కేశినేని బ్రదర్స్‌ వార్‌లో కీలక పరిణామం | Kesineni Chinni Hurt; Case Filed Against Kesineni Nani | Sakshi
Sakshi News home page

కేశినేని బ్రదర్స్‌ వార్‌లో కీలక పరిణామం

Jun 13 2026 9:40 AM | Updated on Jun 13 2026 11:50 AM

Kesineni Chinni Hurt; Case Filed Against Kesineni Nani

బెజవాడ రాజకీయాల్లో కేశినేని సోదరుల మధ్య వివాదం మరో మలుపు తిరిగింది. ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని) అవినీతి బాగోతాన్ని బయటపెడుతూ మాజీ ఎంపీ కేశినేని నాని(శ్రీనివాస్‌) సోషల్‌మీడియాలో వరుస పోస్టులు చేస్తున్నది తెలిసిందే. తాజాగా ఈడీకి సైతం ఆయన ఫిర్యాదు చేయగా.. ఇప్పుడు ఆయనపైనే కేసు నమోదవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

సాక్షి, ఎన్టీఆర్‌ జిల్లా: కేశినేని బ్రదర్స్‌ మధ్య వివాదం మరింత ముదిరింది. తనపై సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్న సోదరుడి వ్యవహారంపై అధికార పార్టీ ఎంపీ కేశినేని చిన్ని పోలీసులను ఆశ్రయించారు. సోషల్‌ మీడియా వేదికగా తనపై అసత్య, అనుచిత ప్రచారం జరుగుతోందని, పరువు నష్టం కలిగించేలా పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా మాజీ ఎంపీ కేశినేని నానిపై  పటమట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. 

ఈ వ్యవహారం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే చిన్ని అధికార కూటమికి చెందిన ఎంపీ కాగా, నాని ఇటీవల కాలంగా ప్రభుత్వ విధానాలు, స్థానిక రాజకీయ పరిణామాలపై విమర్శనాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈడీకి ఫిర్యాదు చేసిన కొద్దిరోజుల్లోనే నానిపై కేసు నమోదవడం రాజకీయ వర్గాల్లో అనుమానాలకు తావిస్తోంది.

నాని అనుచరులు మాత్రం ఇది రాజకీయ ఒత్తిడిలో భాగంగా జరిగిన చర్య అని ఆరోపిస్తున్నారు. సోషల్‌ మీడియా పోస్టులపై కేసులు పెట్టడం ఏంటని నిలదీస్తున్నారు. అవినీతి ఆరోపణలపై సమాధానం చెప్పాల్సింది పోయి.. ప్రశ్నించిన వారిపైనే కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని వాదిస్తున్నారు. మరోవైపు ఎంపీ చిన్ని వర్గం మాత్రం సోషల్‌ మీడియాలో వ్యక్తిగత దూషణలు, అసత్య ప్రచారాన్ని సహించబోమని చెబుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement