12 ఓట్లతో గెలుపు, అన్నీ అనుమానాలే!

JD U Member Won By Just 12 Votes Controversy In Bihar Results - Sakshi

పట్నా: ఉత్కంఠ రేపిన బిహార్‌ ఎన్నికల ఫలితాల్లో జేడీయూకి ఓ చోట అనూహ్యం విజయం దక్కింది. హిల్సా నియోజకవర్గంలో జేడీయూ అభ్యర్థి కృష్ణ మురారీ శరణ్‌ 12 ఓట్ల మెజారిటీతో ఆర్జేడీ అభ్యర్థి ఆర్తీ మునిపై విజయం సాధించారు. మురారీకి 61,848 ఓట్లు రాగా, మునికి 61,836 ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల కమిషన్‌ వెబ్‌సైట్‌లో ఇదే విషయాన్ని పేర్కొన్నారు. అయితే, ఆర్జేడీ మాత్రం ఇవన్నీ తప్పుడు లెక్కలని ఆరోపణలకు దిగింది. తొలుత తమ అభ్యర్థి ముని 547 ఓట్లకు పైగా మెజారిటీతో విజయం సాధించారని రిటర్నింగ్‌ అధికారి చెప్పి.. మళ్లీ మాట మార్చారని ఆర్జేడీ నేతలు వాదిస్తున్నారు. విన్నింగ్‌ సర్టిఫికెట్‌ కూడా ఇస్తామని చెప్పి.. అంతలోనే డ్రామాకు తెరతీశారని విమర్శించారు. 
(చదవండి: బిహార్‌ సీఎం పదవిపై ఉత్కంఠ!)

సీఎం నితీష్‌ కుమార్‌ కార్యాలయం నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చిన తర్వాతే ఇదంతా జరిగిందని ఆర్జేడీ నేతలు విమర్శిస్తున్నారు. ‘తొలుత తమ అభ్యర్థికి 500 పైగా ఓట్ల మెజారిటీ అని చెప్పారు. సీఎం ఆఫీస్‌ నుంచి కాల్‌ రాగానే 13 ఓట్ల తేడాతో తమ అభ్యర్థి ఓడిపోయాడని కొత్తగా మాట్లాడుతున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల రద్దు కారణంగా విజయం తారుమారైందని సమర్థించుకుంటున్నారు’అని ఆర్జేడీ నేతలు విమర్శించారు. మరోవైపు జేడీయూ అభ్యర్థికి 232 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు రాగా.. ఆర్జేడీ అభ్యర్థికి 233 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు వచ్చాయని ఈసీ తెలిపింది. తమపై ఎలాంటి ఒత్తిడి లేదని ఈసీ అధికారులు స్పష్టం చేసింది. ఇక తమ కూటమి అభ్యర్థులు 119 చోట్ల విజయం సాధించాల్సి ఉండగా.. 111 మంది మాత్రమే గెలిచారని, ఫలితాలపై అనుమానాలున్నాయని ఆర్జేడీ తెలిపింది. 119 అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. 
(చదవండి: బీజేపీదే బిహార్‌)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top