ఆటలో అరటిపండ్లే.. ‘ఆ ముగ్గురి’ని టీడీపీ అధిష్టానం పక్కన పెట్టేసినట్టేనా!? 

Internal Clashes in Telugu Desam Party Vijayawada - Sakshi

విజయవాడ పార్లమెంటరీ కమిటీ ప్రధాన కార్యదర్శిగా మునెయ్య 

స్టేట్‌ మైనార్టీ సెల్‌ జనరల్‌ సెక్రటరీగా ఫతావుల్లా 

నగర నేతలకు ప్రాధాన్యం హుళక్కే! 

సాక్షి, విజయవాడ: నగర తెలుగుదేశం పార్టీలోని వెనుకబడిన తరగతుల్లో ముసలం మొదలైంది. విజయవాడ పార్లమెంటరీ పార్టీ కమిటీ ప్రధాన కార్యదర్శిగా తిరువూరు నియోజకవర్గానికి చెందిన మునెయ్యను అధిష్టానం తాజాగా నియమించింది. ఈ పదవి కోసం విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మాజీ ఫ్లోర్‌ లీడర్‌ ఎరుబోతు రమణరావు, కార్పొరేషన్‌ ఎక్స్‌ అఫిషియో మెంబర్‌ ఫతావుల్లా పోటీపడ్డారు. పదవిని ఫతావుల్లాకు ఇవ్వాలని విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ (నాని) పట్టుపట్టగా.. బీసీ వర్గానికి చెందిన ఎరుబోతుకు దక్కాల్సిందేనని బొండా ఉమామహేశ్వరరావు, బుద్ధా వెంకన్న, నాగుల్‌ మీరా భీష్మించుకున్నారు. విజయవాడ ఈస్ట్‌ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ కూడా రమణరావు వైపు మొగ్గుచూపారు.

ఎంపీ కేశినేనికి, అర్బన్‌ పార్టీలోని ముఖ్య నేతల మధ్య వివాదం తీవ్రస్థాయికి చేరడానికి ఈ పదవి నియామకం విషయంలో తలెత్తిన విభేదాలే కారణమని ముఖ్య నాయకులు గుర్తుచేస్తున్నారు. విజయవాడ పార్లమెంటరీ కమిటీ అధ్యక్షునిగా మాజీ మంత్రి నెట్టెం రఘురాం నియామక సమయంలోనే పూర్తి కమిటీని వేయాలని అధిష్టానం భావించినప్పటికీ సాధ్యం కాలేదు. ఇరువర్గాలు భీష్మించుకోవడంతో ప్రధాన కార్యదర్శి పదవి నియామకాన్ని అప్పట్లో పక్కన పెట్టేసింది. తాజా పరిణామాల నేపథ్యంలో మునెయ్య నియామకం టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. కాగా ఫతావుల్లాను స్టేట్‌ మైనార్టీ సెల్‌ జనరల్‌ సెక్రటరీగా అధిష్టానం నియమించింది.

చదవండి: (టీడీపీ నేతల్లో అంతర్మథనం.. అడకత్తెరలో ‘ఆ ముగ్గురు’!)
  
ఉద్దేశపూర్వకంగానేనా? 

ఇకపై చంద్రబాబు వైపే చూడనని, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనబోయేదే లేదని తెగేసి చెప్పిన ఎంపీ కేశినేని చివరకు తన కేశినేని భవన్‌లో అధినేత చిత్రపటాన్ని తొలగించి ఆ స్థానంలో రతన్‌టాటా బొమ్మను ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లడం, ఉద్వేగభరితంగా ఉపన్యసించడం, రాష్ట్రపతిని కలవడానికి చంద్రబాబు బృందం ఢిల్లీ వెళ్లినప్పుడు క్రియాశీలకంగా వ్యవహరించడం గుర్తించాల్సిన పరిణామం. చంద్రబాబు అన్నివిధాలుగా ప్రాధాన్యత ఇవ్వడానికి సిద్ధపడిన తర్వాతే కేశినేని పార్టీ కార్యాలయానికి వెళ్లారని, క్రియాశీలకంగా వ్యవహరించారని పార్టీ నాయకులు గుర్తుచేస్తున్నారు. అందులో భాగంగానే ఫతావుల్లాకు రాష్ట్రస్థాయి పదవి ఇవ్వడం, నగర నేతలు బొండా, బుద్ధా, మీరాలు ప్రతిపాదించిన రమణరావుకు మొండిచెయ్యి చూపడమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒకవేళ ఎరుబోతుకు ఇవ్వని పక్షంలో నగరానికే చెందిన లుక్కా సాయిరాం గౌడ్, గోగుల రమణారావు, ఎన్‌సీ భానుసింగ్‌ తదితర వెనుకబడిన తరగతులకు చెందిన ముఖ్య నాయకులు పలువురు ఉన్నారు.

వారిలో ఎవరికైనా ఇవ్వడానికి అధిష్టానం ఎందుకు ఆలోచించలేదోనని పార్టీకి చెందిన మాజీ మంత్రి ఒకరు వ్యాఖ్యానించడం పరిశీలనాంశం. విజయవాడ లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాలలో 16 లక్షల మంది ఓటర్లు ఉండగా అందులో సగం ఓటర్లు నగర పరిధిలోని మూడు నియోజకవర్గాల్లోనే ఉన్నారు. తక్కిన 8 లక్షల మంది ఓటర్లు నాలుగు నియోజకవర్గాల్లో ఉన్నారు. పార్లమెంటరీ కమిటీలోని రెండు ముఖ్యమైన అధ్యక్ష, కార్యదర్శ పదవులు రూరల్‌ నియోజకవర్గాలైన జగ్గయ్యపేట (నెట్టెం రఘురాం), తిరువూరు(మునెయ్య)కు ఇవ్వడమంటే విజయవాడ నగరంలోని నేతలను పక్కన పెట్టినట్లేనని గుర్తుచేస్తున్నారు. పార్టీ పరంగా నగరంలోనే ఎక్కువ కార్యక్రమాలు, అవసరాలు కూడా ఉంటాయని అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద కేశినేని మాట చెల్లుబాటు కావడం మొదలైందని, ముగ్గురు సంగతి మరెలా ఉంటుందో వేచిచూడాల్సి ఉందని పార్టీలోని సీనియర్లు సెటైర్లు వేస్తుండం పరిశీలనాంశం.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top