కారు పార్టీలో ‘కయ్యం’.. టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ టీఆర్‌ఎస్‌..

Internal Differences In Vikarabad District TRS - Sakshi

వికారాబాద్‌: టీఆర్‌ఎస్‌లో అంతర్గత విభేదాలు రోజురోజుకూ అధికమవుతున్నాయి. జిల్లాలోని నాలుగు నియోజకవర్గల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. స్వపక్షంలోనే ప్రతిపక్షం తయారవడంతో అధికారిక, పార్టీ కార్యక్రమాలు ఉద్రిక్తంగా సాగుతున్నాయి. తాండూరులో మొదలైన ఈ కుమ్ములాటలు అంతటా పాకాయి. రెండు వర్గాలుగా విడిపోయిన గులాబీ శ్రేణులు కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. శుక్రవారం తాండూరులో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు.. ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిపై అసహనం వ్యక్తంచేయడం స్థానిక పరిస్థితులకు అద్దం పట్టింది.
చదవండి: అటు బుజ్జగింపులు.. ఇటు బాధ్యతలు! 

టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ టీఆర్‌ఎస్‌.. ఇదేంటి అని ఆశ్చర్యపోతున్నారా.. ప్రస్తుతం జిల్లాలో ఇదే సీన్‌ కొనసాగుతోంది. అన్ని నియోజకవర్గాల్లోనూ వర్గపోరు జోరందుకుంది. పార్టీ కార్యక్రమాలకు విడివిడిగా హాజరుకావడం.. వ్యక్తిగత దూషణలకు దిగడం నేతలకు పరిపాటిగా మారింది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ తరఫున పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

మాటల యుద్ధం 
సాధారణంగా ఎక్కడైనా పాలక, ప్రతిపక్షాలు గొడవలు పడుతుంటాయి. అధికార పక్షం అవునంటే.. ప్రతిపక్షం కాదంటుంది. అయితే అందరికీ అవసరమయ్యే కొన్ని పనుల విషయంలో.. మనవతా దృక్పథంతో పరస్పరం సహకరించుకుంటాయి. కానీ మన జిల్లాలో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ తరపున పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు ఎక్కువవుతున్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులతో సొంత పారీ్టకి చెందిన నేతలు పోటీ పడుతున్నారు. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో విడివిడిగా పాల్గొంటూ మాటల యుద్ధానికి తెరలేపుతున్నారు. పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు ఒకరినొకరు బహిరంగంగా దూషించుకుంటున్నారు.

నాలుగు చోట్లా అదే సీన్‌ 
తాండూరులో మొదలైన టీఆర్‌ఎస్‌ అంతర్గత కుమ్ములాటలు జిల్లా అంతటా వ్యాపించాయి. రెండేళ్ల క్రితం ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి వర్గాల మధ్య ప్రారంభమైన గొడవలు వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరాయి. కొగంగల్‌లో ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి మధ్య కొంతకాలంగా కోల్డ్‌ వార్‌ సాగుతోంది. వికారాబాద్‌లో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దంపతులు పట్నం వర్గంతో జత కట్టడంతో స్థానిక ఎమ్మెల్యేకు వర్గపోరు మొదలైంది. ఇక ఎమ్మెల్యే వర్గీయులు ఇటీవల జెడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి కాన్వాయ్‌ని అడ్డుకోవడంతో పార్టీ కేడర్‌ మధ్య విభేదాలు బయటపడ్డాయి. పరిగి నియోజకవర్గంలో డీసీసీబీ చైర్మన్‌ మనోహర్‌రెడ్డి ఎమ్మెల్యే టికెట్‌ ఆశిస్తున్నారు. దీంతో ఇక్కడ కూడా అధికార పార్టీలో అంతర్గత పోరు మొదలైంది. ఎమ్మెల్యే, డీసీసీబీ చైర్మన్‌ రెండు వర్గాలుగా విడిపోయి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

దిగజారుతున్న ప్రతిష్ట 
అధికార పార్టీ నేతల తీరు ప్రజల్లో పార్టీ ప్రతిష్టను దిగజారుస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో గతంలో నిర్వహించిన ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలకు కలిసి హాజరైన నేతలు ప్రస్తుతం ఎవరికి వారే అనే రీతిలో సాగుతున్నారు. వికారాబాద్, తాండూరులో జరిగిన పలు సంఘటనలు నేతల వ్యవహారాన్ని ప్రజలు ఈసడించుకునే స్థాయికి చేరింది. అధికార పార్టీ కౌన్సిలర్లు, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు మొదలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ వరకు గులాబీ నేతల వ్యవహార శైలి నానాటికీ దిగజారుతోంది.

అభివృద్ధి, ప్రజా సమస్యలను పక్కన పెట్టి మున్సిపల్‌ కార్యాలయాల సాక్షిగా చేస్తున్న రాజకీయాలు వెగటు పుట్టిస్తున్నాయి. ఆరు నెలల క్రితం వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ ఆనంద్‌ అధికార పార్టీ జిల్లా సారథ్య బాధ్యతలు చేపట్టిన తర్వాత గొడవలు పెరిగానే తప్ప తగ్గుముఖం పట్టలేదు. మంత్రులు, ఎంపీలు చెబితేనే తెగని పంచాయితీలకు జిల్లా అధ్యక్షుడు పరిష్కారం చూపగలరా అనేది ప్రశ్నార్థకంగా మారింది. పార్టీలో ఆయనే ఓ వర్గాన్ని నడుపుతుండగా ఇక నేతలను ఎలా సమన్వయం చేయగలరనే విమర్శలూ వినిపిస్తున్నాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top