
సాక్షి, సిద్దిపేట రూరల్: ‘ఇది నా జన్మభూమి. భవిష్యత్తులో ఇదే నా కర్మభూమి కావొచ్చు. ఇక్కడి నుంచే కేసీఆర్ భూకంపం పుట్టించారు. నామీద రాజకీయంగా ఆంక్షలు పెడితే ఏమీ జరగదు. కుట్రలు చేసిన వారిని వదలను’ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అన్నారు. సిద్దిపేట జిల్లాలోని కేసీఆర్ స్వగ్రామమైన చింతమడకలో ఆదివారం సాయంత్రం జరిగిన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో కవిత పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చింతమడక అంటే చరిత్ర సృష్టించిన గ్రామమని.. ఇక్కడి ముద్దు బిడ్డ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సాధించారని అన్నారు. తాను చాలా ఏళ్లు ఇక్కడికి రాలేదని, గత ఏడాది పరిస్థితి వేరేలా ఉండిందని చెప్పారు. కానీ ఈ ఏడాది ప్రత్యేక పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రజలు తనను అక్కున చేర్చుకున్నారని అన్నారు. ఇక్కడికి రావాలన్నా.. ఆంక్షలు ఉన్నాయని, అయితే ఏఊరు ఎవరి జాగీరు కాదని స్పష్టం చేశారు. రాజకీయంగా ఆంక్షలు పెడితే చింతమడకకు మళ్లీ మళ్లీ వస్తా, అలాగే సిద్దిపేటకూ వస్తానని అన్నారు.
‘చంద్రునికి మచ్చతెచ్చే పని కొంత మంది చేసిండ్రు, అదే విషయం అడిగితే తల్లికి, పిల్లకు పాపిండ్రు’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. కుట్రలు చేసే వారిని వదలనని, పురిటి గడ్డ పౌరుషం చూపించి.. వారి భరతం పడతానని స్పష్టం చేశారు. అంతకు ముందు గ్రామంలోని శివాలయంలోను, రామాలయంలోను ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిపాడారు.