్ చేయాల్సి వస్తే తనను చేయాలి గానీ, తన అనుచరులను కాదని ధ్వజమెత్తారు. తనను ఎప్పుడు సస్పెండ్ చేస్తారా అని ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. తనను కాకుల్లా , గద్దల్లా పొడుచుకు తినాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు.

'రాష్ట్రంలో గ్రామ పంచాయితీలలో మహిళా సర్పంచ్‌లు  మెడలో తాళిబొట్టు తాకట్టు పెట్టి బిల్లులు చెల్లిస్తున్న దుస్థితి లో ఉన్నాం. బంగారు తెలంగాణ అని చెప్పుకుంటూ ఈ ధనిక రాష్ట్రాన్ని నిరుపేద రాష్ట్రంగా మార్చేశారు. ప్రతి పంచాయతీకి రూ.10 లక్షలు , మున్సిపాలిటీకు రూ.20 లక్షలు ఇస్తాం అని చెప్పి ఎక్కడా నిధులు ఇవ్వకుండా సర్పంచులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.  ఒక ప్రజాప్రతినిధి శ్రీనన్న గురించి కాంట్రాక్టుల గురుంచి మాట్లాడుతున్నారు. నిజంగా మీరు వెయ్యి కొట్లా, రెండు వేల కొట్లా??  వర్కులు ఇచ్చి ఉంటే చర్చలకు నేను సిద్ధం. ఎవ్వరికి ఎంత ఇచ్చారో ఎవ్వరికి ఎంత లాభం చేకూరిందో  లెక్కలేంటో నేను చూపిస్తా. మన బాగోతం ఏమిటో మనకు తెలియంది కాదు. నిన్న వైరాలో నాకు అండగా ఉన్న కొంతమందిని సస్పెండ్ చేశారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే నన్ను సస్పెండ్ చేయాలి.' అని పొంగులేటి సవాల్ చేశారు.

'కళ్ళు ఉండి కాబోధిలా శ్రీనన్న బీఆర్‌ఎస్‌ పార్టీలో ఉన్నాడా లేదా అనేది చూడాల్సింది మీరు. మొన్నటి వరకు ప్రతి ఫ్లెక్సీలో నా ఫోటో వాడుకున్నారు. మీరు ప్రజా ప్రతినిధి కావడానికి నన్ను వాడుకున్నారు. ఎన్ని కుయుక్తులు పన్నినా,  ఎన్ని ప్రయత్నాలు చేసినా శ్రీనన్న ఒక్కడే కాదు సమయం సందర్భం వచ్చినప్పుడు ప్రజలే బుద్ది చెప్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక తెలంగాణ ఎలా సాధించుకున్నామో గుర్తుంచుకోవాలి. అధికారులు అందరికీ ఒకటే హెచ్చరిక. అధికారం ఎవడబ్బా సొత్తు కాదు. మీరు ప్రభుత్వ ఉద్యోగులు. మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు ఆ స్థాయి కి రావడానికి ఏమి ఇచ్చుకున్నారో మీరే ఆలోచించుకోండి.  అధికారం ఎప్పుడు ఒకరి చేతిలోనే ఉండదు, ఎవ్వరినైనా ఇబ్బంది పెడితే వడ్డీ కాదు చక్ర వడ్డీ తో తీరుస్తా. అశ్వారావుపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా జారే ఆదినారాయణను  నిలబెడుతున్నాను.' అని పొంగులేటి ప్రకటించారు.
చదవండి: తెలంగాణ బడ్జెట్‌పై ఈటల రాజేందర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

మరిన్ని వార్తలు :

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top