కన్నడనాట ‘హిజాబ్‌’ రగడ

Hijab row takes political colour in Karnataka - Sakshi

వివాదానికి రాజకీయ రంగు

ఆందోళనలకు రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ నేతల మద్దతు

ఒక వర్గాన్ని చదువుకు దూరం చేస్తున్నారని ధ్వజం

హిజాబ్‌ను అనుమతించేది లేదు: రాష్ట్ర బీజేపీ చీఫ్‌ నళిన్‌కుమార్‌

బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో హిజాబ్‌ గొడవ రాజకీయ రంగు పులుముకుంటోంది. విద్యా సంస్థల్లో యూనిఫాం నిబంధనలు పాటించాల్సిందేనని పాలక బీజేపీ అంటుండగా హిజాబ్‌కు మద్దతుగా విపక్ష కాంగ్రెస్‌ గొంతు విప్పింది. రాష్ట్రంలో పలుచోట్ల కాలేజీల్లో హిజాబ్‌ (స్కార్ఫ్‌) ధరించిన బాలికలను అనుమతించపోవడంపై కొద్ది రోజులుగా దుమారం రేగుతున్న విషయం తెలిసిందే.

వారికి పోటీగా కొందరు స్టూడెంట్లు కాషాయ శాలువాతో క్లాసులకు హాజరవడం ఉద్రిక్తతలను మరింత పెంచింది. జనవరిలో ఉడుపిలోని పీయూ కాలేజీలో స్కార్ఫ్‌తో వచ్చిన ఆరుగురు స్టూడెంట్లను వెనక్కు పంపడంతో మొదలైన ఈ గొడవ తాజాగా కుందాపూర్, బైందూర్‌తో పాటు బెల్గావీ, హసన్, చిక్‌మగళూరు, శివమొగ్గ, మైసూరు సహా పలు చోట్లకు విస్తరించింది.

హిజాబ్‌ తమ హక్కు అంటూ ఒక వర్గానికి చెందిన విద్యార్థినులు శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ప్రదర్శనలు చేశా రు. వాటిలో పలుచోట్ల కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. హిజాబ్‌ను అనుమతించాలన్న డిమాండ్‌కు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కూడా మద్దతు పలికారు. ఈ గొడవ ద్వారా విద్యార్థినుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని విమర్శించారు. ‘‘చదువుల తల్లి సరస్వతి తన బిడ్డలకు ఎలాంటి తేడా చూప దు. జ్ఞానాన్ని అందరికీ పంచుతుంది’’ అని వసంత పంచమి పర్వదినాన్ని గుర్తు చేస్తూ ట్వీట్‌ చేశారు.

కాంగ్రెస్, బీజేపీ వాగ్యుద్ధం
కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య  హిజాబ్‌ అనుకూల ఆందోళనలకు మద్దతు ప్రకటించారు. హిజాబ్‌ ధరించినంత మాత్రాన విద్యా సంస్థల్లోకి రానివ్వకపోవడం రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కును కాలరాయడమేనన్నారు. ‘‘హిజాబ్‌ సాకుతో రాష్ట్రమంతటా మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించేందుకు బీజేపీ, ఆరెస్సెస్‌ ప్రయత్నిస్తున్నాయి. ఒక వర్గానికి చెందిన బాలికలను చదువుకు దూరం చేయడమే దీని వెనక సంఘ్‌ పరివార్‌ ప్రధాన ఎజెండా’’ అని ఆరోపించారు.

ఈ గొడవలకు మూలకారకులను తక్షణం అరెస్టు చేయాలని సీఎం బస్వరాజ్‌ బొమ్మైని డిమాండ్‌ చేశారు. ‘బేటీ బచావో, బేటీ పడావో’ అని నినాదాలిచ్చే ప్రధాని మోదీకి ఈ గొడవలు కన్పించడం లేదా అని ప్రశ్నించారు. ఈ ఆరోపణలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ నళిన్‌కుమార్‌ కటీల్‌ తోసిపుచ్చారు. సిద్ధరామయ్యే విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ‘‘ఇక్కడున్నది బీజేపీ ప్రభుత్వం. విద్యా సంస్థలు సరస్వతీ నిలయాలు.

హిజాబ్‌ తదితరాలకు అక్కడ స్థానం లేదు. వాటిల్లో తాలిబన్‌ తరహా పరిస్థితులను అనుమతించబోం. నియమ నిబంధనలకు అంతా కట్టుబడాల్సిందే’’ అన్నారు. ‘‘ఇప్పుడు హిజాబ్‌ను అనుమతిస్తే తర్వాత బుర్ఖా అంటారు. స్కూళ్లలో మసీదులు కడతామంటారు’’ అని బీజేపీ ఎమ్మెల్యే బసన్నగౌడ పాటిల్‌ అన్నారు. ఈ వివాదానికి కాంగ్రెస్, బీజేపీ రెండూ బాధ్యులేనని మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి విమర్శించారు. హిజాబ్‌ను అనుమతించకపోవడాన్ని సవాలు చేస్తూ ఉడుపి గవర్నమెంట్‌ ప్రీ వర్సిటీ కాలేజీకి చెందిన ఐదుగురు విద్యార్థినులు వేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు మంగళవారం విచారించనుంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top