నేటి నుంచి భేటీలతో దూకుడు  | KCR directive to conduct coordination meetings of Lok Sabha | Sakshi
Sakshi News home page

నేటి నుంచి భేటీలతో దూకుడు 

Mar 26 2024 6:32 AM | Updated on Mar 26 2024 6:32 AM

KCR directive to conduct coordination meetings of Lok Sabha - Sakshi

లోక్‌సభ సమన్వయ సమావేశాల నిర్వహణకు కేసీఆర్‌ ఆదేశం 

అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా 30 నాటికి పూర్తి చేయాలని సూచన 

హైదరాబాద్‌ ఎంపీ స్థానానికి గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌ ఎంపిక 

సాక్షి, హైదరాబాద్‌: పార్టీ అభ్యర్థులంతా ఖరారైన నేపథ్యంలో ప్రచారంలో దూకుడు పెంచాలని, క్షేత్రస్థాయి శ్రేణులను సన్నద్ధం చేయాలని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం నుంచి లోక్‌సభ స్థానాల పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు సమన్వయకర్తలుగా వ్యవహరించే ఈ భేటీలకు పార్టీ ఎంపీ అభ్యర్థులు హాజరవుతారని వివరించారు. ఈ నెల 30వ తేదీలోగా ఈ భేటీలను పూర్తిచేసి క్షేత్రస్థాయి ప్రచారంపై దృష్టి సారించాలని అభ్యర్థులను ఆదేశించారు. మరోవైపు మూడు రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం, కరువు పరిస్థితులను పరిశీలించి నివేదిక ఇవ్వాలని పార్టీ నేతలకు కేసీఆర్‌ సూచించారు. 

ప్రచార షెడ్యూల్‌పై కొనసాగుతున్న భేటీలు 
ఏప్రిల్‌ రెండో వారం నుంచి క్షేత్రస్థాయిలో బీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కించాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. అందులో భాగంగా ఒక్కో లోక్‌సభ సెగ్మెంట్‌ పరిధిలో కనీసం రెండు, మూడు బహిరంగ సభలు నిర్వహించాలని యోచిస్తున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించి పరేడ్‌ మైదానంలో భారీ సభ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. 

కాంగ్రెస్, బీజేపీలు లక్ష్యంగా ఎజెండా.. 
ఎన్నికల ప్రచార షెడ్యూల్, ప్రచార ఎజెండా తదితరాలపై పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, సీనియర్‌ నేతలు హరీశ్‌రావు, మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులకు కేసీఆర్‌ పలు సూచనలు చేసినట్టు తెలిసింది. జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలను లక్ష్యంగా చేసుకుని ప్రసంగాలు, ప్రచారం చేయాలని పేర్కొన్నట్టు సమాచారం.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ హామీల ఉల్లంఘన, అప్రజాస్వామిక విధానాలు, బెదిరింపులు, వేధింపులు వంటి అంశాలను ప్రచారం చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. జాతీయ స్థాయిలో బీజేపీ నియంతృత్వం, అణచివేత విధానాలు, లౌకికత్వానికి పొంచి ఉన్న ముప్పు వంటి అంశాలనూ ఎత్తి చూపాలని భావిస్తున్నట్టు సమాచారం. 
 
జెండా మోసిన వారికే పెద్దపీట 
పార్టీ జెండా మోసిన వారికి పెద్దపీట వేస్తూ లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక కసరత్తును కేసీఆర్‌ పూర్తి చేశారు. హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌ పేరును సోమవారం ఖరారు చేశారు. మొత్తం 17 లోక్‌సభ సీట్లకు గాను ఇంతకుముందే నాలుగు విడతల్లో 16 మంది పేర్లను బీఆర్‌ఎస్‌ ప్రకటించింది. అందులో 13 మంది పార్టీలో సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్న వారుకాగా.. ముగ్గురు గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీలో చేరినవారు.

నాగర్‌కర్నూల్‌ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఒక్కరే ఇటీవల బీఆర్‌ఎస్‌లో చేరారు. ఇక బీఆర్‌ఎస్‌ టికెట్ల కేటాయింపులో బీసీలకు ప్రాధాన్యత దక్కింది. రిజర్వ్‌డ్‌ స్థానాలు పోగా మిగిలిన సీట్లలో సగం బీసీలకే కేటాయించింది. మొత్తం 17 స్థానాల్లో ఎస్సీలకు మూడు (రెండు మాదిగ, ఒక మాల), ఎస్టీలకు రెండు (బంజారా, గోండులకు చెరొకటి), బీసీలకు ఆరు (మున్నూరు కాపు రెండు, ముదిరాజ్, గౌడ, యాదవ, కురుమలకు ఒక్కోటి), ఓసీలకు ఆరు (నాలుగు రెడ్డి, వెలమ, కమ్మకు చెరో స్థానం) సీట్లు కేటాయించింది. 

కొత్త అభ్యర్థులు తెరమీదకు..! 
బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎంపీల్లో ఐదుగురు ఇతర పార్టీల్లో చేరగా.. కొందరు కీలక నేతలు కూడా పార్టీని వీడారు. ఈ క్రమంలో ముగ్గురు సిట్టింగులతోపాటు కరీంనగర్‌ మినహా మిగతా అన్ని స్థానాల్లో బీఆర్‌ఎస్‌ కొత్త అభ్యర్థులను రంగంలోకి దింపింది. ఎమ్మెల్సీ వెంకట్రామ్‌రెడ్డితోపాటు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పొందిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య, మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డి తదితరులు లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగారు.

ఇక అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీలో చేరిన రాగిడి లక్ష్మారెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్, గాలి అనిల్‌కుమార్‌లకు పోటీ అవకాశం దక్కింది. ఇక నేతలు పార్టీని వీడిన చోట కొత్తవారికి ఇన్‌చార్జులుగా బా«ధ్యతలు అప్పగిస్తున్నారు. సిర్పూరులో ఎమ్మెల్సీ దండె విఠల్, కామారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఖైరతాబాద్‌లో మన్నె గోవర్ధన్‌రెడ్డిలకు సమన్వయ బాధ్యతలు అప్పగించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement