‘మహా’ రాజకీయం: ఏక్‌నాథ్‌ షిండే అలకపాన్పు | Key Maharashtra Meeting Cancelled, Eknath Shinde Heads To Village: | Sakshi
Sakshi News home page

‘మహా’ రాజకీయం: ఏక్‌నాథ్‌ షిండే అలకపాన్పు

Published Fri, Nov 29 2024 2:45 PM | Last Updated on Sat, Nov 30 2024 8:47 AM

Key Maharashtra Meeting Cancelled, Eknath Shinde Heads To Village:

తాజా పరిణామాల పట్ల అసంతృప్తి 

ఉప ముఖ్యమంత్రి పదవి పట్ల విముఖత

ఆకస్మికంగా స్వగ్రామానికి పయనమైన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి  

మహాయుతి కీలక సమావేశం రద్దు  

ప్రభుత్వ ఏర్పాటుకు తాను అవరోధం కాబోనన్న షిండే  

నరేంద్ర మోదీ, అమిత్‌ షాల నిర్ణయానికి కట్టుబడి ఉంటానని వెల్లడి  

ముంబై:  మహారాష్ట్రలో నూతన ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. కొత్త ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ఉత్కంఠకు తెరపడడం లేదు. ఎన్నికల ఫలితాలు విడుదలై వారం రోజులవుతున్నా ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా స్పష్టత రావడం లేదు. శుక్రవారం జరగాల్సిన మహాయుతి కీలక సమావేశం అనూహ్యంగా రద్దయ్యింది.

 ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే అడుగులు చర్చనీయాంశంగా మారాయి. సతారా జిల్లాలోని తన సొంత గ్రామానికి ఆయన చెప్పాపెట్టకుండా వెళ్లిపోవడం రకరకాల ఊహాగానాలకు తావిస్తోంది. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన(షిండే) నాయకుడు ఏక్‌నాథ్‌ షిండే, ఎన్సీపీ(అజిత్‌) నేత అజిత్‌ పవార్‌ గురువారం రాత్రి ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతోపాటు కేంద్ర మంత్రి జె.పి.నడ్డాతో సమావేశమయ్యారు. 

మంత్రివర్గం కూర్పు, మంత్రి పదవుల పంపకంపై వారు చర్చించినట్లు వార్తలొచ్చాయి. ఫడ్నవీస్, షిండే, అజిత్‌ పవార్‌ ఢిల్లీ పర్యటన ముగించుకొని శుక్రవారం ఉదయం ముంబైకి చేరుకున్నారు. శుక్రవారం ముగ్గురు నేతల మధ్య కీలక సమావేశం జరగాల్సి ఉంది. నూతన ముఖ్యమంత్రి ఎంపికతోపాటు మంత్రి పదవుల పంపకాన్ని ఖరారు చేస్తారని ప్రచారం జరిగింది. కానీ, ఏక్‌నాథ్‌ షిండే ఆకస్మికంగా తన సొంత గ్రామానికి వెళ్లిపోవడంతో చర్చలు ఆగిపోయాయి. 

తాజా పరిణామాల పట్ల షిండే అసంతృప్తితో ఉన్నారని, అందుకే అలకబూని మిత్రపక్షాలతో చర్చలు కొనసాగించడానికి ఇష్టపడడం లేదని తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్‌ మరింత పెరిగిపోయింది. మహాయుతి సమావేశం ఆదివారం జరుగనున్నట్లు శివసేన(షిండే) వర్గాలు తెలియజేశాయి. కొత్త ముఖ్యమంత్రి వచ్చేవారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని వివరించాయి. 

తమ పార్టీ నేత ఏక్‌నాథ్‌ షిండేలో ఎలాంటి అసంతృప్తి లేదని, ఆయన శనివారం ముంబైకి తిరిగి వస్తారని శివసేన నాయకుడు ఉదయ్‌ సామంత్‌ చెప్పారు. ఢిల్లీలో షిండే తమ పార్టీ డిమాండ్లను అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. దీనిపై అమిత్‌ షా అతిత్వరలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చిస్తారని వెల్లడించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన(షిండే), ఎన్సీపీ(అజిత్‌) పారీ్టలు మహాయుతి పేరిట కూటమిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. 

