లోకల్‌ టచ్చిస్తారా..నేషనల్‌ నచ్చేస్తారా?

The influence of labor voters on the victory - Sakshi

వలస ఓటు మొగ్గుచూపేదెటో..

మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా మినీ భారత్‌ 

భిన్న భాషలు... విభిన్న సంస్కృతులు.. వేలల్లో పరిశ్రమలు..  

అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు, ఉద్యోగులు 

వేలల్లో పరిశ్రమలు. లక్షలాదిమంది కార్మికులు.. దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన కార్మిక కుటుంబాలతో సందడి..అన్ని భాషలు, సంస్కృతుల సమ్మేళనం.. వెరసి మినీ ఇండియా పేరుగాంచింది మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా.  మేడ్చల్, ఉప్పల్, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి మల్కాజిగిరి అసెంబ్లీ సెగ్మెంట్లు ఈ జిల్లా పరిధిలో ఉన్నాయి.

వారిదే ప్రధాన భూమిక 
శ్రామికుల రాజధానిగా పేరుగాంచిన మేడ్చల్‌ జిల్లాలో అభ్యర్థుల గెలుపోటములపై  శ్రామిక ఓటర్లు ప్రభావం చూపనున్నాయి. ఈ జిల్లా జనాభాలో 40 శాతం మంది శ్రామికులే ఉన్నారు. జిల్లాలో మొత్తం శ్రామికులు 2,26,939 మంది ఉండగా, వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన వలస శ్రామికులు 1,80,326 మంది ఉన్నారు.  జిల్లాలో రెండు మెగా పరిశ్రమలు, 71 భారీ పరిశ్రమలు,  3,760 మైక్రో , 2320 సూక్ష్మ, 16 మధ్యతరహా పరిశ్రమల్లో 77,862 మంది ఉద్యోగులు, కార్మికులు పని చేస్తున్నారు.

ఇక ఈ ఏడాది కొత్తగా ఏర్పడిన 599 సూక్ష్మ, చిన్న పరిశ్రమలతో 4,609 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. జిల్లా పరిధిలోని ఐదు నియోజకవర్గాల్లోని నివసిస్తున్న  వీరంతా ఇక్కడే ఓటు హక్కు కలిగి ఉన్నారు. వీరి ఓట్లపై ప్రధాన పార్టీల అభ్యర్థులు దృష్టి పెట్టారు. అయితే వీరు ఈసారి ఎటువైపు మొగ్గుచూపుతారో చూడాలి. జాతీయ పార్టీలకు మద్దతిస్తారా.. లోకల్‌గా ఉంటున్న నేపథ్యంలో ఇక్కడి పార్టీ కే పట్టం కడతారా అన్నది చూడాల్సిందే. 

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు..
ప్రధానంగా బీహార్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాంచల్, ఉత్తరప్రదేశ్, అస్సోం, ప శ్చిమబెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు సైతం ఇక్కడ స్థిరనివాసం ఏర్పర్చుకున్నారు.  

ఏయే కంపెనీలు ఉన్నాయంటే..
జీడిమెట్ల, బాలానగర్, కూకట్‌పల్లి,  ఉప్పల్, నాచారం, మల్లాపూర్, కుషాయిగూడ, చర్లపల్లి, మౌలాలి, శామీర్‌పేట్, మేడ్చల్‌ ప్రాంతాల్లో  ప్రభుత్వ రంగ పరిశ్రమలతోపాటు ఇంజనీరింగ్, ఫార్మా, ఫుడ్‌ ఇండస్ట్రీలు ఉన్నాయి. మౌలాలి ప్రాంతంలో ఫ్యాబ్రికేషన్, స్టీల్, ప్లాస్టిక్,  ఫర్నిచర్, కెమికల్, ఎల్రక్టానిక్స్‌ తరహా పరిశ్రమలు ఉన్నాయి.

 బాలానగర్‌ పారిశ్రామికవాడ పరిధిలో ఫ్యాన్లు తయారు చేసే కంపెనీలు,  ఆటోమొబైల్‌ వస్తువుల తయారీ, బీర్‌ మాన్యు ఫాక్చరింగ్‌ యూనిట్, ఫాబ్రికేషన్, వైర్‌ మెష్‌ యూనిట్లు, ఫుడ్‌ ప్రొడక్ట్స్, ఫార్మా యూనిట్లు ఉన్నాయి. బీహెచ్‌ఈఎల్, ఆర్‌ అండ్‌ డీ, హెచ్‌ఎఎల్, ఐడిపిఎల్,  ఎన్‌ఆర్‌ఎస్‌ఎ వంటి కంపెనీలూ ఉన్నాయి. ఐడీఏ బాలానగర్, ఐడీఏ కూకట్‌పల్లి, సీఐఈ గాం«దీనగర్‌ ఒకే చోట ఉన్నాయి. ఇక  శామీర్‌పేట్, మేడ్చల్‌ మండలాల్లో బయెటెక్, కెమికల్, విత్తన చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయి. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top