ఓ ప్రైవేట్ ఆస్పత్రి నిర్లక్ష్యానికి వృద్ధుడి బలి
మృతుడి కుటుంబ సభ్యుల ఆరోపణ
కామారెడ్డి టౌన్: ఓ ప్రైవేట్ ఆస్పత్రి నిర్లక్ష్యానికి వృద్ధుడు బలయ్యాడు. వ్యాధి ఒకటి కాగా.. సంబంధం లేని వైద్యం అందించడంతో అతడు మృత్యువాతపడ్డాడు. జిల్లాకేంద్రంలో మంగళవారం వెలుగు చూసిన ఘటన వివరాలిలా ఉన్నాయి. దోమకొండ మండలం అంచనూరు గ్రామానికి చెందిన నాగ బాలరాజు(70) నరాల బలహీనత, థైరాయిడ్, బీపీ సమస్యలతో ఈనెల 17నజిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలోగల ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నాడు.
అయితే ఆస్పత్రి సిబ్బంది పొరపాటున బాలరాజుకు వేరొక పేషెంట్ ఫైల్‌ను ఇచ్చారు. ఆ ఫైల్‌లోని ప్రి్రస్కిప్షన్ ఆధారంగా ఆస్పత్రిలోని మెడికల్ షాప్‌లో మందులు కొనుగోలు చేశాడు. ఇంటికి వెళ్లాక ఆ మందులు వేసుకున్నాడు. బాలరాజుకు షుగర్ వ్యాధి లేనప్పటికీ వేరే వ్యక్తి ఫైలులో ఉన్న షుగర్ టాబ్లెట్లు వేసుకోవడంతో ఆయన శరీరంలో షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పడిపోయాయి.
దీంతో అస్వస్థతకు గురికావడంతో సోమవారం ఉదయం అదే ఆస్పత్రికి వెళ్లాడు. ఆ సమయంలో ఫైల్ మారిన విషయాన్ని ఆస్పత్రి సిబ్బంది గుర్తించి, కొత్త మందులు ఇచ్చారని బాలరాజు కుటుంబ సభ్యులు తెలిపారు. పరిస్థితి విషమించడంతో సోమవారం రాత్రి కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని, అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం వేకువజామున మరణించాడని పేర్కొన్నారు. ప్రైవేట్ ఆస్పత్రి నిర్లక్ష్యం కారణంగానే బాలరాజు మరణించాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.