బీజేపీ 132, శివసేన(షిండే) 57, ఎన్సీపీ(అజిత్‌) 41 సీట్లు గెలుచుకున్నాయి. సీఎం కుర్చీ కోసం మూడు పార్టీల ముఖ్యనేతలు పోటీపడ్డారు. కానీ, మిత్రపక్షాలకు సీఎం పదవి ఇచ్చేందుకు బీజేపీ అధిష్టానం అంగీకరించడం లేదు. దాంతో కనీసం మంత్రి పదవుల్లోనైనా ఎక్కువ వాటా సొంతం చేసుకోవాలని శివసేన(షిండే), ఎన్సీపీ(అజిత్‌) ఆరాటపడుతున్నాయి. మిత్రపక్షాలకు 20 మంత్రి పదవులు ఇవ్వడానికి బీజేపీ పెద్దలు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో తమకే ఎక్కువ పదవులు కావాలని ఎన్సీపీ(అజిత్‌) పట్టుబడుతోంది. మరోవైపు బీజేపీ శాసనసభాపక్షం ఇప్పటికీ సమావేశం కాలేదు. తమ నాయకుడిని ఎన్నుకోలేదు.  

షిండే అడుగులు ఎటువైపు?  
మరోసారి సీఎం పదవి తనకే ఇవ్వాలని ఏక్‌నాథ్‌ షిండే తొలుత డిమాండ్‌ చేశారు. బీజేపీ అగ్రనాయకత్వం బుజ్జగించడంతో మెత్తబడ్డారు. ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకోవడానికి అంగీకరించినట్లు తెలిసింది. కానీ, కీలకమైన హోంశాఖను తనకే అప్పగించాలని షరతు పెట్టారు. షిండే మనసు మార్చుకుంటున్నట్లు ఆయన పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉప ముఖ్యమంత్రితో సరిపెట్టుకోవడం ఆయనకు ఇష్టం లేదని అంటున్నాయి. 

ఇదిలా ఉండగా, ఉప ముఖ్యమంత్రి పోస్టుపై శివసేన(షిండే)లో రెండు రకాల వాదనలు వినిపిస్తాయి. ఈ పదవి తీసుకోవాలని ఒక వర్గం చెబుతుండగా, అవసరం లేదని మరో వర్గం వ్యతిరేకిస్తోంది. ఇప్పటిదాకా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నాయకుడు ఉప ముఖ్యమంత్రి కావడం ఏమిటని శివసేన(షిండే) ఎమ్మెల్యే సంజయ్‌ సిర్సాత్‌ ప్రశ్నించడం గమనార్హం. 

పెద్ద పదవిలో ఉన్న వ్యక్తి చిన్న పదవిలో ఇమడలేరని ఆయన చెప్పారు. ఉప ముఖ్యమంత్రి పదవిలో షిండే కూర్చొనే అవకాశం లేదని అన్నారు. కూటమి ధర్మాన్ని తన తండ్రి గౌరవిస్తారని, వ్యక్తిగత ఆకాంక్షలకు ఆయన ప్రాధాన్యం ఇవ్వబోరని ఏక్‌నాథ్‌ షిండే తనయుడు, ఎంపీ శ్రీకాంత్‌ షిండే స్పష్టంచేశారు. ఇప్పుడు ఏక్‌నాథ్‌ షిండే ఎటువైపు అడుగులు వేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఆయన కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహా వికాస్‌ అఘాడీతో జట్టుకట్టినా ప్రభుత్వ ఏర్పాటుకు వారి బలం సరిపోదు.  

రెండు రోజుల్లో సీఎం ఎంపిక: షిండే  
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై అమిత్‌ షా, జె.పి.నడ్డాతో సానుకూల చర్చలు జరిగాయని ఏక్‌నాథ్‌ షిండే చెప్పారు. ఆయన శుక్రవారం ఉదయం ఢిల్లీలో ముంబైకి బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడారు. కొత్త సీఎం ఎంపికపై ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ముంబైలో మహాయుతి కీలక సమావేశం జరగబోతోందని, చర్చలు కొనసాగుతాయని అన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు తాను అవరోధం కాబోనని, ప్రధాని మోదీ, అమిత్‌ షాల నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టంచేశారు. మహాయుతి కూటమి పారీ్టల మధ్య చక్కటి సమన్వయం ఉందని వివరించారు. అతి త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఏక్‌నాథ్‌ షిండే ప్రకటించారు. పదవుల వెంట పడడం తమకు ఇష్టం లేదన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement