
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ (జనసేన పార్టీ)కి మంగళవారం దుర్గగుడిలో చేదు అనుభవం ఎదురైంది. అమ్మవారి దర్శనానికి వస్తున్నట్లు ఆయన ఆలయ అధికారులకు, ప్రొటోకాల్‌కు సమాచారం అందించారు.
ఈ క్రమంలో ఉదయం 11.30 గంటల సమయంలో కారులో ఘాట్‌రోడ్డు మీదగా ఓం టర్నింగ్‌కు చేరుకున్న ఎమ్మెల్యే కారును సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ప్రొటోకాల్ నుంచి సమాచారం లేనందున అక్కడే కారు నిలుపుకోవాలని డ్రైవర్‌కు సూచించారు. కారులో ఎమ్మెల్యే ఉన్నారని డ్రైవర్ చెప్పినా సిబ్బంది వినలేదు. దీంతో ఎమ్మెల్యే కారు అద్దం కిందకు దింపి తాను ఎమ్మెల్యేనని చెప్పుకోవాల్సి వచ్చింది. ఇంతలో విషయం తెలుసుకున్న ప్రొటోకాల్ అధికారులు సెక్యూరిటీ సిబ్బందిని హెచ్చరించడంతో వారు కారును సమాచార కేంద్రం వరకు అనుమతించారు.
దీంతో, అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే సిబ్బంది నిర్వాకంపై మండిపడ్డారు. ఆలయ ఈవో శీనానాయక్‌కు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగక తాను ఈ అంశాన్ని తేలికగా తీసుకోనని, ఆలయ ప్రొటోకాల్‌లో ఏం జరుగుతుందో తనకు తెలుసంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహా నివేదన అనంతరం ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించినా ఆయన శాంతించలేదు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.