
ఓట్ల చోరీ వ్యవహారంపై నోరుజారి పదవి కోల్పోయిన కర్ణాటక మాజీ మంత్రి కేఎన్ రాజన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై పెద్ద కుట్ర జరిగిందని, తెర వెనుక ఉన్నవారి పేర్లను త్వరలో బయటపెడతానని అన్నారాయన. ఈ క్రమంలో ఢిల్లీ వెళ్లి అధిష్టానం పెద్దలను కలిసి తన వ్యాఖ్యలకు వివరణ ఇస్తానని పేర్కొన్నారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సన్నిహితుడిగా కేఎన్ రాజన్నకు పేరుంది. అదే సమయంలో డీకే శివకుమార్‌తో పొసగదనే ప్రచారం ఉంది. అయితే ఓట్ల చోరీ వ్యవహారంలో ఆయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. కాంగ్రెస్‌కే దెబ్బ వేసేలా ఉన్న ఆ వ్యాఖ్యలను అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలో ఆయన్ని పదవి నుంచి తొలగించింది. అయితే.. ఈ వ్యవహారంలో పెద్ద కుట్ర జరిగిందని.. తాను బాధితుడిని మాత్రమేనని అంటున్నారాయన.
‘‘ఈ వ్యవహారంలో ఇప్పుడే వివరాలేం చెప్పలేను. రాజీనామా అనుకోండి.. నన్ను తప్పించారనుకోండి.. ఇంకా మీరు ఏమైనా రాసుకోండి. కానీ, ఈ తతంగం వెనుక పెద్ద కుట్రే జరిగింది. ఎవరు.. ఎందుకు చేశారనేది సరైన సమయం వచ్చినప్పుడు చెప్తా. త్వరలో ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ ప్రెసిడెంట్‌ను, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాలను కలిసి తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చి అపార్థాలను తొలగించే ప్రయత్నం చేస్తాను. కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా నాతో వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు అని మీడియాను ఉద్దేశించి అన్నారాయన.

రాజన్న ఏమన్నారంటే.. ‘‘మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఓటర్ల జాబితా సవరణలు జరిగాయి. ఆ సమయంలో పార్టీ కళ్లు మూసుకుంది’’ అని రాజన్న చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలు రాహుల్ గాంధీ చేసిన ఓట్ చోరీ ఆరోపణలకు వ్యతిరేకంగా ఉండటంతో.. కాంగ్రెస్ హైకమాండ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. అదే సమయంలో డీకే శివకుమార్ వర్గీయులు సైతం ఈ వ్యాఖ్యలను వ్యతిరేకించారు. దీంతో మంత్రి పదవికి రాజీనామా చేయాలని అధిష్టానం కోరగా.. రాజన్న స్పందించలేదు. ఈ తరుణంలోనే సిద్ధరామయ్య సిఫారసుతో గవర్నర్ ఆయనను కేబినెట్ నుంచి తొలగించారు.
కర్ణాటక తాజా రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం.. రాజన్న తొలగించే ఉద్దేశంలో సిద్ధరామయ్య లేరని, అయితే సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది. ఈ వ్యవహారంలో తనకు మద్దతుగా వచ్చేవారితో కలిసి సిద్ధరామయ్యను కలిశాకే తన తదుపరి కార్యాచరణను రాజన్న ప్రకటిస్తారని సమాచారం. అదే సమయంలో.. కాంగ్రెస్ అధిష్టానం ఆయన కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఆయన గనుక మరోసారి నోరు జారితే తీవ్ర చర్యలు తీసుకోవాలని పార్టీ భావిస్తున్నట్లు బోగట్టా.
కర్ణాటక తుమకూరు జిల్లాకి చెందిన రాజన్న(74)కు కాంగ్రెస్ పార్టీతో దశాబ్దాల అనుబంధం ఉంది. సహకార సంఘాలకు ప్రాతినిధ్యం వహించిన ఆయన.. ఎమ్మెల్యే టికెట్ నిరాకరణతో 2004 ఎన్నికల్లో జేడీఎస్‌లో చేరి.. ఆ పార్టీ తరఫు నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆపై కాంగ్రెస్ గూటికి చేరి 2013, 2023 ఎన్నికల్లో మధుగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచారు. డీకే శివకుమార్ వర్గంతో విభేదాలు ఉన్నప్పటికీ.. తనకు సన్నిహితుడైన రాజన్నకు సిద్ధరామయ్య సహకార సంఘ శాఖను కట్టబెట్టారు.